చరిత్ర తెలిస్తే తప్పులు చేయరు
విజయవాడ (మొగల్రాజపురం): చరిత్ర గురించి ప్రతి ఒక్కరూ తెల్సుకోవాలని శాసనసభ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ అన్నారు. గురువారం సాయంత్రం ది కల్చరల్ సెంటర్ ఆఫ్ విజయవాడ లో డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి రచించిన ‘ఆంధ్రుల సమగ్ర చరిత్ర–సంస్కృతి’ పుస్తకంలోని అంశాలను తెలియజేస్తూSముద్రించిన కరపత్రాన్ని బుద్ధప్రసాద్ తదితరులు ఆవిష్కరించారు. చరిత్ర గురించి ప్రతి ఒక్కరూ తెల్సుకోవాల్సిన అవసరం ఉందని, దీనివల్ల తప్పులు జరగవని చెప్పారు. రాష్ట్ర చరిత్ర గురించి తెలియజేసే చాలా పుస్తకాలు వచ్చాయని కాని ఈ పుస్తకంలో రాష్ట్రంలో 1956 సంవత్సరం తర్వాత జరిగిన అన్ని అంశాలను పొందుపరిచారన్నారు.
పురావస్తుశాఖ రాష్ట్ర సంచాలకులు డాక్టర్ జి.వి. రామకృష్ణారావు మాట్లాడుతూ ఏపీపీఎస్‌సీ పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థుల కోసం రూపొందించిన ఈ పుస్తకం చరిత్ర తెల్సుకోవాలనుకున్న ప్రతి ఒక్కరూ చదవవచ్చునన్నారు. శివనాగిరెడ్డి మాట్లాడుతూ వారం రోజుల్లో పుస్తకం మార్కెట్‌లోకి వస్తోందన్నారు. కార్యక్రమంలో ఆంధ్రాఆర్ట్స్ అకాడమి కార్యదర్శి గోళ్ళ నారాయణరావు, జిల్లా రచయితల సంఘం కార్యదర్శి పూర్ణచంద్, గుమ్మా సాంబశివరావు, శ్రీనివాసరెడ్డి, కొసరాజు వెంకటేశ్వరరావు, వి.అనురాధ పాల్గొన్నారు.