ఊసరవెల్లిని మించిపోయారు
ఊసరవెల్లిని మించిపోయారు
Published Sun, Feb 12 2017 9:49 PM | Last Updated on Sat, Jul 28 2018 3:23 PM
- సీఎం చంద్రబాబుపై అనంత వెంకటరామిరెడ్డి ధ్వజం
- కాటసాని ఆధ్వర్యంలో గొర్విమానుపల్లెలో గడపగడపకూ వైఎస్సార్
కొలిమిగుండ్ల: సీఎం చంద్రబాబు రాష్ట్ర విభజన అనంతరం ప్రతి అవకాశాన్నీ స్వప్రయోజనం కోసం వినియోగించుకుని జనానికి మాయ మాటలు చెబుతూ ఊసరవెల్లిని మించిపోయారని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, జిల్లా ఇన్‌చార్జ్ అనంత వెంకట్రామిరెడ్డి ఎద్దేవా చేశారు. ఆదివారం సాయంత్రం కొలిమిగుండ్ల మండలం గొర్విమానుపల్లెలో నియోజకవర్గ ఇన్‌చార్జ్ కాటసాని రామిరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన గడప గడపకూ వైఎస్సార్ కార్యక్రమంలో ఆయన ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.
టీడీపీ అధికారంలోకి వచ్చి మూడేళ్లవుతున్నా ఎక్కడా అభివృద్ధి కనిపించడం లేదన్నారు. రాష్ట్రం విడిపోయాక అనుభవజ్ఙుడు సీఎంగా వస్తే మంచి జరుగుతుందని నమ్మి ఓట్లేస్తే దారుణంగా మోసం చేశారని, ఈ విషయాన్ని ప్రజలు గుర్తించాలని సూచించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరెడ్డి కృష్ణా జలాలు రాయలసీమకు తెప్పించేందుకు కోట్లాది రూపాయలు ఖర్చు చేసి 80 శాతం ప్రాజెక్ట్‌లు పూర్తి చేస్తే మిగిలిన కొద్దిపాటి పనులు పూర్తి చేసి అంతా తన ఘనత చంద్రబాబు చెప్పుకోవడం సిగ్గు చేటన్నారు. జాతీయ మహిళా పార్లమెంట్‌కు ఎమ్మెల్యే రోజాను ఆహ్వానించి మధ్యలోనే అరెస్ట్ చేసి అవమానించారని, అమె అంటే వారికి ఎందుకు భయమో అర్థం కావడం లేదన్నారు. ప్రతి పక్షనేతగా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజల తరఫున మాట్లాడుతుంటే అసెంబ్లీలో కూడా అడ్డుకుంటున్నారన్నారు. అయినా ప్రజా సంక్షేమం కోసం జగన్‌మోహన్‌రెడ్డి మొక్కవోని దీక్షతో ముందుకెళ్తున్నారని కొనియాడారు.
పార్టీ రాష్ట్ర కార్యదర్శి బీవై రామయ్య మాట్లాడుతూ బాబు అరాచకాలు రాయడానికి వెయ్యి పేజీల పుస్తకమైనా సరిపోదని ఎద్దేవా చేశారు. వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చుతామని మోసం చేశాడన్నారు. కాటసాని రామిరెడ్డి మాట్లాడుతూ పింఛన్ రూపంలో వచ్చే నెలకు వెయ్యి రూపాయల కోసం టీడీపీ నాయకులు అక్రమాలకు పాల్పడుతున్నారన్నారు. చివరకు పేదలకు పంచాల్సిన రేషన్ బియాన్ని కూడా పందికొక్కుల్లా దిగమింగుతున్నారని ఆరోపించారు.
గనులు చేయకుండా అల్ట్రాటెక్ కంపెనీకి లేఖ రాయడం ప్రజాప్రతినిధిగా ఎమ్మెల్యేకు తగదన్నారు. తన హయాంలో పేదలు చేసుకునే గనుల జోలికి వెళ్లలేదని గుర్తు చేశారు. ఇకపై టీడీపీ ఆటలు సాగవని హెచ్చరించారు. అనంతరం అమర్‌నాథ్ అధ్వర్యంలో ఏర్పాటు చేసిన పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. మండల అధ్యక్షుడు మొలక రాజారెడ్డి, ఉపాధ్యక్షుడు పులిప్రకాష్‌రెడ్డి, మాజీ సర్పంచ్ బ్రహ్మయ్య, ఎస్సీ సెల్ అధ్యక్షుడు సూరి, నాయకులు గుర్విరెడ్డి, సుంకప్ప, చంద్రుడు పాల్గొన్నారు.
Advertisement
Advertisement