నెల్లూరు రైల్వే రూపురేఖలు మారుస్తాం
-
కేంద్ర రైల్వే శాఖ మంత్రి సురేష్ ప్రభు
నెల్లూరు (సెంట్రల్): రైల్వే శాఖ పరంగా నెల్లూరు జిల్లాను మరింతగా అభివృద్ధి చేసి రూపురేకలు మారుస్తామని కేంద్ర రైల్వే శాఖ మంత్రి సురేష్ ప్రభు చెప్పారు. నెల్లూరు సౌత్ స్టేషన్‌లో ఫుట్ ఓవర్ బ్రిడ్జి, గూడూరులో యార్డ్ విస్తరణ, అదనపు ప్లాట్ ఫాంల నిర్మాణానికి శంకుస్థాపనలను రిమోట్ కంట్రోల్ ద్వారా ఆదివారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నెల్లూరుకు చెందిన కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు వల్లే జిల్లాలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయన్నారు. నెల్లూరు రైల్వే సమస్యల గురించి వెంకయ్యనాయుడు తనకు వివరించారన్నారు. వీటిని దశల వారీగా పరిష్కరిస్తానని ప్రభు హామీ ఇచ్చారు. నెల్లూరు మీదుగా కొత్త రైళ్లను వేయడంతో పాటు స్టేషన్ల ఆధునికీకరణ ప్రక్రియను వేగవంతం చేస్తామన్నారు. ఏపీ రాజధాని అమరావతికి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి రైళ్లను వేయడంతో పాటు కొత్త మార్గాలను కూడా నిర్మిస్తామన్నారు. సాగరమాల ప్రాజెక్ట్‌లో భాగంగా తీర ప్రాంతాలను కలుపుతూ రైలు మార్గాలను నిర్మించేందుకు ప్రణాళికను రూపొందించామన్నారు. అక్షర క్రమంలో ముందున్న ఆంధ్రప్రదేశ్‌ను రైల్వే పరంగా కూడా మొదటి స్థానంలో ఉండేలా చూస్తామన్నారు.
నెల్లూరు స్టేషన్‌లో మరిన్ని సదుపాయాలు
జిల్లాలో రైల్వే పరంగా చేపట్టాల్సిన పనులపై ఒక ప్రణాళికను రూపొందించామని కేంద్ర సమాచార శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు చెప్పారు. గతంలో రైల్వే మంత్రిగా ఉన్న నితీష్ కుమార్‌ను తీసుకొచ్చి నెల్లూరును మోడల్ స్టేషన్‌గా ప్రకటింపచేసి సదుపాయాల కోసం రూ.5 కోట్లు మంజూరయ్యేలా చూశామన్నారు. నెల్లూరు–చెన్నైల మధ్య మెమూ రైళ్లను కూడా నడిపిన ఘనత తమ ప్రభుత్వానిదేనన్నారు. దీనివల్ల కేవలం రూ.30కు నెల్లూరు నుంచి చెన్నైకి వెళ్లవచ్చన్నారు. నెల్లూరు స్టేషన్‌కు త్వరలోనే వైఫై సదుపాయాన్ని కల్పిస్తామని, ఇందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ రవీంద్ర గుప్తాను ఆదేశించారు. గూడూరు–సికింద్రాబాద్‌ల మధ్య నడుస్తున సింహపురి ఎక్స్‌ప్రెస్ సమయాన్ని కూడా ప్రయాణికులకు అనుగుణంగా మార్చేందుకు అధికారులతో మాట్లాడతామన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి నారాయణ, నెల్లూరు, తిరుపతి ఎంపీలు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, వరప్రసాద్‌రావు, కలెక్టర్ జానకి, జెడ్పీ చైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి, ఎమ్మెల్యేలు పి.అనిల్‌కుమార్‌యాదవ్, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, కిలివేటి సంజీవయ్య, ఎమ్మెల్సీలు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, బీద మస్తాన్‌రావు, గూడూరు వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త మేరిగ మురళి తదితరులు పాల్గొన్నారు.