
దొంగల ముఠా అరెస్ట్
ఇళ్లకు కన్నా లేసి బీరువాల్లో ఉన్న బంగారు ఆభణాలు దోచుకెళ్లే దొంగల ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 19 తులాల బంగారు ఆభరణాలు, రూ.5 లక్షల విలువ చేసే బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.
రాయచోటి టౌన్: ఇళ్లకు కన్నా లేసి బీరువాల్లో ఉన్న బంగారు ఆభణాలు దోచుకెళ్లే దొంగల ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 19 తులాల బంగారు ఆభరణాలు, రూ.5 లక్షల విలువ చేసే బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. రాయచోటి అర్బన్ పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో అడిషనల్ ఎస్పీ అన్బురాజన్ వివరాలు వెల్లడించారు. ఆయన కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. కొన్ని నెలలుగా వేర్వేరు చోట్ల దొంగతనాలు జరుగుతున్నాయి. దొంగలు ఎంతో నేర్పుతో తప్పించుకొంటూ వెళ్లేవారు. అయితే గుంటిమడుగు ఆలయంలో జరిగిన చోరీ వీరి గుట్టురట్టు చేసింది. వీరి చిత్రాలు ఆలయంలోని సీసీ కెమెరా ఫుటేజీలో నిక్షిప్తం కావడంతో... పట్టుకోవడానికి సులువైంది. శుక్రవారం ఉదయం రాయచోటి చౌడేశ్వరీదేవి అమ్మవారి ఆలయం వెనకాల అనుమానాస్పద స్థితిలో సంచరిస్తుండగా అదుపులోకి తీసుకున్నారు. వీరిని విచారణ చేయగా, పలు విషయాలు వెలుగు చూశాయి. చిత్తూరు జిల్లాకు చెందిన జయన్న, గాలివీడుకు చెందిన అంజనేయులు, ఆదినారాయణ పందులను మేపుకొంటూ పల్లెలకు సమీపంలో సంచరిస్తూ ఉంటారు. అవకాశం రాగానే మాటు వేసి అదును చూసి గోడలకు కన్నాలు వేయడం, గేట్లు కోసేయడం చకచకా ఇళ్లలో కానీ ఆలయాలలో కానీ బంగారు ఆభరణాలతో పాటు విలువైన వస్తువులను దోచుకెళ్తారు. వీరు ముగ్గురితో పాటు మరో వ్యక్తి ఉన్నారు. అతను పరారీలో ఉన్నాడు. వీరు రాయచోటి, లక్కిరెడ్డిపల్లె పరిధిలోని పలు మండల కేంద్రాల్లో సుమారు 8 దొంగతనాలకు పాల్పడ్డారు. రాయచోటి పరిధిలోనే నాలుగు ప్రదేశాలల్లో చోరీ చేశారు. వీరిలో కొత్తపేట రామాపురం, బోస్‌నగర్, కొత్తపల్లె, గుంటిమడుగు ఆలయంలో దొంగతనాలకు పాల్పడారు. వీరు దొంగలించిన వస్తువులలో బంగారు ఆభరణాలతో పాటు ఆలయాలలో హారతి ఇచ్చే ప్రమిదలు, ఇతర వస్తువులు ఉన్నాయి. వీరిని పట్టుకోవడంలో ఎంతో నేర్పుగా వ్యవహరించిన ఎస్‌ఐ రమేష్‌బాబు, మల్లికార్జున, బర్కత్‌తో మరి కొంతమంది పోలీసులకు రివార్డుల కోసం సిపారసు చేసినట్లు ఏఎస్పీ తెలిపారు. సమవేశంలో అర్బన్ సీఐ మహేశ్వరెడ్డి, లక్కిరెడ్డిపల్లె సీఐ పుల్లయ్య పాల్గొన్నారు.