సిబ్బందిపై చర్యలకు యోచన
మూడు గంటల పాటు ఫణిని విచారించిన ఏసీపీ
విజయవాడ సిటీ : కల్తీ నెయ్యి కేసులో కీలక నిందితులు ముందస్తు బెయిల్ పొందడాన్ని సీపీ గౌతమ్ సవాంగ్ తీవ్రంగా పరిగణిస్తున్నట్లు తెలిసింది. కీలక నిందితుడు ఆవుల ఫణీంద్ర హైకోర్టు నుంచి, మరో కీలక నిందితుడు అనిల్‌కుమార్ అంతకు నెలరోజుల ముందే ముందస్తు బెయిల్ పొందటాన్ని ఆయన జీర్ణించుకోలేకపోతున్నారు. ఫుడ్ ఇన్‌స్పెక్టర్ల మొక్కుబడి కేసుల వల్లే ఫణీంద్ర కల్తీ వ్యాపారం జోరుగా సాగుతోందని గుర్తించిన సీపీ.. క్రిమినల్ కేసులతో కల్తీ నెయ్యి దందాకు చెక్ పెట్టాలని భావించారు. అయినా ఆయన దృష్టికి రాకుండానే నిందితులకు బెయిల్ రావటాన్ని తీవ్రంగా పరిగణించినట్టు తెలుస్తోంది. దీనిపై సమగ్ర విచారణకు ఆదేశించిన పోలీసు కమిషనర్ అవసరమైతే కొందరు పోలీసులపై వేటు వేయాలని నిర్ణయించినట్టు సమాచారం.
డీసీపీ ఆరా...
నిందితుల ముందస్తు బెయిల్ వ్యవహారంపై డీసీపీ ఎల్.కాళిదాసు విచారణ జరిపినట్టు తెలిసింది. మంగళవారం సెంట్రల్ జోన్ ఏసీపీ ప్రభాకర బాబు, పటమట ఇన్‌స్పెక్టర్ కెనడీ, స్టేషన్ రైటర్‌తో పాటు కొందరు కానిస్టేబుళ్లను తన చాంబర్‌కు పిలిపించుకొని వివరాలు సేకరించారు. కల్తీ నెయ్యి కేసుకు సంబంధించి గతంలో వచ్చిన ఆరోపణలను దృష్టిలో ఉంచుకొని సీపీ సెంట్రల్ ఏసీపీకి విచారణ బాధ్యతలు అప్పగించారు. అయినా నిందితులకు అనుకూలంగా పోలీసు వ్యవహారాలు నడిచినట్టు సీపీ భావిస్తున్నట్టు సమాచారం. బెయిల్‌కు వ్యతిరేకంగా కౌంటర్ దాఖలు, ఆయా అధికారులు, సిబ్బంది నిర్వహించిన పాత్ర వంటి అంశాలను కాళిదాస్ అడిగి తెలుసుకొని నివేదిక తయారు చేసినట్టు సమాచారం. ఆయన నివేదిక ఆధారంగా కొందరిపై వేటు ఉండొచ్చని తెలుస్తోంది.
విచారణకు ఫణి
హైకోర్టు నుంచి బెయిల్ పొందిన ఆవుల ఫణీంద్రను మంగళవారం మధ్యాహ్నం మూడు గంటల పాటు సెంట్రల్ ఏసీపీ ప్రభాకర బాబు విచారించారు. లబ్బీపేట సెంట్రల్ జోన్ కార్యాలయానికి ఫణిని పిలిపించి బెయిల్ ఎలా వచ్చిందనే విషయాలపై ఆరా తీసినట్టు తెలుస్తోంది. గతంలో ఆయన చేసిన కల్తీ నెయ్యి వ్యాపారంతో పాటు ఇతర ఆరోపణలపై కూడా ఏసీపీ వివరాలు సేకరించారు. ఉన్నతాధికారుల ఆదేశాలకు అనుగుణంగా తదుపరి చర్యలకు యోచిస్తున్నారు.
ఆ కానిస్టేబుల్ పాత్ర ఏమిటి!
ఆవుల ఫణీంద్ర బంధువుగా చెప్పుకొంటున్న ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ పాత్రపై కూడా నిఘా వర్గాలు ఆరా తీస్తున్నాయి. గత రెండు రోజులుగా విధులకు సైతం డుమ్మా కొట్టి ఫణీంద్ర వెనుక ఆయన తిరుగుతున్నాడు. గతంలో ఫణీంద్ర పరారీ సమయంలో పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకొని విచారించారు. ఆ సమయంలో అతను భారీ డీల్ కుదుర్చుకొని బయటపడినట్టు ఆరోపణలు ఉన్నాయి. తిరిగి ఫణీంద్ర బెయిల్‌పై వచ్చిన తర్వాత కూడా కీలక పాత్ర పోషించడాన్ని బట్టి కల్తీ వ్యాపారాల్లో ఆయన పాత్రను కూడా నిర్ధారించుకోవాలని పోలీసు అధికారులు భావిస్తున్నట్టు తెలిసింది.
‘ఆవుల’ బెయిల్ వ్యవహారంపై సీపీ సీరియస్!
Published Wed, Jan 13 2016 2:08 AM | Last Updated on Sun, Sep 3 2017 3:33 PM
Advertisement
Advertisement