తనకల్లు (కదిరి): ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నిరుద్యోగులకు మాయమాటలు చెప్పి రూ. 6 లక్షలకు టోకరా వేసిన ఇద్దరు నిందితులను పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. ఎస్‌ఐ శ్రీనివాసులు తెలిపిన మేరకు.. ఓడీ చెరువు మండలం తిప్పేనాయక్ తండాకు చెందిన రామునాయక్ కుమార్తెలు రాజ్యలక్ష్మీబాయి, గీతాంజలీబాయి నర్సింగ్ కోర్సు పూర్తి చేసి, ఉద్యోగాన్వేషణలో ఉన్నారు. రామునాయక్‌కు తనకల్లు మండలం కొక్కంటిక్రాస్‌లో ఆర్‌ఎంపీగా పని చేస్తున్న రవీంద్రానాయక్, కదిరికి చెందిన మాజీ ఆర్టీసీ కండక్టర్ నాగమునినాయక్, రైల్వే ఉద్యోగి రంగ్లానాయక్ పరిచయమయ్యారు.
ఈ నేపధ్యంలో వారు ‘మాకు తిరుపతి స్విమ్స్ ఆస్పత్రి డైరెక్టర్ బాగా తెలుసు..ఆయనతో మాట్లాడి మీకు నర్సులుగా ఉద్యోగాలు ఇప్పిస్తాం’ అంటూ రామునాయక్‌కు నమ్మబలికారు. ఒక్కో పోస్టుకు రూ.3 లక్షలు ఖర్చు అవుతుందని చెప్పారు. ఇద్దరికీ ఉద్యోగాలు వస్తాయన్న ఆశతో 2014లో వారికి రూ.6 లక్షలు ఇచ్చాడు. ఆ తరువాత ఎప్పుడు ఉద్యోగాలు వస్తాయని అడిగితే అదిగో ఇదిగో అంటూ కాలయాపన చేస్తూ వచ్చారు. మధ్యలో అనుమానం రాకూడదనే ఉద్దేశంతో నాలుగైదు సార్లు తిరుపతి స్విమ్స్‌కు పిలుచుకెళ్లారు. వెళ్లిన ప్రతి సారీ ‘నువ్వు ఇక్కడే ఉండు, మేము డైరెక్టర్‌తో మాట్లాడి వస్తామంటూ’ రామునాయక్‌ను బయట ఉంచి, ముగ్గురూ లోపలికి వెళ్లి వచ్చేవారు. ‘సార్‌తో మాట్లాడినాం త్వరలోనే ఇద్దరికీ ఉద్యోగాలు వస్తాయని’ చెప్పేవారు. అయినా ఉద్యోగాలు రాకపోవడంతో అనుమానం వచ్చిన రామునాయక్ నేరుగా స్విమ్స్ డైరెక్టర్‌ను కలిసి విషయం చెప్పాడు.
ఇక్కడ ఎలాంటి ఉద్యోగాలూ లేవని, ఎవరో తప్పుదోవ పట్టించారని ఆయన స్పష్టం చేశారు. తాను మోసపోయానని బాధితుడు గ్రహించి, పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితులలో ఇద్దరిని పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. మరో నిందితుడు రంగ్లానాయక్‌ను అరెస్టు చేయాల్సి ఉందని ఎస్‌ఐ తెలియజేశారు. అరెస్టు చేసిన వారిని కదిరి కోర్టుకు హాజరు పరచగా, న్యాయమూర్తి వారికి రిమాండ్ విధించారు.