'చంద్రబాబు డిప్యూటీ స్పీకర్ను అవమానించారు'
హైదరాబాద్: గత అసెంబ్లీ సమావేశాలలో విపక్ష సభ్యులెవరూ తప్పుచేయలేదని, వారిపై చర్యలు తీసుకోవాల్సిన అవసరంలేదని వైఎస్సార్‌సీపీ శాసనసభ పక్ష ఉపనేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. హైదరాబాద్ లో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. గతంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డిప్యూటీ స్పీకర్ కుతూహలమ్మను అవమానపరిచారని ఈ సందర్భంగా గుర్తుచేశారు. వైఎస్ఆర్ సీపీ సభ్యులు ఎవరినీ అగౌరవపరచలేదనీ, విపక్ష నేతలపై చర్యలు తీసుకోవాలనడం సరికాదని సూచించారు.
టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి గవర్నర్నూ అవమానపరిచారని ప్రివిలేజ్ కమిటీ సభ్యుడు పెద్దిరెడ్డి చెప్పారు. ఆ విషయాలతో పోల్చి చూస్తే ఇప్పుడు ఏపీ అసెంబ్లీలో అలాంటి ఘటనలేమీ జరగలేదు అని తెలిపారు. ప్రతిపక్ష వైఎస్ఆర్ సీపీ నేతలపై చర్యలు తీసుకోవల్సిన అవసరం లేదని కమిటీ సభ్యులకు చెప్పినట్లు రామచంద్రారెడ్డి వెల్లడించారు. అసెంబ్లీ కమిటీ ముందు హాజరై అభిప్రాయాలు వెల్లడించాల్సిందిగా అసెంబ్లీ ఇన్చార్జి కార్యదర్శి కె. సత్యనారాయణ ఈ నెల 15న వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే.