ఇష్టారాజ్యం
► అనుమతి ఒకచోట, పనులు చేసేది మరోచోట
► 14వ ఆర్థిక సంఘం నిధులు పక్కదారి
► నిద్రమత్తులో ఎస్‌ఈ, ఎంఈలు
కడప నగరపాలక సంస్థ ఇంజినీరింగ్ అధికారులు కాంట్రాక్టర్లతో కుమ్మక్కయ్యారా..? నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారా? అక్రమార్జనే ధ్యేయంగా రూల్స్‌ను అతిక్రమిస్తున్నారా? ఈ ప్రశ్నలకు అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. ఒక చోట మంజూరైన పనులను వేరే చోట చేయడం నిబంధనలకు విరుద్ధమని తెలిసినా అధికారులు సహకరించడమే ఇందుకు సాక్ష్యం.
కడప కార్పొరేషన్: కేంద్ర ప్రభుత్వం గ్రాంటు రూపంలో విడుదల చేసే 14వ ఆర్థిక సంఘం నిధుల కింద చేపట్టే పనులకు కొన్ని నియమాలు, మార్గదర్శకాలు ఉంటాయి. వాటిని ఇంజినీరింగ్ అధికారులు ఉల్లంఘించడానికి వీల్లేదు. ఏవైనా పనులకు జనరల్ బాడీ ఆమోదంతో పాటు రీజినల్ స్థాయిలో ఇంజినీరింగ్ ఉన్నతాధికారులతో కూడిన కమిటీ కూడా అనుమతి ఇవ్వాల్సి ఉంటుంది. ఒక్కసారి అనుమతి లభిం చాక ఆ పనిని మరొక చోట చేస్తామంటే కుదరదు. ఆ పని పేరు మార్చి వేరొక చోటికి బదలాయించడం అనేది కేంద్రప్రభుత్వ గ్రాంట్ల విషయంలో చాలా క్లిష్టతరమైన ప్రక్రియ. నిబంధనలు తుంగలో తొక్కిన నగరపాలక ఇంజినీర్లు అలాంటి దాన్ని సులువుగా మార్చి పడేస్తున్నారు.
కాలువ నిర్మాణం కోసమంటూ..: అక్కాయపల్లెలో సాయిబాబా స్కూల్ ఎదురుగా ఉన్నదంతా లోతట్టు ప్రాంతం. వర్షమొస్తే ఇక్కడ అనేక ఇళ్లు వాననీటిలో మునిగిపోతాయి. కల్వర్టు కూడా తక్కువ ఎత్తులో ఉండటం వల్ల వర్షపునీరు ప్రవహించేందుకు తీవ్ర ఆటంకం ఏర్పడుతూ ఉండేది. దీన్ని దృష్టిలో ఉంచుకొని 14వ ఆర్థిక సంఘం నిధులు రూ.60లక్షలతో కాలువ నిర్మాణం చేపట్టడానికి అనుమతులు మంజూరయ్యాయి. కానీ నగర పాలక ఇంజినీరింగ్ అధికారులు మంజూ రైన చోట పనులు చేయకుండా వేరొకచోట మొదలుపెట్టారు. కాంట్రాక్టర్ తప్పు చేస్తుంటే సరిదిద్దాల్సిన ఎస్‌ఈ, ఎంఈ ఎలాంటి అభ్యంతరాలు తెలపకుండా ఆ పనిని వేరొకచోటికి బదలాయించి పనులు పూర్తి చేసేందుకు సహకరించినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
కాంట్రాక్టర్‌కు లబ్ధి చేకూర్చేందుకే..: కాంట్రాక్టర్‌కు లబ్ధి చేకూర్చేందుకు కాగితాలపెంట నుంచి నబీకోట సర్కిల్ వరకూ బాగున్న డ్రైన్‌ను పగులగొట్టి ఆ స్థానంలో కొత్త డ్రైన్ కట్టినట్లు తెలుస్తోంది. పని పేరు మార్చకుండా పనులే మొదలుపెట్టడానికి వీల్లేదని నిబంధనలు చెబుతుంటే వీరేమో ఏకంగా ఆ పనులు కూడా పూర్తి చేసి బిల్లులు ఇచ్చేందుకు కూడా సిద్ధమవుతుండడం గమనార్హం. కాగా గతంలో ఇలాంటి పరిస్థితి రాగా అభ్యంతరం వ్యక్తం చేసిన నగరపాలక ఇంజినీర్లు ఇక్కడేమో కాంట్రాక్టర్‌కు లబ్ధి చేకూర్చేలా వ్యవహరించడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు సాయిబాబా స్కూల్ ప్రాంతంలోని ప్రజలు ఈ వ్యవహారంపై మండిపడుతున్నారు. వర్షం వస్తే తమగతేం కావాలని ప్రశ్నిస్తున్నారు. దీనిపై స్థానిక న్యాయవాది ఒకరు ఆర్‌టీ యాక్టు ప్రకారం సమాచారం కోరితే ఇంజినీరింగ్ అధికారులు తప్పుడు సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది.
నోట్ రాసి అనుమతి తీసుకుంటాం- ఎంఈ: దీనిపై మున్సిపల్ ఇంజినీర్ చెన్నకేశవరెడ్డిని వివరణ కోరగా ఈ డ్రైన్ కూడా ప్రజలకోసమే కదా, ఇందులో నిధులు దుర్వినియోగం ఏముందని ప్రశ్నిం చారు. నేమ్ చేంజ్ చేయకుండానే పనులు చేయవచ్చా అని ప్రశ్నించగా నోట్ రాసి అనుమతి తీసుకుంటామని తాపీగా సమాధానమిచ్చారు.