సమాచారం లీక్‌తో మన పరువు పోతోంది!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించిన హంద్రీనీవా, గాలేరునగరి సుజల స్రవంతి సాగునీటి పథకాల అంచనాల పెంపును ప్రస్తుత, పూర్వపు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు తిరస్కరించిన అంశం సోమవారం జరిగిన ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశంలో తీవ్ర చర్చనీయాంశం అయ్యింది. అంచనాల పెంపును ప్రస్తుత ప్రధాన కార్యదర్శి ఎస్పీ టక్కర్, ఇటీవలే ఉద్యోగ విరమణ చేసిన ఐవైఆర్ కృష్ణారావు తిరస్కరించిన విషయం తెలిసిందే. వీరిద్దరూ అంచనాల పెంపును తిరస్కరించటాన్ని ‘సాక్షి’ వెలుగులోకి తెచ్చింది. ఈ అంశంపైనే మంత్రివర్గ సమావేశంలో సుదీర్ఘంగా చర్చ జరిగింది.
ఇద్దరు ప్రధాన కార్యదర్శులు అంచనాల పెంపును వ్యతిరేకించారన్న అంశం పత్రికలకు ఎలా లీక్ అయిందని ఆర్థిక, జలవనరుల శాఖ మంత్రులు యనమల రామకృష్ణుడు, దేవినేని ఉమామహేశ్వరరావులపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ అంశం లీక్ కావటం వల్ల ప్రభుత్వం పరువు పోయిందని వ్యాఖ్యానించారు. ఇకపై ఏ చిన్న సమాచారం ఏ శాఖ నుంచి లీక్ అయినా అందుకు సంబంధిత మంత్రి, కార్యదర్శి బాధ్యత వహించాలని స్పష్టం చేశారు. ఈ నెల 22, 23 తేదీల్లో జరిగే కలె క్టర్ల సమావేశంలోగా బడ్జెట్ ప్రతిపాదనలు సిద్ధం చేయాలని మంత్రులు, అధికారులు, జిల్లా కలెక్టర్లకు సూచించారు.
ప్రలోభాలు చూపి పార్టీలో చేర్చుకుందాం...
తెలంగాణ రాష్ర్టంలో వరుస వలసలతో పార్టీకి కోలుకోలేని దెబ్బ తగిలిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో ఇతర పార్టీల నుంచి కొంతమందిని ప్రలోభపెట్టి రప్పించుకుంటేనే పరువు నిలబడుతుందని తెలుగుదేశం పార్టీ అభిప్రాయానికి వచ్చింది. జిల్లాల్లో ఏ పార్టీ నుంచి ఎవరు టీడీపీలో చేరినా మంత్రులు, జిల్లా నేతలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఎవ్వరూ అడ్డు చెప్పవద్దని, ఒకవేళ ఎవరు అడ్డు చెప్పినా పట్టించుకోబోమని టీడీపీ అధినేత చంద్రబాబు, ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ స్పష్టం చేశారు.
సోమవారం మంత్రివర్గ సమావేశం అనంతరం మంత్రులు, పార్టీ నేతలతో చంద్రబాబు, లోకేష్ సమావేశం అయ్యారు. సమావేశంలో పార్టీ ఏపీ విభాగం అధ్యక్షుడు కిమిడి కళా వెంకట్రావు, పార్టీ జాతీయ కార్యాలయ సమన్వయకర్త టీడీ జనార్ధనరావు, కార్యక్రమాల కమిటీ ఛైర్మన్ వీవీవీ చౌదరి తదితరులు పాల్గొన్నారు. ఏపీలో ప్రభుత్వం, పార్టీ పరిస్థితి, పార్టీలోకి ఎవరిని ఆకర్షించాలనే అంశంపై ప్రధానంగా చర్చించారు.
పలు జిల్లాలో ప్రలోభాలకు లొంగే అవకాశం ఉన్నవారినీ, ఇతరత్రా అవసరాలు ఉన్నవారినీ కొందరిని ఇతర పార్టీల్లో గుర్తించమనీ, తెలంగాణలో తగిలిన గాయాన్ని మాన్పించి కార్యకర్తల నుంచి పై స్థాయి వరకూ అందరిలో నైతిక స్థైర్యం నెలకొల్పేందుకు వలసలను ఉపయోగించుకోవాలని చంద్రబాబు చెప్పారు. బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అయ్యేంతవరకూ జిల్లాల్లో మంత్రులు, నేతలు ఇదే పనిలో ఉండాలని చెప్పారని సమాచారం. పార్టీ ఏపీ రాష్ట్ర కార్యాలయం అమరావతిలో ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అంతకుముందు విజయవాడలో తాత్కాలిక కార్యాలయం ఏర్పాటు చేస్తారు.
కేబినెట్ సమావేశానికి ముందు చంద్రబాబుతో కడప జిల్లా జమ్మలమడుగు మాజీ ఎమ్మెల్యే, పార్టీ సీనియర్ నేత పి. రామసుబ్బారెడ్డి భేటీ అయ్యారు. ప్రస్తుత ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డిని చేర్చుకోవాలని జరుగుతున్న ప్రయత్నాలపై చర్చించారు. ఎవరు వస్తే వారిని పార్టీలో చేర్చుకోక తప్పదని, అందుకు సహకరించాలని చంద్రబాబు సూచించారు.