గవర్నర్ నరసింహన్ రాజీనామా చేయాలి
చిత్తూరు: గవర్నర్ నరసింహన్ ఫిరాయింపు ఎమ్మెల్యేలతో మంత్రులుగా ఎలా ప్రమాణం చేయిస్తారని, ఆయన గవర్నర్ పదవికి మచ్చతెచ్చారని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విమర్శించారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలతో ప్రమాణ స్వీకారం చేయించినందుకు నరసింహన్ నైతిక బాధ్యత వహించి గవర్నర్ పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత సి.రామచంద్రయ్య.. గవర్నర్ తీరును తప్పుపట్టారు. గవర్నర్ పచ్చి అవకాశవాదని, రాజ్యాంగ స్ఫూర్తిని మంటకలిపారని విమర్శించారు. దేవుడిపైనే కాదు, రాజ్యాంగంపైనా భక్తి ఉండాలని, ముఖ్యమంత్రి చంద్రబాబు దిగజారారని రామచంద్రయ్య అన్నారు. ఏపీ మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణలో ఐదుగురు మంత్రులను తొలగించి, కొత్తగా 11 మందిని తీసుకున్నారు. నలుగురు ఫిరాయింపు ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు దక్కాయి. భూమా అఖిల ప్రియ, అమర్‌నాథ్‌రెడ్డి, ఆదినారాయణరెడ్డి, సుజయకృష్ణ రంగారావులను కేబినెట్‌లోకి తీసుకున్నారు.