thanakallu
-
ఆ మండలంలో టీడీపీకి కోలుకోలేని దెబ్బ
తనకల్లు : నల్లచెరువు మండలంలో టీడీపీకి కోలుకోలేని ఎదురుదెబ్బ తగిలింది. ఉబిచెర్ల, గోర్లవారిపల్లి, నడిమిపల్లి, సుబ్బరాయునిపల్లికి చెందిన ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆదివారం ఉబిచెర్లలో వైఎస్సార్సీపీ తీర్థం పుచ్చుకున్నారు. నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ సిద్ధారెడ్డి వారికి పార్టీ కండువాలు వేసి సాదరంగా ఆహ్వానించారు. పార్టీ మారిన వారిలో ఉబిచెర్ల నుంచి శివన్న, గంగాద్రి, శ్రీరాములు, నరసింహులు, ఆంజినేయులు, హరీష్‌కుమార్, శేఖర్, హరిప్రసాద్, శ్రీరాములు, జయచంద్ర, నరసింహులు, మహేష్, మధు, రాము, శ్రీనివాసులు, తలారి నరసింహులు, మనోహర్‌రెడ్డి, ఆనంద్, లక్ష్మీనారాయణ, గోర్లవారిపల్లి నుంచి నరసింహులు, హైదర్‌వలి, బాబ్జాన్, అంజనప్ప, నడిమిపల్లి నుంచి సాయికృష్ణ, మహిమరాజు, అరవిందు, జయచంద్రారెడ్డి, కుళ్లాయప్ప, తిరుపాలు, నరసింహులు, చంద్రమోహన్, సుబ్బరాయునిపల్లి నుంచి పురుషోత్తంరెడ్డి, రామయ్య, సూర్యనారాయణరెడ్డి, సూరి, బావయ్య, గంగులప్ప, సోమశేఖర్ తదితరులున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చంద్రబాబు పాలనలో రాష్ట్రవ్యాప్తంగా అవినీతి, అక్రమాలు రోజు రోజుకూ పెరిగిపోతున్నాయన్నారు. టీడీపీలో నిజమైన కార్యకర్తలకు గుర్తింపు లేదన్నారు. అందునా రాష్ట్రాభివృద్ధి వైఎస్ జగన్మోహన్రెడ్డితోనే సాధ్యమనే విషయాన్ని తాము గుర్తించామన్నారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్ జగన్‌ను ముఖ్యమంత్రిని చేసుకోవడానికి సైనికుల్లా పని చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ రమణారెడ్డి, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి దశరథనాయుడు, జిల్లా కార్యదర్శి లక్ష్మీపతియాదవ్, నాయకులు కిష్టప్ప, అక్బర్, యువజన విభాగం మండల కన్వీనర్ నాగభూషణ, ఎంపీటీసీ శివారెడ్డి పాల్గొన్నారు. -
పద్ధతి మార్చుకోలేదని ప్రాణం తీశాడు
- ప్రియురాలిని చంపిన ప్రియుడు - శవం సహా పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయిన నిందితుడు తనకల్లు: వివాహేతర సంబంధం వద్దని చెప్పినా పద్ధతి మార్చుకోనందుకు ప్రియురాలిని అంతమొందించిన ప్రియుడి ఉదంతం తనకల్లు మండలంలో మంగళవారం వెలుగుచూసింది. శవం సహా పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. వివరాల్లోకి వెళితే.. కదిరి పట్టణానికి చెందిన అశోక్‌కు భార్య సుభాషిణి, ఇద్దరు పిల్లలు ఉన్నారు. అశోక్ డ్రైవర్‌గా పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. స్థానిక ఎన్జీఓ కాలనీలో నివాసముంటున్న కుమార్ బ్రిక్స్, టైల్స్ వర్క్ చేసేవాడు. కుమార్ అప్పుడుప్పుడు సిమెంట్ ఇటుకలు, టైల్స్‌ని అశోక్‌కు చెందిన టాటా ఏస్ వాహనంలో తరలించేవాడు. దీంతో ఇద్దరి మధ్య పరిచయం పెరిగింది. ఈ నేపధ్యంలో కుమార్ ఇంట్లో లేని సమయంలో వారి ఇంటికి వచ్చి వెళ్తూ అతని భార్య మల్లీశ్వరి(40)తో ఏడాది నుంచి వివాహేతర సంబంధాన్ని కొనసాగించేవాడు. విషయం తెలుసుకున్న కుమార్.. అశోక్‌తో గొడవపెట్టుకున్నాడు. కొద్దిరోజుల తర్వాత అశోక్ తిరుపతికి వెళ్లి కారును బాడుగుల కోసం పెట్టుకొని అక్కడే ఉంటున్నాడు. అయినా ఇద్దరి మధ్య వివాహేతర సంబంధం అలాగే కొనసాగేది. మంగళవారం మల్లీశ్వరిని కొక్కంటిక్రాస్‌కు రప్పించుకున్నాడు. అక్కడి నుంచి తన కారు(ఏపీ 03 టీవీ 5788)లో ఆమెను కూర్చోబెట్టుకొని పెట్రోల్ బంకు ఎదురుగా రోడ్డు పక్కన ఆపి కారులోనే గొడవపెట్టుకున్నాడు. ‘నువ్వు నాతోనే కాదు.. ఇంకా ఆరుగురితో వివాహేతర సంబంధం పెట్టుకున్నావు. వెంటనే వాటన్నింటినీ వదులుకో’ అని అశోక్ హుకుం జారీ చేయడంతో ఆమె ఒప్పుకోలేదు. ఇద్దరి మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం జరిగింది. కోపోద్రిక్తుడైన అశోక్ కారులో ఉంచిన కొడవలితో మల్లీశ్వరి మెడపై ఐదుసార్లు నరికాడు. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. అనంతరం శవాన్ని కారులోనే పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లి పోలీసుల ఎదుట లొంగిపోయాడు. తానే ఆమెని హతమార్చినట్లు ఒప్పుకున్నాడు. మృతురాలికి ఇద్దరు పిల్లులు ఉన్నారు. కేసు నమోదు చేసినట్లు హెడ్ కానిస్టేబుల్ సూర్యనారాయణ తెలిపారు. -
‘విత్తన నాణ్యతలో రాజీ పడొద్దు’
తనకల్లు : ఖరీఫ్‌లో రైతులకు సబ్సిడీతో పంపిణీ చేసే విత్తన వేరుశనగ నాణ్యతలో రాజీ పడొద్దని వ్యవసాయ శాఖ ఇన్చార్జ్ జేడీఏ జయచంద్ర పేర్కొన్నారు. మండల పరిధిలోని గందోడివారిపల్లిలో ఉన్న మన విత్తన కేంద్రాన్ని పలువురు అధికారులతో కలిసి మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో మొత్తం 3.50 లక్షల క్వింటాళ్ల పంపిణీకీ అనుమతులు వచ్చాయన్నారు. ఏపీ సీడ్స్‌కు 34 మండలాలు, ఆయిల్‌ఫెడ్‌కు 15 మండలాలు, మార్క్‌ఫెడ్‌కు 13 మండలాలు, వాసన్ ఎన్జీఓకు తనకల్లు మండలం విత్తన సేకరణ బాధ్యతల్ని అప్పగించామన్నారు. త్వరలోనే జిల్లాలోని అన్ని మండల కేంద్రాల్లో విత్తన పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. తనకల్లు మండలంలో ఇప్పటి వరకు ఎంత విత్తన వేరుశనగ సేకరించారని ఏఓ రాంసురేష్‌బాబును అడిగి తెలుసుకున్నారు. 6500 క్వింటాళ్లుకు గానూ ఇంతవరకు 2,880 క్వింటాళ్లు సేకరించామని ఏఓ సమాధానమిచ్చారు. మిగిలిన వాటిని 15వ తేది లోపల పూర్తీ చేస్తామన్నారు. ఆయన వెంట వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ సంపత్‌కుమార్, ఏడీఏ పీపీ విద్యావతి, ఏఓ ప్రసాద్, ఏపీ సీడ్స్ డీఎం రెడ్డెప్పరెడ్డి, ఆయిల్ ఫెడ్ పరుశురామయ్య, ఏఈఓ వెంకటేష్, జేజే సిబ్బంది ఉన్నారు. -
ఉద్యోగాలు ఇప్పిస్తామని టోకరా
= బాధితుడి నుంచి రూ.6లక్షల వసూలు = ఇద్దరిని అరెస్టు చేసిన పోలీసులు తనకల్లు (కదిరి): ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నిరుద్యోగులకు మాయమాటలు చెప్పి రూ. 6 లక్షలకు టోకరా వేసిన ఇద్దరు నిందితులను పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. ఎస్ఐ శ్రీనివాసులు తెలిపిన మేరకు.. ఓడీ చెరువు మండలం తిప్పేనాయక్ తండాకు చెందిన రామునాయక్ కుమార్తెలు రాజ్యలక్ష్మీబాయి, గీతాంజలీబాయి నర్సింగ్ కోర్సు పూర్తి చేసి, ఉద్యోగాన్వేషణలో ఉన్నారు. రామునాయక్‌కు తనకల్లు మండలం కొక్కంటిక్రాస్లో ఆర్ఎంపీగా పని చేస్తున్న రవీంద్రానాయక్, కదిరికి చెందిన మాజీ ఆర్టీసీ కండక్టర్ నాగమునినాయక్, రైల్వే ఉద్యోగి రంగ్లానాయక్ పరిచయమయ్యారు. ఈ నేపధ్యంలో వారు ‘మాకు తిరుపతి స్విమ్స్ ఆస్పత్రి డైరెక్టర్ బాగా తెలుసు..ఆయనతో మాట్లాడి మీకు నర్సులుగా ఉద్యోగాలు ఇప్పిస్తాం’ అంటూ రామునాయక్‌కు నమ్మబలికారు. ఒక్కో పోస్టుకు రూ.3 లక్షలు ఖర్చు అవుతుందని చెప్పారు. ఇద్దరికీ ఉద్యోగాలు వస్తాయన్న ఆశతో 2014లో వారికి రూ.6 లక్షలు ఇచ్చాడు. ఆ తరువాత ఎప్పుడు ఉద్యోగాలు వస్తాయని అడిగితే అదిగో ఇదిగో అంటూ కాలయాపన చేస్తూ వచ్చారు. మధ్యలో అనుమానం రాకూడదనే ఉద్దేశంతో నాలుగైదు సార్లు తిరుపతి స్విమ్స్‌కు పిలుచుకెళ్లారు. వెళ్లిన ప్రతి సారీ ‘నువ్వు ఇక్కడే ఉండు, మేము డైరెక్టర్‌తో మాట్లాడి వస్తామంటూ’ రామునాయక్‌ను బయట ఉంచి, ముగ్గురూ లోపలికి వెళ్లి వచ్చేవారు. ‘సార్‌తో మాట్లాడినాం త్వరలోనే ఇద్దరికీ ఉద్యోగాలు వస్తాయని’ చెప్పేవారు. అయినా ఉద్యోగాలు రాకపోవడంతో అనుమానం వచ్చిన రామునాయక్ నేరుగా స్విమ్స్ డైరెక్టర్‌ను కలిసి విషయం చెప్పాడు. ఇక్కడ ఎలాంటి ఉద్యోగాలూ లేవని, ఎవరో తప్పుదోవ పట్టించారని ఆయన స్పష్టం చేశారు. తాను మోసపోయానని బాధితుడు గ్రహించి, పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితులలో ఇద్దరిని పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. మరో నిందితుడు రంగ్లానాయక్ను అరెస్టు చేయాల్సి ఉందని ఎస్ఐ తెలియజేశారు. అరెస్టు చేసిన వారిని కదిరి కోర్టుకు హాజరు పరచగా, న్యాయమూర్తి వారికి రిమాండ్ విధించారు. -
ఇంటర్ విద్యార్థిని అదృశ్యం
తనకల్లు (కదిరి) : మండల కేంద్రమైన తనకల్లులోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ చదువుతున్న షాజిదా ఈ నెల 17వ తేదీ నుంచి కనిపించడం లేదు. ఎన్ని చోట్ల వెతికినా ఆచూకీ కానరాకపోవడంతో తండ్రి బాషా బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ శ్రీనివాసులు తెలిపారు. -
ఉష్ణోగ్రతలు తగ్గుముఖం
– అగళి 9.4 డిగ్రీలు, తనకల్లు 9.8 డిగ్రీలు కనిష్టం అనంతపురం అగ్రికల్చర్ : గత నాలుగైదు రోజులుగా జిల్లాలో పగలూ, రాత్రి ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి. చాలా మండలాల్లో చలి తీవ్రత ఇంకా కొనసాగుతోంది. కొన్ని ప్రాంతాల్లో మధ్యాహ్న సమయంలో ఎండలు కనిపిస్తున్నాయి. శుక్రవారం నమోదైన వివరాల ప్రకారం అగళి 9.4 డిగ్రీలు, తనకల్లు 9.8 డిగ్రీల కనిష్టం నమోదు కాగా మడకశిర 10.3 డిగ్రీలు, రొద్దం 11.8 డిగ్రీలు, నల్లమాడ 12.5 డిగ్రీలు, కనగానపల్లి, చిలమత్తూరు 12.6 డిగ్రీలు, హిందూపురం, గాండ్లపెంట, ఎన్పీ కుంట 12.7 డిగ్రీలు ఉష్ణోగ్రత నమోదైంది. మిగతా మండలాల్లో 13 నుంచి 18 డిగ్రీల వరకు కొనసాగింది. పామిడిలో 36.7 డిగ్రీలు గరిష్టం నమోదు కాగా తక్కిన మండలాల్లో 30 నుంచి 34 డిగ్రీల మధ్య నమోదైంది. గాలిలో తేమశాతం ఉదయం 55 నుంచి 80, మధ్యాహ్నం 20 నుంచి 30 శాతం మధ్య రికార్డయింది. గాలులు గంటకు 7 నుంచి 14 కిలో మీటర్ల వేగంతో వీచాయి. కొన్ని మండలాల్లో గాలివేగం అధికంగా ఉంది. రాగల నాలుగు రోజుల్లో 33 నుంచి 34 డిగ్రీల గరిష్టం, 17 నుంచి 18 డిగ్రీల మేర కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదుకావచ్చని రేకులకుంట వ్యవసాయ పరిశోధనా విభాగం శాస్త్రవేత్తలు డాక్టర్ బి.రవీంద్రనాథరెడ్డి, డాక్టర్ బి.సహదేవరెడ్డి తెలిపారు. -
తనకల్లులో 9.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు
అనంతపురం అగ్రికల్చర్ : జిల్లాలో కొన్ని మండలాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు కాగా, మరికొన్ని మండలాల్లో పగటి ఉష్ణోగ్రతలు పెరిగాయి. శుక్రవారం నమోదైన ఉష్ణోగ్రతల మేరకు తనకల్లు మండలంలో కేవలం 9.5 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. అగళిలో 9.7 డిగ్రీలు, మడకశిర 10.1 , సోమందేపల్లి 11.4 , రొద్దం 11.7 , ఎన్పీ కుంట 12.1 , నల్లమాడ 12.2 , నల్లచెరువు 12.6 , అమరాపురం 12.8 , గాండ్లపెంట, పుట్లూరులో 12.9 డిగ్రీలు నమోదు కావడంతో చలితీవ్రత కొనసాగింది. మిగతా మండలాల్లో 13 నుంచి 19 డిగ్రీల వరకు కొనసాగాయి. అత్యధిక పగటి ఉష్ణోగ్రత పామిడిలో 37.7 డిగ్రీలు నమోదైంది. గుంతకల్లు, తాడిపత్రి, శింగనమలలో కూడా 36 డిగ్రీలకు పైబడి కొనసాగింది. మిగతా మండలాల్లో పగటి ఉష్ణోగ్రతలు 31 నుంచి 35 డిగ్రీల మధ్య నమోదయ్యాయి. -
తనకల్లులో 10.9 డిగ్రీలు కనిష్టం
అనంతపురం అగ్రికల్చర్ : కొన్ని మండలాల్లో రాత్రిళ్లు చలి వాతావరణం కొనసాగుతుండగా మరికొన్ని ప్రాంతాల్లో మధ్యాహ్న సమయంలో ఎండతీవ్రత పెరుగుతోంది. మంగళవారం తనకల్లులో 10.9 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదు కాగా అగళి 11.3 డిగ్రీలు, మడకశిర 11.5 డిగ్రీలు, రొద్దం 12.4 డిగ్రీలు, నల్లమాడ 12.5 డిగ్రీలు, సోమందేపల్లి 12.6 డిగ్రీలు, లేపాక్షి 12.8 డిగ్రీలు, కొత్తచెరువు, ఎన్పీకుంట 13.8 డిగ్రీలు కొనసాగగా మిగతా మండలాల్లో 14 నుంచి 19 డిగ్రీలు నమోదయ్యాయి. పగటి ఉష్ణోగ్రతలు జిల్లా అంతటా 32 నుంచి 35 డిగ్రీలు నమోదయ్యాయి. -
తనకల్లులో 11.4 డిగ్రీలు కనిష్టం
అనంతపురం అగ్రికల్చర్ : జిల్లాలో వారం రోజులుగా పగలు ఎండ, రాత్రి చలి వాతావరణం కొనసాగుతోంది. శనివారం తనకల్లులో 11.4 డిగ్రీలు, అగళి 11.9 డిగ్రీలు, మడకశిర 12.4 డిగ్రీలు, రొద్దం 12.9 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు కాగా మిగతా మండలాల్లో 13 నుంచి 18 డిగ్రీల వరకు కొనసాగాయి. పగటి ఉష్ణోగ్రతలు 30 నుంచి 33 డిగ్రీల మధ్య ఉన్నాయి.