సర్కారుపై బెరైడ్డి ధ్వజం
ఆగష్టు 12 నుంచి రాయలసీమ పుష్కరాలు
నందికొట్కూరు: ‘సీఎం చంద్రబాబు పట్టిసీమ ద్వారా గోదావరి నీటిని కృష్ణా నదిలోకి తెచ్చి కృష్ణా పుష్కర స్నానాలు చేయమంటున్నారు.. ఆయనకేమైనా మతి ఉంది మాట్లాడుతున్నారా?. ఆ నీటిలో పుష్కర స్నానం చేస్తే పాపాలు పోకపోగా మరిన్ని అంటుకుంటాయి’ అంటూ రాయలసీమ పరిరక్షణ సమితి అధ్యక్షుడు బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి అన్నారు.
పట్టణంలోని స్వగృహంలో ఆయన మంగళవారం విలేకరులతో మాట్లాడారు. పిచ్చోడి చేతి రాయి అనే చందంగా రాష్ట్రంలో పాలన కొనసాగుతోందన్నారు. పుష్కరాల నిర్వహణకు ప్రభుత్వం రూ.1277 కోట్లు మంజూరు చేసిందని, అయితే ఇందులో 75శాతం నిధులను టీడీపీ నాయకులు, కార్యకర్తలే కొల్లగొట్టారని ఆరోపించారు. కృష్ణ పురష్కరాల నిధులు తెలుగు తమ్ముళ్ల జేబులు నింపేందుకేనని ధ్వజమెత్తారు. రైతు రుణమాఫీ సొమ్ము వడ్డీలకు కూడా సరిపోవడం లేదన్నారు.
ఆగస్టు 12న రాయలసీమ పుష్కరాలు
ఆగష్టు 12 సాయంత్రం 4 గంటలకు రాయలసీమ పురష్కరాలు ప్రారంభిస్తునట్లు బెరైడ్డి తెలిపారు. ఈ సందర్భంగా వెయ్యి మంది మత్తయిదువులతో కృష్ణమ్మకు మంగళహారతులిచ్చే కార్యక్రమం చేపడతామన్నారు. 13న హోమాలు నిర్వహిస్తునట్లు చెప్పారు.