
‘శత’విధాల పోరు
సాక్షి నెట్‌వర్క్: కనీస వేతనం, సమస్యల పరిష్కారం కోసం వంద రోజులుగా ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో ఆశ వర్కర్లు తమ పోరును ఉధృతం చేయాలని నిర్ణయించారు. 100 రోజులు.. 100 మంది.. 100 కి.మీ. పేరుతో చలో హైదరాబాద్‌కు శ్రీకారం చుట్టారు. ఈ మేరకు గురువారం అన్ని జిల్లాల్లో పాదయాత్రలు ప్రారంభించారు. వామపక్షాలతోపాటు వివిధ పార్టీల నేతలు, పలు సంఘాల నాయకులు ఇందులో పాల్గొన్నారు. మహబూబ్‌నగర్‌లో పాదయాత్రను ప్రారంభించిన సీపీఎం జాతీయ కార్యవర్గ సభ్యుడు బీవీ రాఘవులు.. ప్రభుత్వంపై మండిపడ్డారు.
తెలంగాణ ఏర్పాటు తర్వాత ఏ ఒక్కరికీ కష్టం రానివ్వమని హామీ ఇచ్చిన సీఎం కేసీఆర్ ఆశ కార్యకర్తల విషయంలో ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారని ప్రశ్నించారు. బతుకమ్మ, ఇతర పథకాలకు కోట్లు ఖర్చు చేస్తున్న ప్రభుత్వం.. గ్రామాల్లో ప్రజల ఆరోగ్యం పరిరక్షిస్తున్న ఆశ కార్యకర్తలకు ఎందుకు జీతాలు పెంచడం లేదని నిలదీశారు. ఆశ వర్కర్లపై సీఎం, మంత్రులు కక్ష సాధింపు ధోరణితో వ్యవహరించడం తగదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. వరంగల్‌లో ఆశ కార్యకర్తల పాదయాత్ర సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. టీడీఎల్పీ నేత ఎర్రబెల్లి దయూకర్‌రావు మాట్లాడుతూ.. కేసీఆర్ మాటలు పిట్టల దొరను తలపించేలా ఉన్నాయని ఎద్దేవా చేశారు.
కరీంనగర్ జిలా సిరిసిల్లలో సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు చెరుపల్లి సీతారాములు, ఆదిలాబాద్ జిల్లా కెరమెరిలో ఆల్ ఇండియూ రైతు సంఘం ఉపాధ్యక్షుడు సారంపల్లి మల్లారెడ్డి ఆశ వర్కర్ల పాదయాత్రను ప్రారంభించారు. నిజామాబాద్ జిల్లా కామారెడ్డిలో ప్రారంభమైన పాదయాత్రలో సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి భూపాల్ తదితరులు పాల్గొన్నారు. హైదరాబాద్‌లో బషీర్‌బాగ్‌లోని విద్యుత్ అమర వీరుల స్థూపం నుంచి సుందరయ్య పార్కు వరకు సీఐటీయూ ఆధ్వర్యంలో పాదయాత్ర నిర్వహించారు. నల్లగొండలో హైకోర్డు మాజీ న్యాయమూర్తి జస్టిస్ చంద్రకుమార్ జెండా ఊపి పాదయాత్ర ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఆశ వర్కర్లకు కనీస వేతనాలు అమలు చేయాలన్నారు.