రాష్ట్ర వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించిన కాల్ మనీ వ్యవహారం.. బయట పడటంతో.. పలు ప్రాంతాల్లో ఆతరహా ఇబ్బందులు పడుతున్న బాధితులు ఒక్కొక్కరుగా బయటికి వస్తున్నారు.తాజాగా.. తిరుపతిలో ఓ కానిస్టేబుల్ అధిక వడ్డీలకు అప్పులిస్తూ.. మహిళలను వేధిస్తున్న ఘటన వెలుగు చూసింది. వివరాల్లోకి వెళితే.. కొర్లకుంటకు చెందిన ఓ మహిళ తిరుపతిలో కానిస్టేబుల్ గా పనిచేస్తున్న వ్యక్తి వద్ద అప్పు తీసుకుంది. సదరు మహిళ నుంచి తెల్ల కాగితాలపై సంతకాలు తీసుకున్న కానిస్టేబుల్.. అప్పు చెల్లించలేదంటూ వేధింపులు మొదలు పెట్టాడు.
ఐదు నెలల క్రితం అలిపిరి పీఎస్ లో మూడు రోజుల పాటు అక్రమంగా నిర్భంధించాడు. దీంతో సదరు మహిళ కుటుంబ సభ్యులు భయంతో వైఎస్సార్ కడప జిల్లాకు పారిపోయారు. అయినా.. కానిస్టేబుల్ వెంటాడి.. వేధిస్తున్నాడనీ.. తక్షణమే రూ10లక్షలు చెల్లించాలని.. లేదంటే.. తన బిడ్డలను ముంబై రెడ్ లైట్ ఏరియాలో అమ్మేస్తానంటూ బెదిరింపులకు దిగుతున్నాడనీ బాధితురాలు వాపోయింది.