పోలీసింగ్.. @ టెక్నాలజీ
నిఘా మరింత పటిష్టం..
కమిషనరేట్ పరిధిలో నిఘా వ్యవస్థను మరింత పటిష్ట పరచాలని సీపీ గౌతం సవాంగ్ నిర్ణయించారు. ఇప్పటికే నగరంలోని ప్రధాన కూడళ్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. పెరుగుతున్న జనాభా, నేరాల తీవ్రత దృష్ట్యా కొత్తగా 2వేల సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. నగరంలోని ప్రధాన కూడళ్లను అనుసంధానించే రోడ్లు, విద్యాసంస్థలున్న ప్రాంతాలు, కాలనీలు, నగర శివారుప్రాంతాల్లో వీటిని ఏర్పాటు చేస్తారు.
సాక్షి, అమరావతి బ్యూరో : భద్రత, నేరాల నియంత్రణకు నగర పోలీసు వ్యవస్థ ఆధునిక సాంకేతికతను మరింతగా అందిపుచ్చుకోనుంది. ప్రపంచస్థాయి ప్రమాణాలతో పోలీసింగ్‌ను పటిష్ట పరచాలని నిర్ణయించారు. విజయవాడ నగర పోలీస్ కమిషనర్ గౌతం సవాంగ్ యూకేలో వారంరోజుల పర్యటనలో ఆధునిక పోలీసింగ్‌పై నిర్వహించిన సదస్సులో పాల్గొన్నారు. హ్యాంప్‌షైర్‌లో నిర్వహించిన ‘యూకే సెక్యూరిటీ – పోలీసింగ్ ఎగ్జిబిషన్ 2017’కు హాజరయ్యారు. లండన్‌లోని పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా అభివృద్ధి చెందిన దేశాలు నేర పరిశోధనకు ఉపయోగిస్తున్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని పరిశీలించారు. ఆ పరిజ్ఞానాన్ని మన అవసరాలకు ఎలా మలచుకోవాలనే దానిపై పలువురు నిపుణులతో చర్చించారు. ఈ మేరకు విజయవాడ కమిషరేట్ పరిధిలో అమలు చేయనున్న ప్రతిపాదనలను ‘సాక్షి’కి ప్రత్యేకంగా వెల్లడించారు. ప్రధానంగా విజయవాడలోని కమాండ్ కంట్రోల్ సెంటర్ స్థాయిని మరింతంగా పెంచడంతోపాటు నగరంలో నిఘాను పటిష్ట పరచాలని నిర్ణయించారు.
సమాచార విశ్లేషణ వ్యవస్థ
సమాచార విశ్లేషణ, నేర పరిశోధన దిశగా కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను తీర్చిదిద్దుతారు. ఇప్పటికే ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కమాండ్ కంట్రోల్‌ను ఏర్పాటు చేశారు. రెండో దశలో ప్రపంచస్థాయి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించాలని పోలీస్ కమిషనర్ గౌతం సవాంగ్ నిర్ణయించారు. సమాచార విశ్లేషణ, నేర పరిశోధన అనే రెండు విభాగాలుగా కమాండ్ కంట్రోల్‌ను తీర్చిదిద్దాలని నిర్ణయించారు. లండన్‌లో దాదాపు లక్ష కెమెరాలతో సేకరించిన సమాచారాన్ని విశ్లేషించే వ్యవస్థ ఉంది. ఆ స్థాయిలో కాకపోయినా కమిషనరేట్ పరిధిలోని వివిధ మాధ్యమాల ద్వారా సేకరించిన సమాచారాన్ని విశ్లేషించే వ్యవస్థను నెలకొల్పనున్నారు. ఆధునిక నెట్‌వర్క్ వ్యవస్థ ఏర్పాటు, నగరాన్ని గ్రిడ్‌లుగా విభజన, సమన్వయం ఇందులో ప్రధానమైనవి.
అసాంఘిక శక్తుల కట్టడి ...
నేర పరిశోధనకు ఉపకరించే రీతిలో కమాండ్ కంట్రోల్‌స్థాయిని పెంచనున్నారు. కమాండ్ కంట్రోల్‌లో ‘ఫేసియల్ రికగ్నైజేషన్’ వ్యవస్థను ఏర్పాటు చేస్తారు. రాజధానిగా రూపాంతరం చెందిన తరువాత నగరానికి రాకపోకల తాకిడి పెరిగింది. నిత్యం వేలమంది కొత్త వ్యక్తులు వస్తున్నారు. ఈ నేపథ్యంలో అనుమానాస్పద వ్యక్తులపై ఓ కన్నేసి ఉంచాల్సిన అవసరం ఉందని గుర్తించారు. అందుకోసం ‘ఫేసియల్ రికగ్నైజేషన్’ పరిజ్ఞానాన్ని జోడించాలని నిర్ణయించారు. నగరంలోని సీసీ టీవీ ఫుటేజీల ద్వారా సంబంధిత వ్యక్తులు, వాహనాలను గుర్తించి డేటాను భద్రపరుస్తారు. ఆ వ్యక్తుల నేర చరిత్ర, ఇతర అంశాలన్నీ క్షణాల్లో విశ్లేషించి పోలీసులకు అందించగలదు.
తద్వారా అసాంఘిక శక్తులపై గట్టి నిఘా పెట్టడం సాధ్యపడుతుంది. అంతే కాకుండా వాహనాల వేగం, నిర్ణీత ప్రదేశాల మధ్య ఎన్నిసార్లు తిరిగింది, గతంలో ఎన్నిసార్లు జరిమానాలు విధించారు అనే వివరాలను కూడా క్షణాల్లో తెలుసుకోవడం సాధ్యపడుతుంది. వాహనాల నెంబర్ ప్లేట్ ఆధారంగా మొత్తం సమాచారం అందుబాటులోకి వచ్చే వ్యవస్థను ఏర్పాటు చేస్తారు. కమాండ్ కంట్రోల్‌కు అనుసంధానంగా వివిధ పోలీసు బృందాలను ఏర్పాటు చేస్తారు. ఫోన్ కాల్ వచ్చిన వెంటనే సంబంధిత బృందాలు స్పందించి సంఘటనాస్థలానికి చేరుకోగలుగుతాయి.