ఆగ్రహజ్వాల | Dalit communities concerned after the elimination of ravela kishore in guntur | Sakshi
Sakshi News home page

ఆగ్రహజ్వాల

Published Mon, Apr 3 2017 9:01 AM | Last Updated on Fri, Aug 24 2018 2:36 PM

ఆగ్రహజ్వాల - Sakshi

ఆగ్రహజ్వాల

► మంత్రి పదవి ఆశించి భంగపడ్డ నేతలు
► నిరాశలో ధూళిపాళ్ల, మోదుగుల, యరపతినేని
► రావెలను తొలగించడంపై దళిత సంఘాల ఆందోళన
► మోదుగుల కార్యాలయంలో కార్యకర్తల సమావేశం

మంత్రి పదవులు ఆశించినపలువురు అధికార పార్టీ నేతలు భంగపడ్డారు. పార్టీకి విధేయులుగా ఉన్నా సీఎం చంద్రబాబు తమకు మొండిచేయి చూపారని ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన తనను నిర్లక్ష్యం చేశారని పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర ఆవేదన చెందుతుండగా.. పల్నాడులోనే సీనియర్‌నైన తనకు హామీ ఇచ్చి విస్మరించారని గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.. ప్రత్తిపాడు ఎమ్మెల్యే రావెల కిషోర్‌బాబును మంత్రి పదవి నుంచి తొలగించడంతో ఆయన తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.. టీడీపీకి రాజీనామా చేస్తారన్న ప్రచారం సాగుతోంది..
సాక్షి, గుంటూరు: మంత్రి పదవిపై ఆశలు పెంచుకుని బలమైన లాబీయింగ్‌ సాగించిన సొంత సామాజికవర్గ నేతలకు సీఎం చంద్రబాబునాయుడు గట్టిగా షాక్‌ ఇచ్చారు. వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనందబాబుకు అమాత్య యోగం దక్కి ఆదివారం ప్రమాణ స్వీకారం చేయగా మిగిలిన ముఖ్యనేతలు కొందరు పదవి ఆశించి భంగపడ్డారు. ఈ క్రమంలో మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు రంగంలో దిగి బుజ్జగింపుల పర్వం కొనసాగించినట్లు సమాచారం.
‘ఆనంద’మానందమాయే..
వేమూరు నుంచి రెండు పర్యాయాలు వరుసగా ఎమ్మెల్యేగా గెలుపొందిన నక్కా ఆనంద్‌బాబుకు మంత్రి పదవి దక్కింది. తెనాలి ఎమ్మెల్యే ఆలపాటి రాజా లాబీయింగ్, ఎస్సీల్లో సీనియర్‌ ఎమ్మెల్యే కావడం.. రెండు అంశాలూ నక్కా ఆనంద్‌బాబుకు కలిసి వచ్చాయి. దీంతో ఆదివారం ప్రమాణ స్వీకారం చేశారు.
సొంత సామాజికవర్గంలోనే..
అధికార పార్టీ సొంత సామాజికవర్గంలో అసమ్మతి జ్వాలలు భగ్గుమంటున్నాయి. రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా, పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న జీవీ ఆంజనేయులు మంత్రి పదవి కోసం ప్రయత్నించి విఫలమయ్యారు. ఐదు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిచిన తనకు అన్యాయం జరిగిందని పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర, పల్నాడులోనే సీనియర్‌ ఎమ్మెల్యే అయిన తనకు హామీ ఇచ్చి విస్మరించారని గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ధూళిపాళ్ల నరేంద్ర ఎమ్మెల్యే పదవికి, టీడీపీకి రాజీనామా చేయాలని డిమాండ్‌ చేస్తూ చింతలపూడిలో ఆయన నివాసం వద్ద పార్టీ శ్రేణులు ఆందోళన చేశారు. రెండు రోజుల్లో సీఎంను కలిసి సమస్యను అక్కడే పరిష్కరించుకుంటామని శ్రేణులకు ఆలపాటి చెప్పినట్లు సమాచారం.

ఎంపీ రాయపాటి సాంబశివరావు కూడా అసంతృప్తిలో ఉన్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్‌కు మంత్రి పదవి ఇప్పించే క్రమంలోరాయపాటి బలమైన లాబీయింగ్‌ చేశారు. చివరి నిమిషంలో పదవి చేజారడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో ప్రత్తిపాటి పుల్లారావును తొలగిస్తారని బలంగా ప్రచారం సాగింది. చివర్లో పరిస్థితి మారిపోవడంతో ప్రత్తిపాటి తన స్థానాన్ని కాపాడుకున్నారు. దీంతో జిల్లాలో అదే సామాజిక వర్గానికి చెందిన వారెవరికీ చోటు దక్కలేదు.
రావెల తీవ్ర అసంతృప్తి 

మంత్రి పదవి నుంచి తొలగించడంపై ప్రత్తిపాడు ఎమ్మెల్యే రావెల కిషోర్‌బాబు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఆదివారం సాయంత్రం వరకూ పార్టీ శ్రేణులకు అందుబాటులోకి రాలేదు. ఉదయం రాష్ట్ర మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, పలువురు నేతలు రావెలను కలిసి మాట్లాడారు. మరోవైపు రావెలను మంత్రివర్గం నుంచి తొలగించడాన్ని నిరసిస్తూ ప్రత్తిపాడులోని పాత మద్రాసు రోడ్డులో దళిత సంఘాలు ధర్నా నిర్వహించి చంద్రబాబు తీరుపై ధ్వజమెత్తాయి. ఆయన పార్టీకి రాజీనామా చేస్తారని విస్తృతంగా ప్రచారం సాగుతోంది. మరో జాతీయ పార్టీలో చేరే దిశగా కసరత్తు చేస్తున్నారని వార్తలొస్తున్నాయి.
మోదుగులకు మొండి చేయి
గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాలరెడ్డి తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. నియోజకవర్గంలోని కార్యకర్తలు, డివిజన్‌ అధ్యక్షులు ఎమ్మెల్యే కార్యాలయంలో సమావేశమై తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు. 2009 ఎన్నికల్లో నరసరావుపేట పార్లమెంటు నుంచి ఎంపీగా గెలుపొందారు. ఆ తర్వాత రెండో పర్యాయం ఎంపీ రాయపాటి సాంబశివరావు కోసం సీఎం చంద్రబాబు సూచనతో నరసరావుపేట ఎంపీ స్థానాన్ని వదులుకుని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి అంగీకరించి వచ్చారు. ఈ క్రమంలో పార్టీ అధికారంలోకి రాగానే మంత్రి పదవి ఇస్తామని సీఎం చంద్రబాబు, లోకేష్‌లు హామీ ఇచ్చారు. అయితే రెండు పర్యాయాలు పదవి దక్కకపోవడంతో తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఇక బీసీ కోటాలో అనగాని సత్యప్రసాద్‌ బలంగా ప్రయత్నించి విఫలం అయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement