'కాపులు గొంతెమ్మ కోర్కెలు కోరడం లేదు'
గుంటూరు : కాపు గర్జనను విఫలం చేసేందుకు రాష్ట్రప్రభుత్వం యత్నిస్తోందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు అన్నారు. ఆయన శనివారం గుంటూరులో మీడియా సమావేశంలో మాట్లాడుతూ కాపుల సంక్షేమం కోసం నిజంగా చంద్రబాబు నాయుడు చిత్తశుద్ధితో ప్రయత్నం చేసి ఉంటే...కాపు గర్జనను ఎందుకు అడ్డుకోవాలని చూస్తున్నారని ప్రశ్నించారు. పార్టీలోని కాపు నేతలెవరూ ...కాపు గర్జనకు వెళ్లకూడదని ఆదేశాలు ఇవ్వడం దుర్భుద్దితో కూడిన చర్య అని అంబటి మండిపడ్డారు. చంద్రబాబు ఆ సభను విఫలం చేయడానికి ఒక సంకేతాన్ని పంపించడం కోసం తీవ్ర ప్రయత్నం చేస్తున్నారన్నారు.
కాపులు గొంతెమ్మ కోర్కెలు కోరడం లేదని, ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీనే అమలు చేయమంటున్నారని అంబటి రాంబాబు అన్నారు. పై పెచ్చు ఇతర పార్టీలపై చంద్రబాబు నాయుడు బురద జల్లడం సరికాదని ఆయన హితవు పలికారు. కాపు గర్జనకు మాజీ మంత్రి, కాపునాడు నాయకుడు ముద్రగడ పద్మనాభం పిలుపునిచ్చారని, ఆయన ప్రస్తుతం ఏ పార్టీలో లేరనే విషయాన్ని చంద్రబాబు గుర్తు చేసుకుంటే మంచిదన్నారు. సభను విఫలం చేయాలని చూస్తే కాపుల ఆగ్రహానికి గురి కాక తప్పదని అంబటి హెచ్చరించారు. కాగా కాపుల రిజర్వేషన్ల సాధనకు ముద్రగడ పద్మనాభం ఈనెల 31న తునిలో నిర్వహించ తలపెట్టిన కాపు గర్జనకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.