గంటల తరబడి మహిళలతో ఫోన్ సంభాషణలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తాన్ని విపరీతంగా కుదిపేస్తున్న కాల్‌మనీ సెక్స్ రాకెట్ వ్యవహారంలో కొత్త కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. ముగ్గురు నిందితులను రెండు రోజులుగా టాస్క్‌ఫోర్స్ బృందం విచారిస్తోంది. సెక్స్ రాకెట్ కేసులో ఉన్న నిందితుల కాల్‌డేటాను విశ్లేషించగా విస్తుగొలిపే వాస్తవాలు వెలుగుచూశాయి. వాటిలో పెద్ద సంఖ్యలో మహిళల ఫోన్ నంబర్లను గుర్తించారు. గంటల తరబడి ఆ మహిళలతో నిందితులు సంభాషించినట్లు నిర్ధారించారు.
ఎ-4 నిందితుడు సత్యానందం పరారు కావడానికి సహకరించినవారిపై దృష్టిపెట్టారు. ఓ కాలేజి ప్రిన్సిపాల్, ఏపీ ఎన్జీవో నేతల ప్రమేయంపై కూడా ఆరా తీస్తున్నారు. నిందితుడు సత్యానందానికి మద్దతుగా ఓ ఎన్నారై ప్రముఖుడు జోక్యం చేసుకుంటున్నారు. టీడీపీ నేతలతో ఆ ఎన్నారై మంతనాలు జరుపుతున్నట్లు తెలిసింది. ఈ కేసులో నలుగురు కీలక నిందితులు ఇంకా పరారీలోనే ఉన్నారు. ఇంత జరుగుతున్నా, పోలీసులు మాత్రం కాల్‌మనీ సెక్స్ రాకెట్ నిందితుల ఆస్తుల జోలికి వెళ్లడం లేదు. నిందితుల ఆర్థిక మూలాలపై దర్యాప్తు కూడా ఇంకా మొదలుకాలేదు.
నిందితులు మహిళలను ఎలా బెదిరించారనే విషయాలు తేల్చడానికి ప్రయత్నిస్తున్నారు. ఇప్పటివరకు అధికారికంగా తేలిన లెక్కల ప్రకారమే.. దాదాపు రూ. 200 కోట్ల మేరకు చలామణి చేయించినట్లు తెలుస్తోంది. కొంతమంది పెద్దలకు చెందిన మరో 500 కోట్లను కూడా అనధికారికంగా తిప్పుతున్నట్లు సమాచారం.