సత్యానందం 'పవర్' పాపాలెన్నో! | call money sex racket accused satyananda rao irregularities | Sakshi
Sakshi News home page

సత్యానందం 'పవర్' పాపాలెన్నో!

Published Sun, Dec 27 2015 1:07 PM | Last Updated on Sun, Sep 3 2017 2:40 PM

సత్యానందం 'పవర్' పాపాలెన్నో!

సత్యానందం 'పవర్' పాపాలెన్నో!

సాక్షి, హైదరాబాద్: కాల్‌మనీ కేసులో నిందితుడైన విద్యుత్ శాఖ డీఈఈ సత్యానందం అవినీతి లీలలు తవ్వినకొద్దీ వెలుగు చూస్తున్నాయి. అడ్డగోలుగా పోగేసిన సొమ్ముతో ప్రకాశం జిల్లాల్లో విలువైన భూములు దక్కించుకోవడమే గాక, పనిచేసేది విద్యుత్ శాఖలో కాబట్టి అధికార దుర్వినియోగంతో నయా పైసా ఖర్చు లేకుండా తన వ్యవసాయ భూములు, క్షేత్రాలకు అడ్డదారిలో విద్యుత్ కనెక్షన్లు పొందాడు. పైగా రాష్ట్ర విభజన సమయంలో సమైక్య ఉద్యమ నేతగా చలామణి అవ్వడంతో ఉన్నతాధికారులకు ఫిర్యాదులు అందినా ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. కాల్‌మనీ వ్యవహారంతో ఇతడి పాపం పండింది. దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థలోని నిఘా బృందం ఇతడి ఆగడాలు, అవినీతిపై క్షేత్రస్థాయి పరిశీలన అనంతరం ఉన్నతాధికారులకు నివేదిక పంపింది.

* ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం మండలం గంగవరం గ్రామ పంచాయతీ పరిధిలోని రామచంద్రాపురం గ్రామంలో 49.75 ఎకరాల భూమి ఉంది. ఇందులో 31.17 ఎకరాలు సత్యానందం సోదరులు, భార్య, ఇతర కుటుంబీకుల పేర్లతో ఉన్నాయి. మిగిలిన మొత్తం అతని బినామీల పేర్లమీద ఉన్నాయి.
 
* వ్యవసాయ భూములన్నింటికీ ఉచిత విద్యుత్ కనెక్షన్లు పొందాడు. క్షేత్రం మొత్తం ఒకేచోట ఉన్నప్పటికీ వేర్వేరు పేర్లతో విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. వివిధ సర్వీస్ నంబర్లతో విద్యుత్ కనెక్షన్లకు ఎవరు దరఖాస్తు చేశారు? వాటిని ఎవరు అనుమతించారు? అనే కోణం లో విచారణ జరుపుతున్నట్టు అధికారులు తెలిపారు.

* ఆర్‌ఎల్ గార్డెన్స్ పేరుతో ఉన్న వ్యవసాయ క్షేత్రంకు  కేటగిరి-1లో విద్యుత్ కనెక్షన్ తీసుకున్నాడు. ఇక్కడ 7.5 అశ్వశక్తి సామర్థ్యం గల మోటారును వినియోగిస్తున్నట్టు గుర్తించారు.
 
* నిబంధనల ప్రకారం ఈ కనెక్షన్ ఇవ్వాలంటే, అవసరమైన పోల్స్‌కు అయ్యే ఖర్చును లబ్ధిదారుడే భరించాల్సి ఉంటుంది. ఫాంహౌస్ కోసం 14 పోల్స్ వేశారు. ప్రత్యేకంగా ట్రాన్స్‌ఫార్మర్ బిగించారు. వీటి కోసం సత్యానందం ఒక్కపైసా ఖర్చు పెట్టినట్టు లేదు. ఆయా ప్రాంతాల్లో రైతుల అవసరాల కోసం లైన్ కావాలంటూ స్థానికంగా ఉండే ఓ వ్యక్తి (అతను రేషన్ డీలర్) చేత దరఖాస్తు చేయించడం, దానికి ఆఘమేఘాల మీద అనుమతులు జారీ చేయడం విశేషం.
 
* 2013లో సత్యానందం అధికార దుర్వినియోగంపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు అందింది. విచారణ దశలోనే అతను అప్రమత్తమయ్యాడు. దర్యాప్తు అధికారులను దారికి తెచ్చుకున్నాడు. ఈ క్రమంలోనే ఒక విద్యుత్ కనెక్షన్‌ను మాత్రం సరెండర్ చేశాడు. అంతకు మించి ఇప్పటి వరకూ బినామీ దందా జోలికి వెళ్ళిన వాళ్ళే లేరని అధికారుల విచారణలో తెలిసింది.
 
విచారణకు ఆదేశించాం: టాన్స్‌కో సీఎండీ
సత్యానందం అధికార దుర్వినియోగం చేసినట్టు వచ్చిన ఫిర్యాదులపై విజిలెన్స్ విభాగాన్ని విచారణకు ఆదేశించామని, క్షేత్రస్థాయిలో పరిశీలన జరుగుతోందని ట్రాన్స్‌కో సీఎండీ విజయానంద్ తెలిపారు.
 
ఎవరినీ ఉపేక్షించం : ఎస్పీడీసీఎల్ సీఎండీ హెచ్‌వై దొర
డాక్యుమెంట్లు పరిశీలించకుండా, నిబంధనలు పట్టించుకోకుండా విద్యుత్ కనెక్షన్లు ఇచ్చి ఉంటే, మంజూరు చేసిన అధికారులపైనా చర్యలు తీసుకుంటామని ఎస్పీడీసీఎల్ సీఎండీ హెచ్‌వై దొర తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement