పంట కాలువలో పడ్డ జంట
– కొట్టుకుపోయిన మహిళ
– ఒకరిని కాపాడిన స్థానికులు
– అవనిగడ్డలో ప్రమాదం
అవనిగడ్డ :
చేపలకు గాలెం వేస్తూ ప్రమాదవశాత్తు మహిళ పంటకాలువలో పడి గల్లంతైన ఘటన అవనిగడ్డ వంతెన సెంటర్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన ప్రకారం బుడబుక్కల వేషాలు వేస్తూ జీవించే ఒంగోలుకు చెందిన దార్గ తిరుపాలు, దార్ల గురవయ్య వారం రోజుల క్రితం అవనిగడ్డ వచ్చారు. కాకినాడకు చెందిన కుమారి (44) ఉయ్యూరులో పరిచయం కాగా తిరుప్పాలు ఆమెను తనతో తీసుకొచ్చాడు. తిరుపాలు, కుమారి కలిసి గురువారం మధ్యాహ్నం 11.45 గంటల సమయంలో స్థానిక వంతెన సెంటర్‌లో మూడు విగ్రహాల కింద ఇనుప పట్టీలపై కూర్చుని చేపలు పడుతూ అదుపుతప్పి పంటకాలువలోకి పడిపోయారు. ఇది గమనించి స్థానికులు కేకలు వేయగా కొబ్బరి బొండాలు అమ్ముకునే కందుల రమేష్ తన లుంగీని తిరుపాలుకు అందించి రక్షించాడు. కుమారి నీటి వేగానికి కొట్టుకుపోయింది. తిరుపాలుకు ప్రథమచికిత్స చేసి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ప్రమాదఘటనతో లాకుల సెంటర్‌ల పెద్ద ఎత్తున జనం పోగయ్యారు. ప్రమాద సమయంలో ఇద్దరూ మద్యం సేవించి ఉన్నట్టు ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. వారం రోజుల క్రితం ఆమె పరిచయమైందని బంధువు గురువయ్య చెప్పాడు. ఈ మేరకు ఏఎస్‌ఐ మాణిక్యాలరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు చెప్పారు.