తపాలాశాఖ ద్వారా పుష్కర జలం | By tapalasakha Pushkarni water | Sakshi
Sakshi News home page

తపాలాశాఖ ద్వారా పుష్కర జలం

Published Thu, Aug 11 2016 11:34 PM | Last Updated on Mon, Sep 4 2017 8:52 AM

By tapalasakha Pushkarni water

  • రూ.30లు చెల్లిస్తే వాటర్‌ బాటిల్‌ హోమ్‌ డెలివరీ
  • ఖమ్మం, కొత్తగూడెం, భద్రాచలం నుంచి సరఫరాకు చర్యలు
  • నేటి నుంచి బుకింగ్‌ ప్రారంభం

  • ఖమ్మం గాంధీచౌక్‌: నేటి నుంచి కృష్ణా పుష్కరాలు ప్రారంభమవుతున్నాయి. పుష్కర సమయంలో నదీ స్నానం వలన పుణ్యం వస్తుందని, ఆ సమయంలో దేవతలంతా పుష్కరునితో నదిలో ప్రవేశిస్తారని నమ్మకం. పుష్కర స్నానం ఒకసారి చేస్తే 12 సంవత్సరాల కాలం 12 పుణ్యనదుల్లో స్నానం చేసినంత పుణ్యం లభిస్తుందని, అశ్వమేధ యాగం చేసినంత ఫలితం వస్తుందని, మోక్ష ప్రాప్తి కూడా కలుగుతుందని పురాణాలు చెబుతున్నాయి. పోస్టల్‌ శాఖకు ప్రజలతో నిత్యం సంబంధాలు ఉండటంతో ఆ శాఖ ఈ పుణ్య కార్యక్రమాన్ని చేపట్టింది. శుక్రవారం నుంచి ప్రారంభమయ్యే కృష్ణానదీ పుష్కరాల సందర్భంగా ఆ నదీ జలాన్ని ప్రజలకు అందించేందుకు తపాలా శాఖ కార్యక్రమాన్ని చేపట్టింది. పుష్కరాలకు నదికి వెళ్లలేని, వెళ్లని వారి కోసం తపాల శాఖ ఈ సౌకర్యాన్ని ఏర్పాటు చేసింది. గతంలో గోదావరి పుష్కరాల సందర్భంగా కూడా తపాలా శాఖ ఆ నదీ జలాలను సరఫరా చేసింది. అదే తరహాలో కృష్ణా పుష్కరాల సందర్భంగా కూడా జలాలను అందించాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని తపాల శాఖ చేపట్టింది. విజయవాడలో శుద్ధి చేసిన కృష్ణా పుష్కర జలాన్ని 500 మి.లీ బాటిళ్లలో నింపించి ఇక్కడకు తెప్పించే ఏర్పాట్లను చేస్తున్నారు. ఒక్కో బాటిల్‌ ఖరీదు రూ.30 లుగా నిర్ణయించారు. నీరు అవసరం ఉన్న ప్రజలు, భక్తులు సమీప పోస్టాఫీసుల్లో బుకింగ్‌ చేసుకునే అవకాశాన్ని కల్పించారు. ఆ నీటి బాటిళ్లను పోస్టు మ్యాన్‌ ఇంటికి తీసుకువచ్చి (హోమ్‌ డెలవరీ) అప్పగిస్తారు. నీటిని మన జిల్లాల్లో ఖమ్మం, కొత్తగూడెం, భద్రాచలం కేంద్రాల్లో దింపుతారు. ఈ మూడు కేంద్రాల నుంచి ప్రత్యేక వాహనాల్లో నిర్ణయించిన రూట్లలో వాటర్‌ బాటిళ్లను పోస్టాఫీసులకు తరలిస్తారు. అక్కడ నుంచి నీటిని బుక్‌ చేసుకున్న వారికి పుష్కర నీళ్ల బాటిళ్లను హోమ్‌ డెలివరీ చేస్తారు. ఈ నెల 12 నుంచి 23వ తేదీ వరకు ఈ ప్రక్రియ జగుతుందని జిల్లా పోస్టల్‌ శాఖ సూపరింటెండెంట్‌ మల్లికార్జున శర్మ ‘సాక్షి’కి తెలిపారు. పుణ్య స్నానాలకు వెళ్లలేని భక్తులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆయన కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement