
కుమ్మరిపాలెం వద్ద ఫ్లై ఓవర్ పనులను పరిశీలిస్తున్న సీపీ గౌతమ్ సవాంగ్, ఎమ్మెల్సీ వెంకన్న
భవానీపురం (విజయవాడ వెస్ట్) : కనకదుర్గ ఫ్లై ఓవర్ నిర్మాణ పనుల సందర్భంగా ఏర్పడిన ట్రాఫిక్ ఇబ్బందుల నుంచి బయటపడేందుకు మరో 75 రోజులు ఓపిక పట్టాలని, ఆ తర్వాత ఈ తంటాలు ఉండవని నగర పోలీస్ కమిషనర్ గౌతమ్ సవాంగ్ అన్నారు. కనకదుర్గ ఫ్లై ఓవర్ నిర్మాణ పనులను, ట్రాఫిక్ మళ్లింపులను ఆయన ఆదివారం సాయంత్రం పరిశీలించారు. విద్యాధరపురం కుమ్మరిపాలెం సెంటర్ నుంచి హెడ్ వాటర్ వర్క్స్ వరకు కాలినడకన సందర్శించి సోమా కంపెనీ ప్రతినిధులు, ఆర్‌అండ్‌బీ అధికారులతో కలిసి చర్చించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ట్రాఫిక్ సమస్యతో ప్రజలు అసౌకర్యానికి గురవుతున్నప్పటికీ ఫ్లై ఓవర్ నిర్మాణం దృష్ట్యా ఓపికపట్టి సహకరించాలని కోరారు.
వాహనదారులు ఇబ్బందులు పడకుండా పనులు జరుగుతున్న ప్రదేశాలను మినహాయించి, మిగిలినచోట్ల రాకపోకలు జరిగేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న మాట్లాడుతూ ఫ్లై ఓవర్ నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నమాట వాస్తవమేనన్నారు. అయితే దేశంలోనే ఎక్కడా లేని విధంగా చేపట్టిన ఈ ఫ్లై ఓవర్ నిర్మాణంలో సాంకేతిక ఇబ్బందుల కారణంగానే ఆలస్యం అవుతోందని చెప్పారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కమిషనర్ బీవీ రమణకుమార్, డీసీపీ టీకే రాణా, ట్రాఫిక్ ఏడీసీపీ నాగరాజు, సోమా కంపెనీ జీఎం చౌదరి, ఆర్‌అండ్‌బీ ఇంజినీర్ జాన్‌మోషే, టీడీపీ ఫ్లోర్ లీడర్ జి. హరిబాబు, కార్పొరేటర్ వి. హరనాధస్వామి పాల్గొన్నారు.