సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రయోజనాలే తమకు ముఖ్యం, ప్రజా ప్రయోజనాలపై రాజీపడే ప్రసక్తే లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో శుక్రవారం ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రత్యేక హోదా ఇవ్వడానికి అడ్డంకులు ఉన్నాయని చెప్పడం వల్లే ప్రత్యేక ప్యాకేజీకి అంగీకరించామన్నారు. హోదాతో పాటు అన్ని హామీలను కేంద్ర ప్రభుత్వం అమలు చేయాలని డిమాండ్ చేశారు. విభజన తరువాత రెండు తెలుగు రాష్ట్రాలు బలహీనపడ్డాయని, 42 ఎంపీలు ఉన్నప్పుడు కేంద్రంపై ఒత్తిడి తెచ్చి రాష్ట్రానికి లబ్ధి చేకూర్చామని చెప్పారు. నాలుగేళ్లయినా విభజన గాయాలు మానలేదన్నారు.
మమ్మల్ని ఇబ్బందులు పెడతారా?
బీజేపీపై రాయలసీమ డిక్లరేషన్‌పై చంద్రబాబు మండిపడ్డారు. కేంద్రాన్ని నిధులు అడగకుండా రాష్ట్ర ప్రభుత్వానికి ఇబ్బందులు పెడతారా అని ప్రశ్నించారు. కేంద్రంతో సంప్రదింపుల్లో తాము అలక్ష్యం చేయలేదని, నిన్న కూడా సంప్రదింపులు జరిపామని తెలిపారు. ఏపీ ఆర్ధికలోటు భర్తీకి ఫార్ములా ఇచ్చామన్న కేంద్రం వాదనపైనా ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఎన్నో సంక్షోభాలు
టీడీపీ ఎన్నో సంక్షోభాలు ఎదుర్కొందని చంద్రబాబు తెలిపారు. ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని కూలదోయడం, టీడీపీ నాయకత్వ మార్పిడి, రాష్ట్ర విభజన, ప్రస్తుత పరిస్థితుల్లోనూ సంక్షోభం ఎదుర్కొంటున్నామని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment