ఎవడబ్బ సొమ్మని వందల కోట్ల ఖర్చు?
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాజధాని పేరుతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రియల్ ఎస్టేట్ వ్యాపారానికి తెరలేపారని రాయలసీమ పరిరక్షణ సమితి అధినేత బైరెడ్డి రాజశేఖరరెడ్డి తీవ్రస్థాయిలో ఆరోపించారు. సోమవారం హైదరాబాద్‌లో తన నివాసంలో బైరెడ్డి విలేకరులతో మాట్లాడుతూ, రాజధాని పేరుతో చంద్రబాబు రూ.లక్షల కోట్ల రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని దుయ్యబట్టారు. శంకుస్థాపన ఖర్చుపై న్యాయస్థానంలో పిల్ దాఖలు చేస్తామన్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి బతికి ఉంటే రాష్ట్రం విడిపోయేది కాదన్నారు.
సీమ వాసులకు చీకటి రోజు: అమరావతి శంకుస్థాపనకు ముహూర్తం తేదీ 22న రాయలసీమ వాసులకు చీకటి దినమని బైరెడ్డి అన్నారు. సీమవాసులెవరూ శంకుస్థాపన కార్యక్రమానికి వెళ్లరాదని, అలా వెళ్తేవారు రాయలసీమ ద్రోహులే అని చెప్పారు. తాను శంకుస్థాపనకు రానని, తనకు ఆహ్వానం పంపవద్దని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి లేఖ రాయడాన్ని స్వాగతిస్తున్నామన్నారు.