
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు పరిఢవిల్లుతున్నాయని మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ నేత శిద్ధా రాఘవరావు తెలిపారు. దేశంలో అన్ని రాష్ట్రాల కంటే అభివృద్ధి, సంక్షేమంలో మన రాష్ట్రం ముందంజలో ఉందన్నారు. తాడేపల్లివైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజల కోసం ఎప్పుడు ఏ కొత్త పథకం ప్రవేశపెడతారా.. అని దేశంలోని మిగితా ముఖ్యమంత్రులందరూ ఆసక్తిగా ఎదురుచూస్తుంటారన్నారు. ఏపీ సీఎంను అందరూ ఆదర్శంగా తీసుకుంటున్నారన్నారు.
అమరజీవి పొట్టి శ్రీరాములు చేసిన త్యాగానికి గుర్తుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో నవంబర్ ఒకటిన ఆంధ్ర రాష్ట్ర అవతరణ వేడుకలు నిర్వహించుకునే వాళ్లమన్నారు. అయితే, రాష్ట్ర విభజన అనంతరం చంద్రబాబు నిర్వాకంతో నవంబర్ ఒకటో తేదీ ప్రాధాన్యత తగ్గిపోయిందన్నారు. ఇలా చంద్రబాబు చేసిన పొరపాటును సీఎం జగన్ సరిదిద్ది ఆర్యవైశ్యుల ఆత్మగౌరవం కాపాడారని తెలిపారు. అలాగే, వాసవీ దేవాలయాలకు ఆనాడు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ఇచ్చినట్లుగానే, ఇప్పుడు సీఎం జగన్ మినహాయింపులు ఇస్తున్నారని తెలిపారు.