సీమద్రోహి చంద్రబాబు: బైరెడ్డి
కర్నూలు: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు రాయలసీమ ద్రోహి అని రాయలసీమ పరిరక్షణ సమితి(ఆర్పీఎస్) అధ్యక్షుడు బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి ఆరోపించారు. ప్రత్యేక రాయలసీమ రాష్ట్రమే లక్ష్యంగా ఆదివారం..కర్నూలు జిల్లా ఆలూరు మండలం మూసానహళ్లి గ్రామం నుంచి రాయలసీమ చైతన్య బస్సు యాత్రను ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాయలసీమ జిల్లాల అభివద్ధిని చంద్రబాబు మరిచిపోయారన్నారు. సీమవాసి అయినప్పటికీ కోస్తా జిల్లాలపై ప్రేమ చూపుతున్నారన్నారు. సీమలో కష్ణా, పెన్నా, తుంగభద్ర నదులు పారుతున్నా.. ఇక్కడి ప్రజలకు తాగు, సాగునీరు అందడం లేదన్నారు. సీమ జిల్లాల్లో పేదరికం, నిరుద్యోగ సమస్య మున్ముందు మరింత తీవ్రరూపం దాల్చే అవకాశం ఉందని బైరెడ్డి అన్నారు. ఉన్నత చదువులు చదివిన ఎంతోమంది నిరుద్యోగులు ‘ఉపాధి’పనులకు వెళ్తున్నారన్నారు.
రాజధాని అమరావతి జపం చేస్తూ సీమ జిల్లాలను సీఎం పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారన్నారు. కనీసం వర్షపాతం లేకపోవడంతో పంటల సాగు కోసం చేసిన అప్పులు తీర్చే దారిలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నప్పటికీ.. ప్రభుత్వం స్పందించడం లేదన్నారు. అంతకముందు గ్రామానికి చేరుకున్న బెరైడ్డి రాజశేఖర్‌రెడ్డికి గ్రామ సర్పంచ్ సోమశేఖర్, ప్రజలు పెద్ద సంఖ్యలో స్వాగతం తెలిపారు. జై రాయలసీమ అంటూ నినాదాలు చేశారు.