చెన్నూరులో ఓ మహిళ మెడలోని బంగారు గొలుసును గుర్తు తెలియని దుండగుడు సోమవారం లాక్కెళ్లాడు.
చెన్నూరు : చెన్నూరులో ఓ మహిళ మెడలోని బంగారు గొలుసును గుర్తు తెలియని దుండగుడు సోమవారం లాక్కెళ్లాడు. పోలీసులు లె లిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. కర్నూలు–చిత్తూరు జాతీయ రహదారిలోని చెన్నూరు కొత్తరోడ్డులో వడ్లవీటి లక్షుమయ్య భార్య ఈశ్వరమ్మ టీ దుకాణాన్ని నిర్వహిస్తున్నారు. మధ్యాహ్నం గుర్తు తెలియని యువకుడు వచ్చాడు. బీమా చేయాలని, మృతి చెందితే కుటుంబ సభ్యులకు రూ. 1.50 లక్షలు ఇస్తామంటూ వచ్చి ఈశ్వరమ్మతో చెప్పాడు. ఆమె భర్తను పిలిచి విషయాన్ని చెప్పింది. చెక్కర ఫ్యాక్టరీ వద్ద అధికారులు ఉన్నారని, అక్కడికి రావాలని చెప్పగా ఈశ్వరమ్మ వెళ్లేందుకు ప్రయత్నించింది. మెడలోని బంగారు గొలుసు లోపల పెట్టి వెళ్లాలని భర్త సూచించాడు. వెంటనే ఆమె ఇంటిలో పెట్టి అతని బైకుపై వెళ్లగా కొంత దూరం పోయాక మగవాళ్లు రావాలంటూ చెప్పి ఆమెను వెనక్కు తీసుకొచ్చాడు. లక్షుమయ్యను చెక్కర ఫ్యాక్టరీ సమీపం వద్దకు తీసుకెళ్లాడు. మరో వ్యక్తి వస్తాడు. ఇక్కడే ఉండండి అని చెప్పి, టీ హోటల్ వద్దకు వచ్చి బ్యాంకు పుస్తకాలివ్వాలంటూ ఈశ్వరమ్మను అడిగాడు. ఆమె అప్పటికే తిరిగి మెడలో గొలుసు వేసుకోవడంతో బ్యాంకు పుస్తకం ఇస్తుండగా.. గొలుసును లాక్కుని బైకులో పరారయ్యాడు. బాధితులు పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేశారు.