- పెండింగ్ ప్రాజెక్టులు వెంటనే పూర్తి
- పెండింగ్ రేషన్‌కార్డులు.. పింఛన్లు, దీపం కనెక్షన్లు సత్వరం పంపిణీ
- ఇళ్ల పట్టాలు, హౌసింగ్‌ఫర్ వెంటనే పూర్తి
- వీడియో కాన్ఫరెన్స్‌లో మంత్రులు,
- అధికారులకు సీఎం ‘దిశా’ నిర్దేశం!
విశాఖపట్నం: ‘జీవీఎంసీ మేయర్ పీఠం గెలవాలంటే ఎం చేయాలి? ఏం చేసైనా సరే.. రానున్న జీవీఎంసీ ఎన్నికల్లో 80 శాతం ఓట్లు.. సీట్లు దక్కించుకోవాలి.. అందుకు అనుగుణంగా మీరంతా పనిచేయండి..పెండింగ్ పనులన్నీ సత్వరమే పూర్తి చేయండి.. ఏం కావాలో చెప్పండి’ అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జిల్లా మంత్రులు, అధికారులను ఆదేశించారు. మంగళవారం వీడియో కాన్ఫరెన్స్‌లో సీఎం మాట్లాడుతూ గడిచిన రెండేళ్లలో విశాఖకు ఎంతో ప్రాధాన్యమిచ్చామన్నారు. ‘ఎన్నో ప్రాజెక్టులు తెచ్చాం.
ఫ్లీట్ రివ్యూ కోసం నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దాం. స్మార్ట్‌సిటీగా ఎంపికైంది. భారీ ప్రాజెక్టులు చేపడుతున్నాం. ప్రజలు ఏమనుకుంటున్నారు? మనకు ఎంతవరకు అవకాశాలున్నాయి? మీరేం చేస్తారో నాకు తెలియదు 80 శాతం మంది ప్రజల హృదయాలను గెలుచుకోవాలి’ అన్నారు. పెండింగ్‌లో ఉన్న రేషన్ కార్డులు, దీపం కనెక్షన్లు, పింఛన్లు, ఇళ్ల పట్టాలు, హౌసింగ్ ఫర్ ఆల్, ఆక్రమణల క్రమబద్దీకరణ వంటి వాటిని సత్వరం పూర్తి చేయాలన్నారు. ‘జీవీఎంసీ ఎన్నికల్లో గెలుపు నాకు ప్రతిష్టాత్మకం.. ఎన్నికలు పూర్తిగా ఏకపక్షంగా జరిగేటట్టు చూడాలి. పోటీ పెట్టే అవకాశం లేకుండా చేయాలి..అన్ని వార్డుల్లో ఏకగ్రీవంగా ఎన్నికయ్యేట్టు చూడాలి’ అంటూ మంత్రులకు హితవు పలికారు.
మూడేళ్లకు సడలింపు
ప్రభుత్వ ఉత్తర్వుల్లో ఇచ్చిన నిబంధనలకు అనుగుణంగా బదిలీల ప్రక్రియను బుధవారం సాయంత్రం కల్లా పూర్తి చేయాలనిసీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. మూడేళ్ల లోపు సర్వీసు ఉన్న వారు సైతం దరఖాస్తు చేసుకుంటే వాటినికూడా పరిశీలించి బదిలీ చేయాలన్నారు. కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాలులో జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రులు గంటా శ్రీనివాసరావు, అయ్యన్న పాత్రుడు, మృణాళిని, కలెక్టర్ యువరాజ్, జేసీ నివాస్, డీఆర్‌వో చంద్రశేఖర రెడ్డి, ఎంపీ అవంతి శ్రీనివాస్, పలువురు ఎమ్మెల్యేలు, అధికారులు పాల్గొన్నారు.