రాష్ట్ర, జాతీయస్థాయిల్లో రాణిస్తున్న జిల్లా క్రీడాకారులు
ఆరుసార్లు క్రాస్‌కంట్రీ ఓవరాల్ చాంపియన్‌షిప్
అథ్లెటిక్ ట్రైనింగ్‌తో ఉద్యోగవకాశాలు
సరైన క్రీడావసతులు లేకున్నా జిల్లా అథ్లెట్లు పట్టుదల, క్రమశిక్షణతో సౌత్‌జోన్, రాష్ట్ర అథ్లెటిక్స్ టోర్నీల్లో ప్రతిభ కనబరుస్తూ జిల్లాకు పతకాలపంట పండిస్తున్నారు. రాష్ట్రంలో ఎక్కడ ఏ టోర్నీ జరిగినా జిల్లా అథ్లెట్లదే హవా కొనసాగుతోంది. ఉమ్మడి రాష్ట్రంలో కూడా జిల్లా అథ్లెట్లు రాష్ట్ర, జాతీయస్థాయి పోటీల్లో విశేషంగా రాణించారు. సబ్‌జూనియర్, జూనియర్, సీనియర్ విభాగాల్లో పతకాలు తీసుకొచ్చి సత్తాచాటుతున్నారు. పతకాలు తెస్తున్న క్రీడాకారుల్లో గ్రామీణ ప్రాంతాల నుంచి ఎక్కువ మంది ఉండడం విశేషం. అథ్లెటిక్స్ శిక్షణతో కొంతమంది యువకులు ఆర్మీ ఉద్యోగాలతో పాటు బీపీఈడీ చేస్తున్నారు. జిల్లాకేంద్రానికి సమీపంలోని రంగారెడ్డి జిల్లాలోని క్రీడాకారులు సైతం ఇక్కడే శిక్షణ తీసుకుంటున్నారు. అందుకే జిల్లా అథ్లెటిక్స్‌కు కేరాఫ్‌గా మారుతోంది. – మహబూబ్‌నగర్ క్రీడలు
క్రాస్‌కంట్రీలో డబుల్ హ్యాట్రిక్..
రాష్ట్రస్థాయి క్రాస్‌కంట్రీ అథ్లెటిక్స్ పోటీల్లో జిల్లా అథ్లెట్లు వరుసగా ఆరుసార్లు ఓవరాల్ చాంపియన్‌షిప్ సాధించి, డబుల్‌హ్యాట్రిక్ సాధించి రికార్డు సృష్టించారు. 2010లో తిరుపతి, 2011లో శ్రీకాకుళం, 2012లో మహబూబ్‌నగర్, 2013లో కరీంనగర్, 2014లో హైదరాబాద్ గచ్చీబౌలి స్టేడియంలో జరిగిన రాష్ట్రస్థాయి క్రాస్‌కంట్రీ పోటీల్లో చాంపియన్‌గా అవతరించారు. ఈ పోటీల్లో అండర్–16, అండర్–18, అండర్–20 బాలుర విభాగాల్లో, అండర్–18, అండర్–20 విభాగాల్లో బాలికలు టీమ్ చాంపియన్‌షిప్‌లు సాధించారు. గతేడాది ఖమ్మంలో జరిగిన క్రాస్‌కంట్రీ పోటీల్లో కూడా మరోసారి ఓవరాల్ చాంపియన్‌షిప్‌ను పొందారు. అండర్–16 (బాలురు), అండర్–18 (బాలికలు), అండర్–20 (బాలురు, బాలికలు)విభాగాల్లో టీమ్ చాంపియన్‌షిప్‌లు సొంతం చేసుకుంది.
అథ్లెటిక్స్ మీట్‌లో పతకాలు..
రెండేళ్లలో జిల్లా అథ్లెట్లు మెరుగైన ప్రతిభ కనబరిచారు. గతేడాది జూనియర్ మీట్‌లో రెండు బంగారు, మూడు రజతం, నాలుగు కాంస్య పతకాలు పొందారు. వరంగల్‌లో జరిగిన పోటీల్లో 10 బంగారు, 11 రజతం, 9 కాంస్య, ఈ ఏడాది మే నెలలో ఖమ్మంలో జరిగిన యూత్ పోటీల్లో 8 బంగారు, 1 రజతం, 3 కాంస్య పతకాలు సాధించారు.
రెండేళ్లలో ఆర్మీలో ఉద్యోగాలు పొందినవారు..
రెండేళ్ల కాలంలో పలువురు అథ్లెట్లు ఆర్మీలో ఉద్యోగాలు సంపాదించారు. అశోక్, సురేశ్(కూచూర్), శేఖర్, అనిల్, రజాక్, నితీష్, శ్రీకాంత్, భగవాన్, రాజశేఖర్, ఖాసీం, మల్లేష్ (మహబూబ్‌నగర్), కాంతారావు (గాజులపేట), హర్యా (ఖిల్లాఘనపురం) ఆర్మీలో చేరారు. ఇటీవల జిల్లా స్టేడియంలో నిర్వహించిన పోలీస్ దేహదారుఢ్య పరీక్షల్లో 70మందికి 60మంది అథ్లెట్లు ఉత్తీర్ణత సాధించారు. ప్రతి ఏడాది పది మంది అథ్లెట్లు బీపీఈడీ కోర్సు చేస్తున్నారు.
అథ్లెటిక్స్‌తోనే ఎంపీఈడీలో సీటు
అథ్లెటిక్స్ లాంగ్‌జంప్‌లో రాష్ట్ర. జాతీయస్థాయిల్లో జిల్లాకు ప్రాతినిధ్యం వహిస్తున్నాను. 30రాష్ట్రస్థాయి, 15 జాతీయస్థాయి పోటీల్లో పాల్గొన్నా. 2013 మధురైలో జరిగిన నేషనల్ మీట్‌లో రజతం, 2014 చెన్నై మీట్‌లో కాంస్య పతకాలు గెలిచాను. గతేడాది మంగళూరు ఆలిండియా యూనివర్సిటీ పోటీల్లో పాల్గొన్నా. డిగ్రీలో నిజాం కళాశాలలో అథ్లెటిక్స్‌లో సాధించిన పతకాలతోనే సీటు లభించింది. ప్రస్తుతం స్పోర్ట్స్ కోటాలో ఎంపీఈడీ చేస్తున్నాను. – ధర్మేందర్, కొత్తపేట
ఆర్మీలో ఉద్యోగం.. సంతోషం
చిన్నప్పటి నుంచి క్రీడలంటే ఇష్టం. సీనియర్ క్రీడాకారుల ప్రోత్సాహంతో అథ్లెటిక్స్ ఎంచుకున్న. 2012 ఆర్మీలో ఉద్యోగం సంపాదించా. నా జీవితానికి అథ్లెటిక్స్ ఎంతో ఉపయోగపడుతోంది. ప్రస్తుతం ఆర్మీ సివిల్ సర్వీసెస్‌కు అథ్లెటిక్స్ క్రీడాకారుడిగా ప్రాతినిధ్యం వహిస్తున్నాను. – అశోక్, కూచూర్
దాతలు సహకారం అవసరం
జిల్లాలో నైపుణ్యం గల అథ్లెట్లు ఉన్నారు, దాతలు ప్రోత్సహిస్తే వారు భవిష్యత్‌లో మరిన్ని పతకాలు సాధిస్తారు. క్రాస్‌కంటీ పోటీలకు ప్రతిసారి జిల్లా అథ్లెట్లకు ప్రత్యేక క్యాంప్ నిర్వహిస్తున్నాం. క్రీడలకు ప్రభుత్వం తగిన నిధులు విడుదల చేయాలి. జిల్లా అథ్లెట్లను జాతీయ, అంతర్జాతీయస్థాయికి తీసుకెళ్లడమే లక్ష్యంగా పనిచేస్తున్నాం. – రాజేంద్రప్రసాద్, జిల్లా అథ్లెటిక్ సంఘం ప్రధాన కార్యదర్శి
ఏషియన్స్ గేమ్స్‌లో ఆడడమే లక్ష్యం
15జాతీయ అథ్లెటిక్స్ పోటీల్లో పాల్గొన్నాను. గతేడాది కేరళ రాష్ట్రం త్రివేండం జరిగిన నేషనల్ గేమ్స్‌లో రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించాను. 2012లో హైదరాబాద్‌లో జరిగిన ఒలింపిక్ ట్రయల్ మీట్‌లో 4 ్ఠ400మీ. రిలేలో కాంస్య పతకాన్ని సాధించాడు. 2009 నుంచి 2014 హైదరాబాద్‌లో శాయ్ శిక్షణ తీసుకున్న. ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన ఫెడరేషన్‌కప్‌లో ఆడాను. భవిష్యత్‌లో ఏషియన్‌గేమ్స్‌లో ఆడడమే తన లక్ష్యమంటున్నాడు రవికుమార్. – రవికుమార్, దామరగిద్ద
స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగమే లక్ష్యం
స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగం సా«ధించడమే తన లక్ష్యం. హైదరాబాద్‌లో నేటినుంచి జరిగే రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్‌లో పాల్గొంటున్నాను. ఇందులో కచ్చితంగా బంగారు పతకం సాధిస్తా. ఐదేళ్ల నుంచి జిల్లా స్టేడియంలో అథ్లెటిక్స్ శిక్షణ తీసుకుంటున్నా. 3 జాతీయ, 8 రాష్ట్రస్థాయి టోర్నీల్లో పాల్గొన్నాను. – భవ్యా, మహబూబ్‌నగర్