
'బీజేపీ, కాంగ్రెస్ కలసి అన్యాయం చేశాయి'
విజయవాడ : రాష్ట్ర విభజనతో ఆంధ్రప్రదేశ్కు అన్యాయం జరిగిందని ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం విజయవాడలో టీడీపీ ఎంపీలతో చంద్రబాబు సమావేశం ముగిసింది. అనంతరం చంద్రబాబు విలేకర్లతో మాట్లాడుతూ.... బీజేపీ, కాంగ్రెస్ రెండూ కలిసి రాష్ట్రానికి అన్యాయం చేశాయని ఆరోపించారు. విభజన చట్టంలోని హామీలనే అమలు చేయాలని కోరుతున్నామని చంద్రబాబు ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
14వ ఆర్థిక సంఘానికి, ప్రత్యేక హోదాకు అసలు సంబంధమే లేదన్నారు. ఆర్థిక సంఘం పేరు చెప్పి బీజేపీ తప్పించుకుంటోందని చంద్రబాబు ఆరోపించారు. ప్రధాని మోదీని టీడీపీ ఎంపీలు కలిసి రాష్ట్రానికి జరిగిన అన్యాయం వివరిస్తారని చెప్పారు. ప్రధాని సమాధానం చెప్పిన తర్వాతే ఏం చేయాలో ఆలోచిస్తామన్నారు. ఇతర రాష్ట్రాలతో సమానంగా అభివృద్ధి చెందే వరకు ఏపీని ఆదుకోవాలని కేంద్రానికి ఈ సందర్భంగా చంద్రబాబు విజ్ఞప్తి చేశారు.
వనరులు లేవని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ చెప్పిన సమాధానం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు. విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్తోపాటు ప్రజలను ఆదుకునే బాధ్యత కేంద్రంపై ఖచ్చితంగా ఉందని చంద్రబాబు పేర్కొన్నారు.
ఆందోళనకు పిలుపు ఇచ్చే పార్టీలు కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని కోరారు. ఇక్కడ ఆందోళనలు చేయాల్సిన అవసరం లేదని... బంద్లతో అభివృద్ధిని అడ్డుకోవద్దని ప్రతిపక్షానికి సూచించారు. కేంద్రంపై ఒత్తిడి పెంచేలా నిరసన ఉండాలి... మళ్లీ అదే సమయంలో నష్టం కలగకూడదని చంద్రబాబు పేర్కొన్నారు. కేంద్రంలో ఉన్నామని అందుకే సంకీర్ణ ధర్మాన్ని తాము పాటిస్తున్నట్లు వివరించారు.
ప్రధాని వద్దకు అఖిల పక్షం వెళ్తే ఏం చేస్తుంది ? దాని వల్ల లాభం ఏమిటని చంద్రబాబు ప్రశ్నించారు. ఐదారు మంది వెళ్తే ఏం జరుగుతుంది... ఇద్దరు లేదా ముగ్గురు వెళ్లి ఓ వినతిపత్రం ఇస్తే సరిపోతుందా? అని చంద్రబాబు ఒకింత ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం పార్లమెంట్లోని గాంధీ విగ్రహం వద్ద టీడీపీ ఎంపీలు నిరసన తెలుపుతారన్నారు. ప్రత్యేక హోదా అంశాన్ని ఢిల్లీ పెద్దలకు తెలపాలంటే బంద్లు అవసరం లేదని ... మొక్కలు నాటండి... రోడ్లు ఊడ్చండి అని రాజకీయ పార్టీలకు చంద్రబాబు సూచించారు.