సమాజ హితంకోరేదే సాహిత్యం
విజయవాడ కల్చరల్ : సమాజ హితంకోరేది సాహిత్యమని రాష్ట్ర శాసనసభ డెప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్ వివరించారు. అనంతపురానికి చెందిన విమలా శాంతి సాహిత్య సాంఘిక సాంస్కృతిక సేవాసమితి దుర్గాపురంలోని ఘంటసాల వేంకటేశ్వరరావు ప్రభుత్వ సంగీత నృత్య కళాశాలలో విమలశాంతి సాహిత్య పురస్కార ప్రదానోత్సవ సభను బుధవారం నిర్వహించింది. ముఖ్య అతిథిగా పాల్గొన్న మండలి మాట్లాడుతూ కవి క్రాంతి దర్శిని, సమాజంలో నిత్యం జరుగుతున్న మార్పులను çగమనించాలన్నారు. కవి సమాజంలో వాస్తవ జీవితాన్ని తమ సాహిత్యంలో ప్రతిబింబించాలన్నారు. అనంతపురం జిల్లా భౌతికంగా వెనుకపడినా శాంతినారాయణ లాంటి సాహితీవేత్తలవల్ల మిగితా ప్రాంతాలకు ఆదర్శంగా నిలిచిందన్నారు. కవులు నోట్లరద్దు అంశంగా తమ కలాలకు పదను పెడుతున్నారని వివరించారు. పురస్కారాల నిర్వాహకులు విమలా శాంతి సాహిత్య సాంఘీక సాంస్కృతిక సేవా సమితి నిర్వాహకులు శాంతి నారాయణ మాట్లాడుతూ గత 10 సంవత్సరాలుగా శాంతి రజనీకాంత్ స్మారక కవితా పురస్కారలను కథ, కవిత అంశంగా విశేషకృషి చేసిన వారికి పురస్కారాలు అందిస్తున్నామన్నారు. 2016 సంవత్సరానికి గానూ డాక్టర్ ప్రసాదమూర్తి రచించిన పూలండోయ్‌పూలు, బాలసుధాకర్ రచించిన ఎగరాల్సిన సమయం కవితా సంపుటులకు పురస్కారం అందిస్తున్నామన్నారు. భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు డాక్టర్ డీ.విజయభాస్కర్ మాట్లాడుతూ కళాకారులు, కవులు, ప్రాచీన కళలలు అభివృద్ధిచేయటానికి సాంస్కృతిక శాఖ కృషిచేస్తుందని వివరించారు, కార్యక్రమంలో భాగంగా డాక్టర్ ప్రసాదమూర్తి బాలసుధాకర్ మౌళీలకు పురస్కారాలను అందించారు. కవితా సంపుటిల పరిచయాన్ని ఆచార్య రాచపాలెం చంద్రశేఖర రెడ్డి, జీ.లక్ష్మీ నరసయ్యలు చేశారు, కార్యక్రమంలో ఆకాశవాణి విశ్రాంత సంచాలకులు మంజులూరి కృష్ణమూర్తి,ప్రజాసాహితి సంపాదకులు కొత్తపల్లి రవిబాబు,కవులు మందారపు హైమావతి,లబండ్ల మాధవరావు తదితరులు ప్రసంగించారు. సాంస్కృతిక కార్యక్రమంలో భాగంగా మద్దాలి సాయిచంద్రిక పలుకూచిపూడి నృత్యాంశాలను ప్రదర్శించింది.