సైబర్‌ క్రైమ్‌కు చెక్‌...! | Check to Cybercrime | Sakshi
Sakshi News home page

సైబర్‌ క్రైమ్‌కు చెక్‌...!

Published Wed, Feb 15 2017 10:47 PM | Last Updated on Tue, Sep 5 2017 3:48 AM

సైబర్‌ క్రైమ్‌కు చెక్‌...!

సైబర్‌ క్రైమ్‌కు చెక్‌...!

సాక్షి, అమరావతి బ్యూరో : అవిభక్త ఆంధ్రప్రదేశ్‌లో సైబర్‌ నేరాల అడ్డుకట్టకు ప్రధాన కేంద్రం హైదరాబాద్‌లో ఉండేది. విభజన అనంతరం మన రాష్ట్రంలో సైబర్‌పోలీస్‌ స్టేషన్‌ లేకుండాపోయింది. మరోవైపు రాష్ట్రంలో సైబర్‌ నేరాలు అంతకంతకు అధికమవసాగాయి. విజయవాడ కేంద్రంగా వైట్‌ కాలర్‌ నేరాలు అందులోనూ సైబర్‌నేరాలు పెచ్చుమీరుతుండటం ఆందోళనకరంగా మారింది. అయినా సైబర్‌ నేరాల కట్టడికి రాష్ట్రంలో సరైన వ్యవస్థ లేకుండాపోయింది. అన్నింటికీ హైదరాబాద్‌పై ఆధారపడాల్సిన పరిస్థితి నెలకొంది. సైబర్‌ నేరాల దర్యాప్తులో తీవ్రజాప్యం నేరస్తులకు అవకాశంగా మారుతోంది. దాంతో రాష్ట్రంలో ప్రత్యేకంగా సైబర్‌ పోలీసింగ్‌ వ్యవస్థను దశలవారీగా ఏర్పాటు చేయాలని ఉన్నతాధికారులు నిర్ణయించారు.

సైబర్‌ సెల్‌ నుంచి పోలీస్‌ స్టేషన్‌..
మొదటి దశగా విజయవాడ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో గత ఏడాది ప్రత్యేకంగా సైబర్‌ సెల్‌ను ఏర్పాటు చేశారు. ఓ సీఐ, ఓ ఎస్సైతోపాటు ఏడుగురు కానిస్టేబుళ్లను కేటాయించారు. సైబర్‌ నేరాల కట్టడి, దర్యాప్తుపై ఈఎస్‌ఎఫ్‌ ల్యాబ్స్‌ అనే సంస్థతో వారికి శిక్షణ ఇప్పించారు. ఈ సెల్‌ ఈ ఏడాదిలో కొన్ని సైబర్‌ నేరాలను విజయవంతంగా ఛేదించింది. ప్రధానంగా వీడియోలు తీసి, చాటింగుల ముసుగులో యువతులను వేధిస్తున్న కొన్ని కేసులను సకాలంలో పరిష్కరించారు. కానీ పెరుగుతున్న సైబర్‌ నేరాల కట్టడికి ఈ సెల్‌ సామర్థ్యం సరిపోవడం లేదు. దాంతో రెండోదశలో భాగంగా ఆ సెల్‌ను  పూర్తిస్థాయి సైబర్‌ పోలీస్‌ స్టేషన్‌గా తీర్చిదిద్దాలని ఉన్నతాధికారులు భావించారు.

అందుకు మొదటగా విజయవాడలో సైబర్‌పోలీస్‌ స్టేషన్‌ను ఏర్పాటు చేయాలని సీపీ గౌతమ్‌ సవాంగ్‌ యోచించారు. దాంతో సైబర్‌ సెల్‌ స్థాయి పెంచి పోలీస్‌ స్టేషన్‌గా తీర్చిదిద్దాలని నిర్ణయించారు. అందుకు ఆమోదం లభించడంతో పోలీస్‌స్టేషన్‌ ఏర్పాటు దిశగా చర్యలు వేగవంతం చేశారు.

ఈ నెలాఖరుకు పనులు పూర్తి..
కమిషనరేట్‌ సమీపంలో ఉన్న ఓ కార్యాలయాన్ని సైబర్‌ పోలీస్‌స్టేషన్‌ కోసం ఎంపిక చేశారు. అందుకు అనుగుణంగా ఆ కార్యాలయాన్ని తీర్చిదిద్దుతున్నారు. ఈ నెలాఖరుకు పనులు పూర్తి చేసి సైబర్‌ పోలీస్‌ స్టేషన్‌ను ప్రారంభానికి సిద్ధం చేయాలని భావిస్తున్నారు. మరోవైపు సైబర్‌ పోలీస్‌ స్టేషన్‌కు సిబ్బందిని కూడా ప్రభుత్వం ఖరారు చేసింది. ఓ ఏసీపీ స్థాయి అధికారి సైబర్‌పోలీస్‌ స్టేషన్‌కు ఇన్‌చార్జిగా ఉంటారు. దాంతోపాటు  ఇద్దరు సీఐలు, ఐదుగురు ఎస్సైలు, దాదాపు 30 మంది కానిస్టేబుళ్ల పోస్టులను కేటాయించారు. త్వరలోనే ఈ పోస్టులను ప్రభుత్వం భర్తీ చేయనుంది. వచ్చే నెల మొదటివారంలో సైబర్‌ పోలీస్‌స్టేషన్‌ను ప్రారంభించాలని భావిస్తున్నారు.

సైబర్‌ పోలీసింగ్‌ వ్యవస్థ ....
ఇక తదుపరి దశలో విజయవాడ కేంద్రంగా ప్రత్యేక సైబర్‌ పోలీసింగ్‌ వ్యవస్థను నెలకొల్పాలని భావిస్తున్నారు. అందుకోసం ఇప్పటికే అన్ని జిల్లాల్లో ఎంపిక చేసిన పోలీసు అధికారులు, కానిస్టేబుళ్లకు సైబర్‌ నేరాల దర్యాప్తులో శిక్షణ ఇస్తున్నారు. వచ్చే నెలలో విజయవాడలో ప్రారంభించనున్న సైబర్‌ పోలీస్‌స్టేషన్‌ నుంచి అన్ని జిల్లాలను అనుసంధానం చేస్తారు. ఇతర జిల్లాల్లోని సైబర్‌ నేరాల దర్యాప్తును కూడా ఇదే పోలీస్‌ స్టేషన్‌ నుంచి పర్యవేక్షిస్తారు. ఏడాది తరువాత విజయవాడలోనే పూర్తిస్థాయి సైబర్‌ పోలీసింగ్‌ వ్యవస్థను ఏర్పాటు చేస్తారు. అప్పుడు సీనియర్‌ ఐపీఎస్‌ అధికారితోపాటు పెద్దసంఖ్యలో డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలు, కానిస్టేబుళ్లలు కలిపి దాదాపు 200మంది సిబ్బందిని కేటాయించాలని భావిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement