రిజర్వేషన్లు కాపు జాతి గుండె చప్పుడు
కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం
సాక్షి ప్రతినిధి, కాకినాడ/తాడేపల్లి గూడెం: రిజర్వేషన్ల సాధన కాపు జాతి గుండె చప్పుడని, దానికోసం అలుపెరగని పోరాటం చేస్తామని కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మ నాభం స్పష్టం చేశారు. రిజర్వేషన్ల సాధన కోసం పోరాడుతున్న కాపులు ఆకలికేకలు పేరుతో ఆదివారం కంచాలు మోగిస్తూ నిర్వహించిన నిరసన కార్యక్రమాలతో తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలు దద్దరిల్లాయి. కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం, తణుకు, పెరవలిల్లో ఈ నిరసనలో పాల్గొన్నారు. తాడేపల్లిగూడెంలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ కాపు జాతికి మేలు చేస్తారని చంద్రబాబునాయుడిని గద్దెనెక్కిస్తే.. ఆయన కాపులను మోసగించారని విమర్శించారు.
ఆరు నెలల్లో కాపులను బీసీల్లో చేరుస్తామని చెప్పిన చంద్రబాబు రెండున్నరేళ్లు దాటినా మాట నిలబెట్టుకోలేదని ధ్వజమెత్తారు. అనంతరం కాపులు నోటికి నల్లరిబ్బన్లు కట్టుకుని కంచాలపై గరిటెతో శబ్దం చేసి నిరసన తెలిపారు. కాపు జేఏసీ నాయకులు ఆకుల రామకృష్ణ, కాపునాడు జిల్లా అధ్యక్షుడు చినిమిల్లి వెంకట్రాయుడు, వైఎస్సార్ సీపీ తాడేపల్లిగూడెం నియోజకవర్గ కన్వీనర్ కొట్టు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. తూర్పు గోదావరి జిల్లాలో పలు నియోజకవర్గాల్లోని ముఖ్య కూడళ్లలో ఈ నిరసన కార్యక్రమాలు నిర్వహించారు.