ముహూర్తం ఖరారు
► ఏప్రిల్ 2న మంత్రివర్గ విస్తరణ ఖాయమంటున్న సర్కారు
► జిల్లాకు మరో మంత్రి పదవి దక్కేనా..?
► మాగుంటకు మండలి చైర్మన్, లేదా మంత్రి పదవి..
► శిద్దా రాఘవరావు శాఖలో మార్పునకు అవకాశం
► జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి రావెలకు పదవీగండం!
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: ఏప్రిల్ 2న రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ ఖాయమన్న ప్రకటనతో జిల్లాకు మరో మంత్రి పదవి వస్తుందా.. రాదా అన్నవిషయం చర్చ నీయాంశంగా మారింది. నిన్నమొన్నటి వరకూ ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసులురెడ్డికి మంత్రి పదవి ఖాయమన్న ప్రచారం జరిగింది. తాజాగా మంత్రి పదవి కాకుండా ఆయనకు మండలి చైర్మన్ పదవి ఇవ్వనున్నారనే వార్తలు జోరందుకున్నాయి. ఈ నేపథ్యంలో అసలు జిల్లాకు రెండో మంత్రి పదవి లేదన్న ప్రచారమూ సాగుతోంది.
జిల్లా నుంచి ఇప్పటి వరకూ శిద్దా రాఘవరావు ఒక్కరే మంత్రిగా ఉన్నారు. మంత్రివర్గ విస్తరణలో జిల్లాకు మరో మంత్రి పదవి దక్కడం ఖాయమన్న ప్రచారం చాలా కాలంగా సాగుతోంది. ఎమ్మెల్సీ మాగుంటకు మంత్రి పదవి దక్కనుందన్న ప్రచారం జరిగింది. ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చే సమయంలోనే మంత్రి పదవి ఇస్తానని సీఎం చంద్రబాబు మాటిచ్చినట్లు టీడీపీ వర్గాల్లో ప్రచారం ఉంది. నెల్లూరు జిల్లాకే చెందిన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాల్సి వస్తే మాగుంటకు సమీకరణాలను బట్టి మండలి చైర్మన్ పదవి ఇస్తారన్న ప్రచారమూ జరుగుతోంది. తూర్పు గోదావరి జిల్లాకు చెందిన రెడ్డి సుబ్రమణ్యంకు మండలి వైస్ చైర్మన్ పదవి కట్టబెట్ట నుండడంతో చైర్మన్ పదవి రెడ్డి సామాజికవర్గానికి అప్పగించనున్నట్లు తెలుస్తోంది. అందుకు మాగుంట సమర్ధుడని చంద్రబాబు భావిస్తున్నట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం ఉంది. మాగుంట మూడుసార్లు పార్లమెంట్ సభ్యుడిగా పనిచేశారు. సభా నియమ, నిబంధనలపై అవగాహన ఉంది. సౌమ్యుడు, అన్ని వర్గాల నుంచి సానుకూలత, సభను సజావుగా నడిపించే అవకాశం ఉంటుందనే అంశాలను బేరీజు వేసి ఆయనను మండలి చైర్మన్ చేస్తారా.. లేక మంత్రి పదవి ఇస్తారా అన్నది వేచి చూడాల్సి ఉంది.
శిద్దా శాఖలు మారనున్నాయా..!: జిల్లాకు మరో మంత్రి పదవి ఇచ్చినా.. ఇవ్వక పోయినా మంత్రి శిద్దా రాఘవరావు శాఖల్లో మార్పు ఉంటుందన్న ప్రచారం ఉంది. ముఖ్యంగా రవాణాశాఖ లేదా రోడ్లు, భవనాల శాఖల్లో ఒక శాఖను ఆయన నుంచి తప్పించే అవకాశముందని పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అయితే శిద్దాపై ముఖ్య మంత్రికి సదాభిప్రాయమే ఉంది. నమ్మిన బంటుగా ఉన్న శిద్దా కోరుకున్నట్లే ముఖ్యమంత్రి నడుచుకునే అవకాశముందని, శిద్దాకు ఇష్టంలేని పక్షంలో ఆయన శాఖల్లో మార్పులు ఉండే అవకాశం లేదని పార్టీ వర్గాల సమాచారం.
రావెల పదవికి ఎసరు..: జిల్లా ఇన్‌చార్జి మంత్రి రావెల కిషోర్‌బాబును మంత్రి వర్గం నుంచి తప్పించడం ఖాయమన్న ప్రచారం ఉంది. మంత్రి రావెల పనితీరుపై ముఖ్యమంత్రి ఇప్పటికే తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఆయనను తప్పించి, మరొకరికి మంత్రి పదవి కట్టబెట్టనున్నట్లు సమాచారం. ఇదే జరిగితే రావెలకు జిల్లా ఇన్‌చార్జి పదవి కూడా ఊడటం ఖాయంగా కనిపిస్తోంది.