ravela kishorebabu
-
ఆగ్రహజ్వాల
-
ఆగ్రహజ్వాల
► మంత్రి పదవి ఆశించి భంగపడ్డ నేతలు ► నిరాశలో ధూళిపాళ్ల, మోదుగుల, యరపతినేని ► రావెలను తొలగించడంపై దళిత సంఘాల ఆందోళన ► మోదుగుల కార్యాలయంలో కార్యకర్తల సమావేశం మంత్రి పదవులు ఆశించినపలువురు అధికార పార్టీ నేతలు భంగపడ్డారు. పార్టీకి విధేయులుగా ఉన్నా సీఎం చంద్రబాబు తమకు మొండిచేయి చూపారని ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన తనను నిర్లక్ష్యం చేశారని పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర ఆవేదన చెందుతుండగా.. పల్నాడులోనే సీనియర్‌నైన తనకు హామీ ఇచ్చి విస్మరించారని గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.. ప్రత్తిపాడు ఎమ్మెల్యే రావెల కిషోర్‌బాబును మంత్రి పదవి నుంచి తొలగించడంతో ఆయన తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.. టీడీపీకి రాజీనామా చేస్తారన్న ప్రచారం సాగుతోంది.. సాక్షి, గుంటూరు: మంత్రి పదవిపై ఆశలు పెంచుకుని బలమైన లాబీయింగ్ సాగించిన సొంత సామాజికవర్గ నేతలకు సీఎం చంద్రబాబునాయుడు గట్టిగా షాక్ ఇచ్చారు. వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనందబాబుకు అమాత్య యోగం దక్కి ఆదివారం ప్రమాణ స్వీకారం చేయగా మిగిలిన ముఖ్యనేతలు కొందరు పదవి ఆశించి భంగపడ్డారు. ఈ క్రమంలో మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు రంగంలో దిగి బుజ్జగింపుల పర్వం కొనసాగించినట్లు సమాచారం. ‘ఆనంద’మానందమాయే.. వేమూరు నుంచి రెండు పర్యాయాలు వరుసగా ఎమ్మెల్యేగా గెలుపొందిన నక్కా ఆనంద్‌బాబుకు మంత్రి పదవి దక్కింది. తెనాలి ఎమ్మెల్యే ఆలపాటి రాజా లాబీయింగ్, ఎస్సీల్లో సీనియర్ ఎమ్మెల్యే కావడం.. రెండు అంశాలూ నక్కా ఆనంద్‌బాబుకు కలిసి వచ్చాయి. దీంతో ఆదివారం ప్రమాణ స్వీకారం చేశారు. సొంత సామాజికవర్గంలోనే.. అధికార పార్టీ సొంత సామాజికవర్గంలో అసమ్మతి జ్వాలలు భగ్గుమంటున్నాయి. రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా, పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న జీవీ ఆంజనేయులు మంత్రి పదవి కోసం ప్రయత్నించి విఫలమయ్యారు. ఐదు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిచిన తనకు అన్యాయం జరిగిందని పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర, పల్నాడులోనే సీనియర్ ఎమ్మెల్యే అయిన తనకు హామీ ఇచ్చి విస్మరించారని గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ధూళిపాళ్ల నరేంద్ర ఎమ్మెల్యే పదవికి, టీడీపీకి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ చింతలపూడిలో ఆయన నివాసం వద్ద పార్టీ శ్రేణులు ఆందోళన చేశారు. రెండు రోజుల్లో సీఎంను కలిసి సమస్యను అక్కడే పరిష్కరించుకుంటామని శ్రేణులకు ఆలపాటి చెప్పినట్లు సమాచారం. ఎంపీ రాయపాటి సాంబశివరావు కూడా అసంతృప్తిలో ఉన్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్‌కు మంత్రి పదవి ఇప్పించే క్రమంలోరాయపాటి బలమైన లాబీయింగ్ చేశారు. చివరి నిమిషంలో పదవి చేజారడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో ప్రత్తిపాటి పుల్లారావును తొలగిస్తారని బలంగా ప్రచారం సాగింది. చివర్లో పరిస్థితి మారిపోవడంతో ప్రత్తిపాటి తన స్థానాన్ని కాపాడుకున్నారు. దీంతో జిల్లాలో అదే సామాజిక వర్గానికి చెందిన వారెవరికీ చోటు దక్కలేదు. రావెల తీవ్ర అసంతృప్తి మంత్రి పదవి నుంచి తొలగించడంపై ప్రత్తిపాడు ఎమ్మెల్యే రావెల కిషోర్‌బాబు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఆదివారం సాయంత్రం వరకూ పార్టీ శ్రేణులకు అందుబాటులోకి రాలేదు. ఉదయం రాష్ట్ర మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, పలువురు నేతలు రావెలను కలిసి మాట్లాడారు. మరోవైపు రావెలను మంత్రివర్గం నుంచి తొలగించడాన్ని నిరసిస్తూ ప్రత్తిపాడులోని పాత మద్రాసు రోడ్డులో దళిత సంఘాలు ధర్నా నిర్వహించి చంద్రబాబు తీరుపై ధ్వజమెత్తాయి. ఆయన పార్టీకి రాజీనామా చేస్తారని విస్తృతంగా ప్రచారం సాగుతోంది. మరో జాతీయ పార్టీలో చేరే దిశగా కసరత్తు చేస్తున్నారని వార్తలొస్తున్నాయి. మోదుగులకు మొండి చేయి గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాలరెడ్డి తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. నియోజకవర్గంలోని కార్యకర్తలు, డివిజన్ అధ్యక్షులు ఎమ్మెల్యే కార్యాలయంలో సమావేశమై తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు. 2009 ఎన్నికల్లో నరసరావుపేట పార్లమెంటు నుంచి ఎంపీగా గెలుపొందారు. ఆ తర్వాత రెండో పర్యాయం ఎంపీ రాయపాటి సాంబశివరావు కోసం సీఎం చంద్రబాబు సూచనతో నరసరావుపేట ఎంపీ స్థానాన్ని వదులుకుని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి అంగీకరించి వచ్చారు. ఈ క్రమంలో పార్టీ అధికారంలోకి రాగానే మంత్రి పదవి ఇస్తామని సీఎం చంద్రబాబు, లోకేష్‌లు హామీ ఇచ్చారు. అయితే రెండు పర్యాయాలు పదవి దక్కకపోవడంతో తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఇక బీసీ కోటాలో అనగాని సత్యప్రసాద్ బలంగా ప్రయత్నించి విఫలం అయ్యారు. -
ముహూర్తం ఖరారు
► ఏప్రిల్ 2న మంత్రివర్గ విస్తరణ ఖాయమంటున్న సర్కారు ► జిల్లాకు మరో మంత్రి పదవి దక్కేనా..? ► మాగుంటకు మండలి చైర్మన్, లేదా మంత్రి పదవి.. ► శిద్దా రాఘవరావు శాఖలో మార్పునకు అవకాశం ► జిల్లా ఇన్చార్జ్ మంత్రి రావెలకు పదవీగండం! సాక్షి ప్రతినిధి, ఒంగోలు: ఏప్రిల్ 2న రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ ఖాయమన్న ప్రకటనతో జిల్లాకు మరో మంత్రి పదవి వస్తుందా.. రాదా అన్నవిషయం చర్చ నీయాంశంగా మారింది. నిన్నమొన్నటి వరకూ ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసులురెడ్డికి మంత్రి పదవి ఖాయమన్న ప్రచారం జరిగింది. తాజాగా మంత్రి పదవి కాకుండా ఆయనకు మండలి చైర్మన్ పదవి ఇవ్వనున్నారనే వార్తలు జోరందుకున్నాయి. ఈ నేపథ్యంలో అసలు జిల్లాకు రెండో మంత్రి పదవి లేదన్న ప్రచారమూ సాగుతోంది. జిల్లా నుంచి ఇప్పటి వరకూ శిద్దా రాఘవరావు ఒక్కరే మంత్రిగా ఉన్నారు. మంత్రివర్గ విస్తరణలో జిల్లాకు మరో మంత్రి పదవి దక్కడం ఖాయమన్న ప్రచారం చాలా కాలంగా సాగుతోంది. ఎమ్మెల్సీ మాగుంటకు మంత్రి పదవి దక్కనుందన్న ప్రచారం జరిగింది. ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చే సమయంలోనే మంత్రి పదవి ఇస్తానని సీఎం చంద్రబాబు మాటిచ్చినట్లు టీడీపీ వర్గాల్లో ప్రచారం ఉంది. నెల్లూరు జిల్లాకే చెందిన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాల్సి వస్తే మాగుంటకు సమీకరణాలను బట్టి మండలి చైర్మన్ పదవి ఇస్తారన్న ప్రచారమూ జరుగుతోంది. తూర్పు గోదావరి జిల్లాకు చెందిన రెడ్డి సుబ్రమణ్యంకు మండలి వైస్ చైర్మన్ పదవి కట్టబెట్ట నుండడంతో చైర్మన్ పదవి రెడ్డి సామాజికవర్గానికి అప్పగించనున్నట్లు తెలుస్తోంది. అందుకు మాగుంట సమర్ధుడని చంద్రబాబు భావిస్తున్నట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం ఉంది. మాగుంట మూడుసార్లు పార్లమెంట్ సభ్యుడిగా పనిచేశారు. సభా నియమ, నిబంధనలపై అవగాహన ఉంది. సౌమ్యుడు, అన్ని వర్గాల నుంచి సానుకూలత, సభను సజావుగా నడిపించే అవకాశం ఉంటుందనే అంశాలను బేరీజు వేసి ఆయనను మండలి చైర్మన్ చేస్తారా.. లేక మంత్రి పదవి ఇస్తారా అన్నది వేచి చూడాల్సి ఉంది. శిద్దా శాఖలు మారనున్నాయా..!: జిల్లాకు మరో మంత్రి పదవి ఇచ్చినా.. ఇవ్వక పోయినా మంత్రి శిద్దా రాఘవరావు శాఖల్లో మార్పు ఉంటుందన్న ప్రచారం ఉంది. ముఖ్యంగా రవాణాశాఖ లేదా రోడ్లు, భవనాల శాఖల్లో ఒక శాఖను ఆయన నుంచి తప్పించే అవకాశముందని పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అయితే శిద్దాపై ముఖ్య మంత్రికి సదాభిప్రాయమే ఉంది. నమ్మిన బంటుగా ఉన్న శిద్దా కోరుకున్నట్లే ముఖ్యమంత్రి నడుచుకునే అవకాశముందని, శిద్దాకు ఇష్టంలేని పక్షంలో ఆయన శాఖల్లో మార్పులు ఉండే అవకాశం లేదని పార్టీ వర్గాల సమాచారం. రావెల పదవికి ఎసరు..: జిల్లా ఇన్చార్జి మంత్రి రావెల కిషోర్‌బాబును మంత్రి వర్గం నుంచి తప్పించడం ఖాయమన్న ప్రచారం ఉంది. మంత్రి రావెల పనితీరుపై ముఖ్యమంత్రి ఇప్పటికే తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఆయనను తప్పించి, మరొకరికి మంత్రి పదవి కట్టబెట్టనున్నట్లు సమాచారం. ఇదే జరిగితే రావెలకు జిల్లా ఇన్చార్జి పదవి కూడా ఊడటం ఖాయంగా కనిపిస్తోంది. -
మంత్రి రావెలకు చేదు అనుభవం !!
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ సాంఘిక, సంక్షేమశాఖ మంత్రి రావెల కిషోర్‌బాబుకు చేదు అనుభవం ఎదురైంది. విజయవాడలో ప్రభుత్వ ఆధ్వర్యంలో గురువారం రాష్ట్రస్థాయి స్వచ్ఛ వసతి గృహం వర్క్‌షాప్ జరిగింది. ఈ వర్క్‌షాప్‌లో మంత్రి రావెలను హాస్టళ్ల వార్డెన్లు నిలదీశారు. ప్రభుత్వ హాస్టళ్ల మూసివేతపై సమాధానం చెప్పాలని నినాదాలు చేశారు. దీంతో కంగుతున్న మంత్రి రావెల సమాధానం చెప్పకుండా వెనుదిరిగారు. -
మంత్రి రావెల కుమారుడికి బెయిల్ మంజూరు
హైదరాబాద్: మహిళా టీచర్‌ను వేధించిన కేసులో ఏపీ మంత్రి రావెల కిశోర్‌బాబు కుమారుడు సుశీల్, అతని డ్రైవర్ రమేష్‌కు సోమవారం కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ నెల 3న బంజారాహిల్స్ రోడ్‌నెం-13లోని అంబేద్కర్‌నగర్ బస్తీలో రోడ్డుపై వెళుతున్న మహిళా టీచర్ పట్ల అసభ్యంగా ప్రవర్తించడంతో ఇద్దరినీ పోలీసులు అరెస్ట్ చేశారు. తప్ప తాగిన మైకంలో పబ్లిక్‌గా మహిళను చేయిపట్టుకు లాగి కారులో తీసుకెళ్లేందుకు యత్నించిన ఘటనలో నిర్భయ చట్టం, ఐపీసీ సెక్షన్ 354 కింద కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. న్యాయస్థానం నిందితులకు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. నాంపల్లి కోర్టు అనుమతితో రెండు రోజుల పాటు నిందితులను బంజారాహిల్స్ పోలీసులు విచారించారు. సోమవారం సాయంత్రం నిందితులు విడుదలకానున్నారు. -
''తెలంగాణ ప్రభుత్వ జీఓపై కోర్టుకు వెళతాం''
-
తెలంగాణ ప్రభుత్వ జీఓపై కోర్టుకు వెళతాం: ఏపి మంత్రి రావెల
హైదరాబాద్: స్థానికత విషయంలో తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన జీఓపై కోర్టుకు వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు ఏపి సాంఘీక, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి రావెల కిషోర్‌బాబు చెప్పారు. తెలంగాణలో 1956కు ముందు ఉన్నవారినే స్థానికులుగా పరిగణించాలని ఆ ప్రభుత్వం జిఓ జారీ చేసిన విషయం తెలిసిందే. ఆ జీఓ జారీపై ఏపి ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన జీఓ ప్రకారం 1956 తరువాత నుంచి ఇక్కడ ఉన్నవారిని స్థానికులుగా పరిగణించరు. దాంతో విద్యార్థులకు, నిరుద్యోగులకు అనేక చిక్కులు ఇస్తాయి. ఆ జీఓపై కోర్టుకు వెళ్లాలని నిర్ణయం తీసుకున్న నేపధ్యంలో మంత్రి కిషోర్ బాబు అడ్వకేట్ జనరల్(ఏజీ)ను సంప్రదించారు.