మార్పులు చేర్పులు
-
సిరిసిల్ల జిల్లా భౌగోళిక స్వరూపంపై హైపవర్ కమిటీకి నివేదిక
-
సెస్ లేదా ఆర్‌డీవో కార్యాలయంలో కలెక్టరేట్‌ను ఓకే చేసే అవకాశం
-
రత్నాపూర్, పాలకుర్తి, పలిమెల, హుస్నాబాద్‌రూరల్ మండలాలపై సానుకూలత!
సాక్షి ప్రతినిధి, కరీంనగర్ : దసరా పండగకు సమయం దగ్గర పడుతోంది. కొత్త జిల్లాల్లో మార్పులు చేర్పుల కసరత్తు ఇంకా కొనసాగుతూనే ఉంది. తాజాగా మరో నాలుగు కొత్త మండలాలను ఏర్పాటు చేయాలని ప్రతిపాదిస్తూ జిల్లా అధికారయంత్రాంగం రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావు ఆధ్వర్యంలోని హైపవర్ కమిటీకి నివేదించింది. సిరిసిల్ల జిల్లా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించడంతో జిల్లా భౌగోళిక స్వరూపం, జనాభా, కొత్త మండలాలు, కలెక్టరేట్ ఏర్పాటు వంటి అంశాలపై రూపొందించిన ప్రతిపాదనను కూడా హైపవర్ కమిటీకి పంపింది. సిరిసిల్ల కలెక్టరేట్ భవనాన్ని ఎక్కడ ఏర్పాటు చేయాలనే అంశాన్ని బుధవారం మంత్రి కేటీఆర్ సమక్షంలో ఖరారు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. అయితే మంత్రి పర్యటన వాయిదాపడింది. సెస్ లేదా ఆర్‌డీవో కార్యాలయంలో కలెక్టరేట్‌ను ఏర్పాటు చేసే అవకాశముంది. మరోవైపు హుస్నాబాద్, కోహెడ, కోరుట్లలో ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. హుస్నాబాద్, కోహెడ మండలాలను కరీంనగర్ జిల్లాలోనే కొనసాగించాలని మంగళవారం హుస్నాబాద్‌లో స్థానిక ఎమ్మెల్యే వి.సతీష్‌కుమార్ దిష్టిబొమ్మను దహనం చేశారు. రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటు చేయాలని కోరుట్లలో ఆందోళన కొనసాగించారు. తాజాగా కమలాపూర్ మండలాన్ని కూడా కరీంనగర్ జిల్లాలోనే కొనసాగించాలని, హుజూరాబాద్ నియోజకవర్గం నుంచి విడదీయొద్దని అధికార పార్టీ ఆధ్వర్యంలోనే ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించారు.
ఆ నాలుగు ఖాయం...
జిల్లా అధికారయంత్రాంగం కొత్తగా ప్రతిపాదించిన నాలుగు మండలాల ఏర్పాటు ఖాయంగా కన్పిస్తోంది. కమాన్‌పూర్ మండలంలోని రత్నాపూర్, రామగుండంలోని పాలకుర్తి, మహదేవపూర్‌లోని పలిమెల, హుస్నాబాద్‌రూరల్ మండలాలను ఏర్పాటు చేయాలని పంపిన ప్రతిపాదనలకు హైపవర్ కమిటీ ఆమోదముద్ర వేసినట్లు తెలిసింది. స్థానిక ఎమ్మెల్యేల విజ్ఞప్తి మేరకు ఈ ప్రతిపాదనలను ఆమోదించినట్లు సమాచారం. మరోవైపు హుస్నాబాద్ రెవెన్యూ డివిజన్ ఏర్పాటు అంశాన్ని పరిశీలించాలని సీఎం కేసీఆర్ గతనెలలో సూచించినప్పటికీ దీనిపై ఇంకా స్పష్టత రాలేదు. కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటు కసరత్తు ప్రక్రియ ఈనెల 7వరకు కొనసాగనుండటంతో ఇంకా మార్పులు, చేర్పులు ఉండే అవకాశాలున్నాయి. మంత్రి ఈటల రాజేందర్ స్వస్థలమైన కమలాపూర్ మండలాన్ని కూడా కరీంనగర్ జిల్లాలోనే కొనసాగించాలని అధికార పార్టీ నేతల నుంచి ఒత్తిళ్లు వస్తున్న నేపథ్యంలో దీనిపైనా హైపవర్ కమిటీ దష్టి సారించినట్లు తెలుస్తోంది. హుస్నాబాద్, కోహెడ మండలాలను కరీంనగర్ జిల్లాలోనే కలపాలని తీవ్రమైన ఒత్తిళ్లు వస్తున్న నేపథ్యంలో వీటిపై ఏం నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది.
ఉద్యోగుల విభజన..
ప్రభుత్వం ప్రకటించిన ముసాయిదా ప్రకారం కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి జిల్లాలకు ఉద్యోగులను విభజించారు. తాజాగా సిరిసిల్ల జిల్లాకు ఉద్యోగులను సర్దుబాటు చేయాల్సి వస్తోంది. జగిత్యాల, పెద్దపల్లి జిల్లాలకు ఉద్యోగుల కేటాయింపులో మార్పులు చేయకుండా.. కరీంనగర్ జిల్లాకు కేటాయించిన వారి నుంచే సిరిసిల్లకు సర్దుబాటు చేయాలని అధికారులు భావిస్తున్నారు. ఈ నాలుగు జిల్లాలకు ఉద్యోగుల విభజనపై నేడు లేదా రేపటి వరకు స్పష్టవచ్చే అవకాశముందని అధికార వర్గాల సమాచారం.
సిరిసిల్ల జిల్లా స్వరూపమిదే...
జిల్లాలో పాత, కొత్త మండలాలు కలిపి మొత్తం 14 ఉన్నాయి. ప్రస్తుతానికి 179 గ్రామాలతో కొత్త జిల్లాను ప్రతిపాదిస్తూ అధికార యంత్రాంగం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. నిజామాబాద్ జిల్లా మాచారెడ్డి మండంలోని కొన్ని గ్రామాలను సిరిసిల్ల జిల్లాలో కలిపేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నాను. దీనిని నిరసిస్తూ అక్కడి గ్రామాల ప్రజలు ఆందోళనలు చేస్తున్నారు. ప్రతిపాదిత సిరిసిల్ల జిల్లా జనాభా 5.65 లక్షలు. ఈ జిల్లాలోని మండలాల్లో సగటు గ్రామాల సంఖ్య 12. వీర్నపల్లి అతి చిన్న మండలం. 15 వేల జనాభాతో మండలాన్ని ప్రతిపాదించారు. 92 వేల జనాభాతో అతిపెద్ద మండలంగా సిరిసిల్ల అర్బన్ అవతరించనుంది.