ఇది ప్రజాస్వామ్యమా? నియంతృత్వమా?
ముద్రగడ మండిపాటు
కిర్లంపూడి: కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం నిర్వహించ తలపెట్టిన పాదయాత్రకు పోలీసులు మరోసారి బ్రేక్ వేశారు. జేఎసీ, కాపు నాయకులతో కలసి ముద్రగడ ఆదివారం ఉదయం కిర్లంపూడిలోని తమ ఇంటి నుంచి పాదయాత్రకు బయలుదేరారు. వారు గేటు దాటిన వెంటనే పోలీసులు అడ్డుకుని పాదయాత్రకు అనుమతులు లేవని తెలిపారు. దీనిపై ముద్రగడ స్పందిస్తూ ‘ప్రజాస్వామ్య ప్రభుత్వంలో ఉన్నామా? నియంతృత్వ పాలనలో ఉన్నామా?’ అని పోలీసులను ప్రశ్నించారు.
గాంధేయ మార్గంలో పాదయాత్ర చేస్తానంటే పోలీసులను అడ్డుపెట్టుకుని అడ్డుకోవడం నిరంకుశ పాలనకు నిదర్శనం అన్నారు. అనంతరం ముద్రగడతో పాటు జేఏసీ, కాపు నాయకులు నోటికి నల్ల రిబ్బన్లు కట్టుకొని ప్రభుత్వ వైఖరిపై నిరసన వ్యక్తం చేశారు. చంద్రబాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.