రెప్పపాటులో ఘోరం
దశదిన కర్మకు వెళుతూ.. మృత్యు ఒడికి
– ఆటో–ఆర్టీసీ బస్సు ఢీ.. నలుగురి దుర్మరణం
– మరో పదకొండు మందికి తీవ్రగాయాలు
– క్షతగాత్రులందరినీ హైదరాబాద్‌లోని ఉస్మానియాకు తరలింపు
– నలుగురి పరిస్థితి విషమం
– మృతులు, క్షతగాత్రులందరిదీ శాఖాజిపురమే..
– గుర్రంపోడు మండలం కాల్వపల్లి శివారులో దుర్ఘటన
గుర్రంపోడు : మండలంలోని శాఖాజీపురం గ్రామానికి చెందిన మద్ది శ్రీనయ్య(35) సమీప బంధువు దశ దినకర్మ బుధవారం పీఏపల్లి మండలం పొగాకోనిగూడెంలో జరగనుంది. ఈ కార్యక్రమానికి హాజరయ్యేందుకు శ్రీనయ్య దాయాదులతో పాటు ఇతర బంధువులు అంతా 15 మంది కలిసి హరికృష్ణ ఆటోలో బయలుదేరారు.
పది నిమిషాలకే..
బంధువులందరూ మాట్లాడుకుంటూ ఆటోలో వెళ్లిన పది నిమిషాల వ్యవధిలో ఐదు కిలోమీటర్ల దూరం ప్రయాణించి కాల్వపల్లి శివారుకు చేరుకున్నారు. ఇంతలోనే మృత్యువు ఆర్టీసీ బస్సు రూపంలో వచ్చి కబళించేసింది. రెండు వాహనాలు ఎదురెదురుగా ఢీకొట్టుకోవడంతో ఆటోలో ప్రయాణిస్తున్న మద్ది శ్రీనయ్య, గొడ్డేటి అలివేలు(40), మద్ది మౌనిక(16) అక్కడికక్కడే మృతిచెందగా, సన్నాయిల ఈదమ్మ(50), మద్ది బక్కమ్మ, మద్ది వెంకటమ్మ, మద్ది సాయికుమార్, గన్నెబోయిన సాయమ్మ, ఆవుల శైలజ, ఆవుల గౌతంకృష్ణ, మద్దిరాజు, ఎన్. శ్రీను, ఎం. స్వామి,ఎ.రాజు, డ్రైవర్ అందుగుల హరికృష్ణ తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో ఈదమ్మ మృతిచెందింది. తీవ్రంగా గాయపడిన సాయికుమార్, బలక్కమ్మ, గౌతమ్ కృష్ణ (ఏడాది బాలుడు) డ్రైవర్ హరికృష్ణ పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్టు బంధువులు తెలిపారు.
అంతా సమీప బంధువులే..మిన్నంటిన రోదనలు
ఆటో– ఆర్టీసీ బస్సు ఢీకొట్టుకున్న ప్రమాదంలో మృతిచెందిన, గాయపడిన వారందరూ శాఖాజీపురం వాసులే. వీరందరూ సమీప బంధువులు. ఆటోలో వెళ్లిన కాసేపటికే ప్రమాదం జరిగిందని తెలియడంతో గ్రామస్తులంతా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్నారు. పెద్ద సంఖ్యలో గ్రామస్తులు, బం«ధువులు చేరుకోవడంతో ఆ ప్రాంతమంతా రోదనలు మిన్నంటాయి. క్షతగాత్రుల్లో ఏడాది వయస్సు గల ఆవుల కృష్ణ అనే బాలుడు ఉన్నాడు. బాలుడి తల్లి శైలజకూ తీవ్ర గాయాలయ్యాయి. చామలేడు గ్రామానికి చెందిన శైలజ ఈ కార్యానికి హాజరయ్యేందుకు తల్లి గారి గ్రామమైన శాఖాజిపురం వచ్చింది.
కారణాలివేనా..?
శాఖాజిపురం నుంచి బయలుదేరిన ఆటో కాల్వపల్లి, గుమ్మడవెల్లి, కొండమల్లేపల్లి మీదుగా పీఏపల్లి మండలంలోని పొగాకోనిగూడేనికి చేరుకోవాల్సి ఉంది. అయితే కాల్వపల్లి వాగుదాటిన తరువాత రోడ్డు ఎత్తుగా ఉంటుంది. ఆటో వాగు దాటి మూలమలుపు తిరిగే ప్రాంతంలో రోడ్డుకు ఇరువైపులా దట్టంగా కంపచెట్లు పెరిగాయి. దీంతో ఎదురుగా వచ్చే వాహనాలు డ్రైవర్‌కు కనిపించే అవకాశాలు తక్కువగా ఉంటాయి. దీనికి తోడు మితిమీరిన వేగం కూడా ప్రమాదానికి ఒక కారణమై ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు.
బస్సు డ్రైవర్ బ్రేకు వేసినా..
గుమ్మడవెల్లి గ్రామం నుంచి బయలుదేరిన ఆర్టీసీ బస్సుకు కాల్వపల్లి శివారు డౌన్‌లో ఉంటుంది. దీంతో ఆర్టీసీ డ్రైవర్ మితిమీరిన వేగంతో వచ్చి బ్రేక్ వేసినా కంట్రోల్ కాలేదని సంఘటన స్థలంలోని రోడ్డుపై ఉన్న టైర్ల అచ్చులను బట్టి తెలుస్తోంది. కాగా, బస్సు డ్రైవర్ కాల్వపల్లి వైపు వస్తున్న ఓ బైక్‌ను ఓవర్‌టేక్ చేసి వేగంతో వస్తున్నాడని, మూలమలుపు నుంచి వేగంగా వస్తున్న ఆటోను తప్పించేందుకు శతావిధాల ప్రయత్నించి బ్రేకు కూడా వేశాడని తెలుస్తోంది. అయితే పక్కనే బైక్ ఉండడంతో బస్సును రోడ్డు కిందకు దించలేకపోయి ఉండడంతోనే సింగిల్‌రోడ్డుపై ఎదురుగా ఒక్కసారిగా ఆటో రావడంతో ప్రమాదం జరిగి ఉండొచ్చని స్థానిక రైతులు చర్చించుకుంటున్నారు.
ఘటన స్థలాన్ని పరిశీలించిన డీఎస్పీ
ప్రమాద విషయం తెలుసుకున్న డీఎస్పీ జి. చంద్రమౌళి, నాంపల్లి సీఐ నాంపల్లి సీఐ బాలగంగిరెడ్డి, ఎస్‌ఐ సాయి వెంకట కిశోర్ ఘటన స్థలాన్ని పరిశీలించారు. 108 వాహనంలో క్షతగాత్రులను, మృతదేహాలను దేవరకొండ ఏరియా ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉన్న వారందరినీ అక్కడి నుంచి హైదరాబాద్‌కు తీసుకెళ్లారు. మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం బంధువులకు అప్పగించారు. కాగా, ఆర్టీసీ బస్సు డ్రైవర్ ప్రమాదం జరిగిన వెంటనే అక్కడి నుంచి పరారయ్యాడు. సీఐ పర్యవేక్షణలో బస్సును గుర్రంపోడు పోలీస్‌స్టేషన్‌కు తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ తెలిపారు.