CP Gautam savang
-
75 రోజులు ఓపిక పట్టండి..
భవానీపురం (విజయవాడ వెస్ట్) : కనకదుర్గ ఫ్లై ఓవర్ నిర్మాణ పనుల సందర్భంగా ఏర్పడిన ట్రాఫిక్ ఇబ్బందుల నుంచి బయటపడేందుకు మరో 75 రోజులు ఓపిక పట్టాలని, ఆ తర్వాత ఈ తంటాలు ఉండవని నగర పోలీస్ కమిషనర్ గౌతమ్ సవాంగ్ అన్నారు. కనకదుర్గ ఫ్లై ఓవర్ నిర్మాణ పనులను, ట్రాఫిక్ మళ్లింపులను ఆయన ఆదివారం సాయంత్రం పరిశీలించారు. విద్యాధరపురం కుమ్మరిపాలెం సెంటర్ నుంచి హెడ్ వాటర్ వర్క్స్ వరకు కాలినడకన సందర్శించి సోమా కంపెనీ ప్రతినిధులు, ఆర్అండ్బీ అధికారులతో కలిసి చర్చించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ట్రాఫిక్ సమస్యతో ప్రజలు అసౌకర్యానికి గురవుతున్నప్పటికీ ఫ్లై ఓవర్ నిర్మాణం దృష్ట్యా ఓపికపట్టి సహకరించాలని కోరారు. వాహనదారులు ఇబ్బందులు పడకుండా పనులు జరుగుతున్న ప్రదేశాలను మినహాయించి, మిగిలినచోట్ల రాకపోకలు జరిగేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న మాట్లాడుతూ ఫ్లై ఓవర్ నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నమాట వాస్తవమేనన్నారు. అయితే దేశంలోనే ఎక్కడా లేని విధంగా చేపట్టిన ఈ ఫ్లై ఓవర్ నిర్మాణంలో సాంకేతిక ఇబ్బందుల కారణంగానే ఆలస్యం అవుతోందని చెప్పారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కమిషనర్ బీవీ రమణకుమార్, డీసీపీ టీకే రాణా, ట్రాఫిక్ ఏడీసీపీ నాగరాజు, సోమా కంపెనీ జీఎం చౌదరి, ఆర్అండ్బీ ఇంజినీర్ జాన్‌మోషే, టీడీపీ ఫ్లోర్ లీడర్ జి. హరిబాబు, కార్పొరేటర్ వి. హరనాధస్వామి పాల్గొన్నారు. -
పోలీసింగ్.. @ టెక్నాలజీ
నిఘా మరింత పటిష్టం.. కమిషనరేట్ పరిధిలో నిఘా వ్యవస్థను మరింత పటిష్ట పరచాలని సీపీ గౌతం సవాంగ్ నిర్ణయించారు. ఇప్పటికే నగరంలోని ప్రధాన కూడళ్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. పెరుగుతున్న జనాభా, నేరాల తీవ్రత దృష్ట్యా కొత్తగా 2వేల సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. నగరంలోని ప్రధాన కూడళ్లను అనుసంధానించే రోడ్లు, విద్యాసంస్థలున్న ప్రాంతాలు, కాలనీలు, నగర శివారుప్రాంతాల్లో వీటిని ఏర్పాటు చేస్తారు. సాక్షి, అమరావతి బ్యూరో : భద్రత, నేరాల నియంత్రణకు నగర పోలీసు వ్యవస్థ ఆధునిక సాంకేతికతను మరింతగా అందిపుచ్చుకోనుంది. ప్రపంచస్థాయి ప్రమాణాలతో పోలీసింగ్‌ను పటిష్ట పరచాలని నిర్ణయించారు. విజయవాడ నగర పోలీస్ కమిషనర్ గౌతం సవాంగ్ యూకేలో వారంరోజుల పర్యటనలో ఆధునిక పోలీసింగ్‌పై నిర్వహించిన సదస్సులో పాల్గొన్నారు. హ్యాంప్‌షైర్‌లో నిర్వహించిన ‘యూకే సెక్యూరిటీ – పోలీసింగ్ ఎగ్జిబిషన్ 2017’కు హాజరయ్యారు. లండన్‌లోని పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా అభివృద్ధి చెందిన దేశాలు నేర పరిశోధనకు ఉపయోగిస్తున్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని పరిశీలించారు. ఆ పరిజ్ఞానాన్ని మన అవసరాలకు ఎలా మలచుకోవాలనే దానిపై పలువురు నిపుణులతో చర్చించారు. ఈ మేరకు విజయవాడ కమిషరేట్ పరిధిలో అమలు చేయనున్న ప్రతిపాదనలను ‘సాక్షి’కి ప్రత్యేకంగా వెల్లడించారు. ప్రధానంగా విజయవాడలోని కమాండ్ కంట్రోల్ సెంటర్ స్థాయిని మరింతంగా పెంచడంతోపాటు నగరంలో నిఘాను పటిష్ట పరచాలని నిర్ణయించారు. సమాచార విశ్లేషణ వ్యవస్థ సమాచార విశ్లేషణ, నేర పరిశోధన దిశగా కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను తీర్చిదిద్దుతారు. ఇప్పటికే ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కమాండ్ కంట్రోల్‌ను ఏర్పాటు చేశారు. రెండో దశలో ప్రపంచస్థాయి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించాలని పోలీస్ కమిషనర్ గౌతం సవాంగ్ నిర్ణయించారు. సమాచార విశ్లేషణ, నేర పరిశోధన అనే రెండు విభాగాలుగా కమాండ్ కంట్రోల్‌ను తీర్చిదిద్దాలని నిర్ణయించారు. లండన్‌లో దాదాపు లక్ష కెమెరాలతో సేకరించిన సమాచారాన్ని విశ్లేషించే వ్యవస్థ ఉంది. ఆ స్థాయిలో కాకపోయినా కమిషనరేట్ పరిధిలోని వివిధ మాధ్యమాల ద్వారా సేకరించిన సమాచారాన్ని విశ్లేషించే వ్యవస్థను నెలకొల్పనున్నారు. ఆధునిక నెట్వర్క్ వ్యవస్థ ఏర్పాటు, నగరాన్ని గ్రిడ్లుగా విభజన, సమన్వయం ఇందులో ప్రధానమైనవి. అసాంఘిక శక్తుల కట్టడి ... నేర పరిశోధనకు ఉపకరించే రీతిలో కమాండ్ కంట్రోల్స్థాయిని పెంచనున్నారు. కమాండ్ కంట్రోల్లో ‘ఫేసియల్ రికగ్నైజేషన్’ వ్యవస్థను ఏర్పాటు చేస్తారు. రాజధానిగా రూపాంతరం చెందిన తరువాత నగరానికి రాకపోకల తాకిడి పెరిగింది. నిత్యం వేలమంది కొత్త వ్యక్తులు వస్తున్నారు. ఈ నేపథ్యంలో అనుమానాస్పద వ్యక్తులపై ఓ కన్నేసి ఉంచాల్సిన అవసరం ఉందని గుర్తించారు. అందుకోసం ‘ఫేసియల్ రికగ్నైజేషన్’ పరిజ్ఞానాన్ని జోడించాలని నిర్ణయించారు. నగరంలోని సీసీ టీవీ ఫుటేజీల ద్వారా సంబంధిత వ్యక్తులు, వాహనాలను గుర్తించి డేటాను భద్రపరుస్తారు. ఆ వ్యక్తుల నేర చరిత్ర, ఇతర అంశాలన్నీ క్షణాల్లో విశ్లేషించి పోలీసులకు అందించగలదు. తద్వారా అసాంఘిక శక్తులపై గట్టి నిఘా పెట్టడం సాధ్యపడుతుంది. అంతే కాకుండా వాహనాల వేగం, నిర్ణీత ప్రదేశాల మధ్య ఎన్నిసార్లు తిరిగింది, గతంలో ఎన్నిసార్లు జరిమానాలు విధించారు అనే వివరాలను కూడా క్షణాల్లో తెలుసుకోవడం సాధ్యపడుతుంది. వాహనాల నెంబర్ ప్లేట్ ఆధారంగా మొత్తం సమాచారం అందుబాటులోకి వచ్చే వ్యవస్థను ఏర్పాటు చేస్తారు. కమాండ్ కంట్రోల్‌కు అనుసంధానంగా వివిధ పోలీసు బృందాలను ఏర్పాటు చేస్తారు. ఫోన్ కాల్ వచ్చిన వెంటనే సంబంధిత బృందాలు స్పందించి సంఘటనాస్థలానికి చేరుకోగలుగుతాయి. -
సైబర్ క్రైమ్‌కు చెక్...!
సాక్షి, అమరావతి బ్యూరో : అవిభక్త ఆంధ్రప్రదేశ్‌లో సైబర్ నేరాల అడ్డుకట్టకు ప్రధాన కేంద్రం హైదరాబాద్‌లో ఉండేది. విభజన అనంతరం మన రాష్ట్రంలో సైబర్‌పోలీస్ స్టేషన్ లేకుండాపోయింది. మరోవైపు రాష్ట్రంలో సైబర్ నేరాలు అంతకంతకు అధికమవసాగాయి. విజయవాడ కేంద్రంగా వైట్ కాలర్ నేరాలు అందులోనూ సైబర్‌నేరాలు పెచ్చుమీరుతుండటం ఆందోళనకరంగా మారింది. అయినా సైబర్ నేరాల కట్టడికి రాష్ట్రంలో సరైన వ్యవస్థ లేకుండాపోయింది. అన్నింటికీ హైదరాబాద్‌పై ఆధారపడాల్సిన పరిస్థితి నెలకొంది. సైబర్ నేరాల దర్యాప్తులో తీవ్రజాప్యం నేరస్తులకు అవకాశంగా మారుతోంది. దాంతో రాష్ట్రంలో ప్రత్యేకంగా సైబర్ పోలీసింగ్ వ్యవస్థను దశలవారీగా ఏర్పాటు చేయాలని ఉన్నతాధికారులు నిర్ణయించారు. సైబర్ సెల్ నుంచి పోలీస్ స్టేషన్.. మొదటి దశగా విజయవాడ పోలీస్ కమిషనరేట్ పరిధిలో గత ఏడాది ప్రత్యేకంగా సైబర్ సెల్‌ను ఏర్పాటు చేశారు. ఓ సీఐ, ఓ ఎస్సైతోపాటు ఏడుగురు కానిస్టేబుళ్లను కేటాయించారు. సైబర్ నేరాల కట్టడి, దర్యాప్తుపై ఈఎస్ఎఫ్ ల్యాబ్స్ అనే సంస్థతో వారికి శిక్షణ ఇప్పించారు. ఈ సెల్ ఈ ఏడాదిలో కొన్ని సైబర్ నేరాలను విజయవంతంగా ఛేదించింది. ప్రధానంగా వీడియోలు తీసి, చాటింగుల ముసుగులో యువతులను వేధిస్తున్న కొన్ని కేసులను సకాలంలో పరిష్కరించారు. కానీ పెరుగుతున్న సైబర్ నేరాల కట్టడికి ఈ సెల్ సామర్థ్యం సరిపోవడం లేదు. దాంతో రెండోదశలో భాగంగా ఆ సెల్‌ను పూర్తిస్థాయి సైబర్ పోలీస్ స్టేషన్‌గా తీర్చిదిద్దాలని ఉన్నతాధికారులు భావించారు. అందుకు మొదటగా విజయవాడలో సైబర్‌పోలీస్ స్టేషన్‌ను ఏర్పాటు చేయాలని సీపీ గౌతమ్ సవాంగ్ యోచించారు. దాంతో సైబర్ సెల్ స్థాయి పెంచి పోలీస్ స్టేషన్‌గా తీర్చిదిద్దాలని నిర్ణయించారు. అందుకు ఆమోదం లభించడంతో పోలీస్‌స్టేషన్ ఏర్పాటు దిశగా చర్యలు వేగవంతం చేశారు. ఈ నెలాఖరుకు పనులు పూర్తి.. కమిషనరేట్ సమీపంలో ఉన్న ఓ కార్యాలయాన్ని సైబర్ పోలీస్‌స్టేషన్ కోసం ఎంపిక చేశారు. అందుకు అనుగుణంగా ఆ కార్యాలయాన్ని తీర్చిదిద్దుతున్నారు. ఈ నెలాఖరుకు పనులు పూర్తి చేసి సైబర్ పోలీస్ స్టేషన్‌ను ప్రారంభానికి సిద్ధం చేయాలని భావిస్తున్నారు. మరోవైపు సైబర్ పోలీస్ స్టేషన్‌కు సిబ్బందిని కూడా ప్రభుత్వం ఖరారు చేసింది. ఓ ఏసీపీ స్థాయి అధికారి సైబర్‌పోలీస్ స్టేషన్‌కు ఇన్చార్జిగా ఉంటారు. దాంతోపాటు ఇద్దరు సీఐలు, ఐదుగురు ఎస్సైలు, దాదాపు 30 మంది కానిస్టేబుళ్ల పోస్టులను కేటాయించారు. త్వరలోనే ఈ పోస్టులను ప్రభుత్వం భర్తీ చేయనుంది. వచ్చే నెల మొదటివారంలో సైబర్ పోలీస్‌స్టేషన్‌ను ప్రారంభించాలని భావిస్తున్నారు. సైబర్ పోలీసింగ్ వ్యవస్థ .... ఇక తదుపరి దశలో విజయవాడ కేంద్రంగా ప్రత్యేక సైబర్ పోలీసింగ్ వ్యవస్థను నెలకొల్పాలని భావిస్తున్నారు. అందుకోసం ఇప్పటికే అన్ని జిల్లాల్లో ఎంపిక చేసిన పోలీసు అధికారులు, కానిస్టేబుళ్లకు సైబర్ నేరాల దర్యాప్తులో శిక్షణ ఇస్తున్నారు. వచ్చే నెలలో విజయవాడలో ప్రారంభించనున్న సైబర్ పోలీస్‌స్టేషన్ నుంచి అన్ని జిల్లాలను అనుసంధానం చేస్తారు. ఇతర జిల్లాల్లోని సైబర్ నేరాల దర్యాప్తును కూడా ఇదే పోలీస్ స్టేషన్ నుంచి పర్యవేక్షిస్తారు. ఏడాది తరువాత విజయవాడలోనే పూర్తిస్థాయి సైబర్ పోలీసింగ్ వ్యవస్థను ఏర్పాటు చేస్తారు. అప్పుడు సీనియర్ ఐపీఎస్ అధికారితోపాటు పెద్దసంఖ్యలో డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలు, కానిస్టేబుళ్లలు కలిపి దాదాపు 200మంది సిబ్బందిని కేటాయించాలని భావిస్తున్నారు. -
పుష్కర భక్తులకు సేవ చేయండి
విజయవాడ (ఆటోనగర్): పుష్కర భక్తులకు అసౌకర్యం కలుగకుండా పుష్కర సేవక్‌లుగా(వాలంటీర్లు) ప్రైవేటు స్కూళ్ళ ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు తమ వంతు సేవలందించాలని విజయవాడ నగర పోలీస్ కమిషనర్ డి.గౌతం సవాంగ్ కోరారు. ఆదివారం ఎన్ఏసీ కళ్యాణ మండపంలో విజయవాడ చిల్డ్రన్స్ స్కూల్స్ అండ్ ట్యూటోరియల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశానికి జిల్లాలోని 350 స్కూళ్ల నుంచి 1500మంది ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు హాజరయ్యారు. ముఖ్య అతిథిగా హాజరైన సవాంగ్ ప్రసంగిస్తూ పుష్కరాలు చాలా కాలానికి వచ్చే ముఖ్యమైన పవిత్ర రోజులని, పోటెత్తే భక్తులకు సహకారం అందించటం మన ప్రధానమైన కార్యచరణ అని అన్నారు. క్లాక్ రూమ్స్, క్యూలైన్లు, సమాచార కేంద్రంలో స్వచ్ఛంద సేవలు అందించాలని సూచించారు. ఈ సేవకు గుర్తుగా వాలంటీర్లకు సర్టిఫికేట్లను జారీ చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ఛైర్మన్ సాయికృష్ణ, మోహన్‌రెడ్డి, అధ్యక్షులు సరళ, కార్యదర్శి సుధాకర్‌లు మాట్లాడుతూ తాము పుష్కరాల 12 రోజుల్లో తాము 4 రోజులపాటు వాలంటీర్లుగా సహకారాన్ని అందిస్తామని తెలిపారు. వాలంటీర్లకు క్యాప్, పుష్కర ఐడీ కార్డు, ఫ్లోర్‌సెంట్ జాకెట్ ఇస్తామని డీసీపీ ప్రవీణ్ కుమార్ అన్నారు. -
ఉత్తేజం.. ప్రసంగం..
-
‘ఆవుల’ బెయిల్ వ్యవహారంపై సీపీ సీరియస్!
సిబ్బందిపై చర్యలకు యోచన మూడు గంటల పాటు ఫణిని విచారించిన ఏసీపీ విజయవాడ సిటీ : కల్తీ నెయ్యి కేసులో కీలక నిందితులు ముందస్తు బెయిల్ పొందడాన్ని సీపీ గౌతమ్ సవాంగ్ తీవ్రంగా పరిగణిస్తున్నట్లు తెలిసింది. కీలక నిందితుడు ఆవుల ఫణీంద్ర హైకోర్టు నుంచి, మరో కీలక నిందితుడు అనిల్‌కుమార్ అంతకు నెలరోజుల ముందే ముందస్తు బెయిల్ పొందటాన్ని ఆయన జీర్ణించుకోలేకపోతున్నారు. ఫుడ్ ఇన్స్పెక్టర్ల మొక్కుబడి కేసుల వల్లే ఫణీంద్ర కల్తీ వ్యాపారం జోరుగా సాగుతోందని గుర్తించిన సీపీ.. క్రిమినల్ కేసులతో కల్తీ నెయ్యి దందాకు చెక్ పెట్టాలని భావించారు. అయినా ఆయన దృష్టికి రాకుండానే నిందితులకు బెయిల్ రావటాన్ని తీవ్రంగా పరిగణించినట్టు తెలుస్తోంది. దీనిపై సమగ్ర విచారణకు ఆదేశించిన పోలీసు కమిషనర్ అవసరమైతే కొందరు పోలీసులపై వేటు వేయాలని నిర్ణయించినట్టు సమాచారం. డీసీపీ ఆరా... నిందితుల ముందస్తు బెయిల్ వ్యవహారంపై డీసీపీ ఎల్.కాళిదాసు విచారణ జరిపినట్టు తెలిసింది. మంగళవారం సెంట్రల్ జోన్ ఏసీపీ ప్రభాకర బాబు, పటమట ఇన్స్పెక్టర్ కెనడీ, స్టేషన్ రైటర్‌తో పాటు కొందరు కానిస్టేబుళ్లను తన చాంబర్‌కు పిలిపించుకొని వివరాలు సేకరించారు. కల్తీ నెయ్యి కేసుకు సంబంధించి గతంలో వచ్చిన ఆరోపణలను దృష్టిలో ఉంచుకొని సీపీ సెంట్రల్ ఏసీపీకి విచారణ బాధ్యతలు అప్పగించారు. అయినా నిందితులకు అనుకూలంగా పోలీసు వ్యవహారాలు నడిచినట్టు సీపీ భావిస్తున్నట్టు సమాచారం. బెయిల్‌కు వ్యతిరేకంగా కౌంటర్ దాఖలు, ఆయా అధికారులు, సిబ్బంది నిర్వహించిన పాత్ర వంటి అంశాలను కాళిదాస్ అడిగి తెలుసుకొని నివేదిక తయారు చేసినట్టు సమాచారం. ఆయన నివేదిక ఆధారంగా కొందరిపై వేటు ఉండొచ్చని తెలుస్తోంది. విచారణకు ఫణి హైకోర్టు నుంచి బెయిల్ పొందిన ఆవుల ఫణీంద్రను మంగళవారం మధ్యాహ్నం మూడు గంటల పాటు సెంట్రల్ ఏసీపీ ప్రభాకర బాబు విచారించారు. లబ్బీపేట సెంట్రల్ జోన్ కార్యాలయానికి ఫణిని పిలిపించి బెయిల్ ఎలా వచ్చిందనే విషయాలపై ఆరా తీసినట్టు తెలుస్తోంది. గతంలో ఆయన చేసిన కల్తీ నెయ్యి వ్యాపారంతో పాటు ఇతర ఆరోపణలపై కూడా ఏసీపీ వివరాలు సేకరించారు. ఉన్నతాధికారుల ఆదేశాలకు అనుగుణంగా తదుపరి చర్యలకు యోచిస్తున్నారు. ఆ కానిస్టేబుల్ పాత్ర ఏమిటి! ఆవుల ఫణీంద్ర బంధువుగా చెప్పుకొంటున్న ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ పాత్రపై కూడా నిఘా వర్గాలు ఆరా తీస్తున్నాయి. గత రెండు రోజులుగా విధులకు సైతం డుమ్మా కొట్టి ఫణీంద్ర వెనుక ఆయన తిరుగుతున్నాడు. గతంలో ఫణీంద్ర పరారీ సమయంలో పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకొని విచారించారు. ఆ సమయంలో అతను భారీ డీల్ కుదుర్చుకొని బయటపడినట్టు ఆరోపణలు ఉన్నాయి. తిరిగి ఫణీంద్ర బెయిల్‌పై వచ్చిన తర్వాత కూడా కీలక పాత్ర పోషించడాన్ని బట్టి కల్తీ వ్యాపారాల్లో ఆయన పాత్రను కూడా నిర్ధారించుకోవాలని పోలీసు అధికారులు భావిస్తున్నట్టు తెలిసింది.