మహిళ లాకప్ డెత్
► అసిఫ్‌నగర్ పోలీసుల విచారణ సమయంలో కుప్పకూలిన పద్మ
► ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం మృతి
► మృతురాలి ఒంటిపై గాయాలున్నట్టు చెబుతున్న పోస్టుమార్టం నివేదిక
► ఇన్‌స్పెక్టర్‌తో సహా ఏడుగురిని సస్పెండ్ చేసిన హైదరాబాద్ సీపీ
సాక్షి, హైదరాబాద్ సిటీబ్యూరో: నగరంలో మరో లాకప్ మరణం. ఈ నెల తొలివారంలో మారేడ్‌పల్లి స్టేషన్‌లో బన్నప్ప అనే వ్యక్తి పోలీసుల దెబ్బలకు మృతి చెందిన ఘటన మరువకముందే... తాజాగా ఆసిఫ్‌నగర్ పోలీసు స్టేషన్‌లో ఖాకీ లాఠీల దెబ్బకు మరో మహిళ బలయింది. అయితే ఈ కేసులో ఫిర్యాదు నుంచీ మరణం దాకా అన్నీ గందరగోళంగానే ఉండటం చర్చనీయాంశమైంది. శుక్రవారం మెహిదీపట్నం అయోధ్యనగర్‌కు చెందిన దీప్తిరాజ్.. సిరి బ్యూటీ పార్లర్ వద్ద తన బ్యాగు పోయిందని ఆసిఫ్‌నగర్ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి బ్యూటీ పార్లర్‌లో సీసీ కెమెరాలను పరిశీలించారు.
అందులో బ్యాగ్ తీసుకుంది మంజుల, లక్ష్మీలుగా గుర్తించారు. వారిని శనివారం ఉదయం పిలిపించి విచారించగా నక్కల పద్మ ఇంట్లో దాచిపెట్టామని చెప్పారు. అక్కడికి వెళ్లి సోదా చేయగా ఆభరణాలు దాచే డబ్బాలు దొరికాయి. కానీ అందులో విలువైన వస్తువులేవీ లేవు. దీంతో నక్కల పద్మను పోలీసు స్టేషన్‌కు తీసుకొచ్చి విచారించారు. ఎక్కువ సమయం పోలీసు స్టేషన్‌లో పెట్టడం వల్ల అస్వస్థతకు గురవడంతో శని వారం రాత్రి 11.30 గంటలకు ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆమె తెల్లవారుజామున 4 గంటలకే మృతి చెందిందని తెలుస్తోంది. అయితే 6.30 గంటలకు చనిపోయిందని పోలీసులు చెబుతున్నారు. షుగర్ లెవల్స్, పల్స్ రేట్ పడిపోవడంతో కోమాలోకి వెళ్లి మరణించిందని అంటున్నారు. మృతురాలి శరీరంపై గాయాలు ఉన్నట్టు పోస్టుమార్టం నివేదికలో తేలింది. అయితే, పద్మ మరణంపై పోలీసులు మరోరకంగా చెబుతున్నారు. ఆమెకు కల్లు తాగే అలవాటు ఉందని, ఆరోగ్య స్థితి బాగాలేదని భోజగుట్ట శివాజీనగర్‌కు చెందిన నక్కల రాజు తెలిపినట్టు పోలీసులు తెలిపారు. భోజగుట్టకు చెందిన పద్మ (38) అంత్యక్రియలను ఆసిఫ్‌నగర్ దేవునికుంట శ్మశానవాటికలో నిర్వహించారు. ఆమెకు ఇద్దరు కుమారులు సాయి(15), రవి(14). ఫంక్షన్ హాళ్లల్లో పని చేసుకుంటూ జీవనం కొనసాగిస్తోంది. పద్మ మృతితో కుమారులు రోదించడం అందరినీ కంటతడిపెట్టించింది.
దీప్తిరాజ్ ఫిర్యాదు ఏంటంటే...
కుమార్తెకి అనారోగ్యంగా ఉండటంతో శుక్రవారం మెహిదీపట్నంలోని అపూర్వ ఆస్పత్రికి తీసుకెళ్లానని దీప్తిరాజ్ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇదే సమయంలో పక్కనే ఉన్న సిరి బ్యూటీ పార్లర్‌కు వెళ్లానని, బ్యాగ్‌ను మరిచిపోయానని తెలిపారు. తిరిగి వచ్చి చూడగా ఆ బ్యాగ్ కనిపించలేదన్నారు. అందులో డైమండ్ చెవి దుద్దులు, నెక్లెస్, పట్టాగొలుసులు ఉన్నట్లు పేర్కొన్నారు. అయితే కుమార్తెను ఆస్పత్రికి తీసుకెళ్తున్నప్పుడు బ్యాగ్‌లో ఆభరణాలు తీసుకెళ్లాల్సిన అవసరమేంటనేది ప్రశ్నగా మారింది. దీప్తి భర్త చంద్రశేఖర్‌తో గొడవపడి కోపంతో సొమ్ములు బ్యాగ్‌లో పెట్టుకుని వచ్చిందని భావిస్తున్నారు. సిరి బ్యూటీ పార్లర్ సిబ్బంది పరిచయస్తులు కావడంతో బ్యాగ్ అక్కడ పెట్టి... పుట్టింటికి వెళ్లేందుకు ఆటో కోసం వెళ్లింది. ఈ సమయంలోనే బ్యాగ్ పోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే వాస్తవం దాచి మరో రకంగా ఎందుకు ఫిర్యాదు చేశారనేది అయోమయంగా ఉంది.
సీపీ సీరియస్.. ఏడుగురిపై వేటు: ఓ మహిళను అర్ధరాత్రి వరకు పోలీసు అదుపులో ఉంచుకుని విచారించడంపై హైదరాబాద్ పోలీసు కమిషనర్ మహేందర్ రెడ్డి సీరియస్‌గా స్పందించారు. మహిళను సాయంత్రం 6 గంటల వరకే విచారించాలన్న నిబంధనను మరిచి అర్ధరాత్రి వరకు ఉంచి, ఆమె అనారోగ్యానికి కారకులైన ఏడుగురు పోలీసులను సస్పెండ్ చేశారు. సస్పెండైన వారిలో ఆసిఫ్‌నగర్ ఇన్‌స్పెక్టర్ కె.శ్రీకాంత్, ఎస్‌ఐ హృషీకేశ్, అసిస్టెంట్ సబ్‌ఇన్‌స్పెక్టర్ ఎస్‌కే చాంద్ బాషా, హెడ్‌కానిస్టేబుల్ మహమ్మద్ నాదర్ ఆలీ, కానిస్టేబుళ్లు ఎస్.ప్రతాప్, మహమ్మద్ ఖాజా, మహమ్మద్ మంజూర్ అహ్మద్‌లు ఉన్నారు. ఈ కేసుకు సీసీఎస్ ఏసీపీ సోమేశ్వరరావును విచారణాధికారిగా నియమించారు.
పద్మ శరీరంపై తీవ్ర గాయాలు: సీఎంవో శంకర్
ఆసిఫ్‌నగర్ పోలీస్‌స్టేషన్ నుంచి తీసుకువచ్చిన పద్మ శరీరంపై తీవ్ర గాయాలు ఉన్నాయని ఉస్మానియా ఆస్పత్రి క్యాజువాలిటీ మెడికల్ ఆఫీసర్(సీఎంవో) శంకర్ తెలిపారు. పద్మ రెండు చేతులు, కాళ్లతోపాటు శరీరంలోని అనేక ప్రాంతాల్లో పోలీసులు తీవ్రంగా కొట్టిన దెబ్బలు ఉన్నాయన్నారు. క్యాజువాలిటీకీ తెచ్చినప్పుడు బీపీ, షుగర్ తక్కువగా ఉన్నాయని చెప్పారు. ఆమెకు అయిన గాయాలు ఆస్పత్రికి తీసుకురావడానికి సుమారు ఐదారు గంటలకు ముందు అయినట్లుగా తెలుస్తోందని తెలిపారు. రాత్రి ఆమె పరిస్థితి విషమంగా ఉండడంతో పద్మను ఏఎంసీ వార్డుకు తరలించారని, పరిస్థితి విషమించడంతో ఆదివారం ఉదయం 6:15 గంటల సమయంలో మృతి చెందినట్లు తెలిపారు. మృతదేహానికి వీడియో చిత్రీకరణ ద్వారా డాక్టర్ రమేష్, సుధలు పోస్ట్‌మార్టం నిర్వహించారు.