ధర్మసత్రంలో దీనవదనాలతో బాధిత కుటుంబం
డాబా గార్డెన్స్(విశాఖపట్నం): ఆర్భాటాలకు.. అనవసర ప్రచారాలకు యుద్ధప్రాతిపదికన నిధులు మంజూరు చేస్తున్న ఏపీ ప్రభుత్వం అత్యవసర ఖర్చుల విషయంలో మాత్రం బీద అరుపులు అరుస్తోంది. పేదల కష్టాన్ని పట్టించుకోకుండా కేవలం సిఫారసులతో కాలక్షేపం చేస్తోంది. ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఆర్తులకు నిధుల విడుదల విషయంలో ఇదే జరుగుతోంది. సాధారణంగా ఈ నిధి నుంచి ఎవరికైనా సహాయం చేస్తే వెంటనే దాన్ని చెక్కు రూపంలో అందజేస్తారు. కానీ, రాష్ట్ర సర్కారు ఈ నిధి కింద పేదలకు ప్రస్తుతం చెక్కులు కాకుండా సిఫారసు లేఖలే అందజేస్తోంది. అవి చెల్లుబాటు కాక బాధితులు దిక్కుతోచని స్థితిలో పడుతున్నారు. తూర్పు గోదావరి జిల్లాకు చెందిన ఓ పేద కుటుంబానికి ఇదే అనుభవం ఎదురైంది. సీఎం కార్యాలయం ఇచ్చిన లేఖను ప్రైవేట్ ఆస్పత్రి యాజమాన్యం తిరస్కరించడంతో ఆ కుటుంబం బిక్కచచ్చిపోయింది. దిక్కుతోచని స్థితిలో విశాఖపట్నంలోని ఓ సత్రంలో రోజులు వెళ్లదీస్తోంది.
ఏళ్ల తరబడి ఆస్పత్రుల చుట్టూ..
తూర్పుగోదావరి జిల్లా గొల్లప్రోలుకు చెందిన 66 ఏళ్ల బొర్రా లక్ష్మీనారాయణ కూలి పని చేసేవాడు. భార్య రమణమ్మ గృహిణి. వీరికి ఇద్దరు ఆడపిల్లలు. లక్ష్మీనారాయణకు కొన్నేళ్ల కిందట వెన్నునొప్పి రావడంతో 1995లో విశాఖ కేజీహెచ్‌లో శస్త్ర చికిత్స చేశారు. కొన్నేళ్లు బాగానే ఉన్నా మళ్లీ వెన్నునొప్పి పెరిగింది. దాంతో నగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చూపించారు. 2008లో అక్కడ శస్త్రచికిత్స చేసి ప్లేట్స్ అమర్చారు. ప్లేట్ల అమరికలో లోపం కారణంగా ఐదేళ్లకే సమస్య మళ్లీ మొదటికొచ్చింది. 2013లో మళ్లీ అదే ఆస్పత్రిలో చూపించారు. వైద్యులు మందులు ఇచ్చారు. అవి వాడినా ఫలితం కనిపించకపోవడంతో ఆరు నెలల క్రితం మరో ప్రైవేట్ ఆస్పత్రిని ఆశ్రయించారు. మళ్లీ ఆపరేషన్ చేయాల్సి ఉంటుందని, రూ.2.25 లక్షలు ఖర్చవుతుందని అక్కడి వైద్యులు చెప్పారు.
సీఎం సహాయ నిధి కోసం..
తన తండ్రికి ఎలాగైనా ఆపరేషన్ చేయించాలన్న ఉద్దేశంతో లక్ష్మీనారాయణ పెద్ద కుమార్తె ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఆర్థిక సాయం కోసం ప్రయత్నించింది. ఈ ఏడాది ఫిబ్రవరి 27న చీఫ్ మినిస్టర్స్ రిలీఫ్ ఫండ్ కింద రూ.85 వేలు మంజూరు చేస్తూ ముఖ్యమంత్రి కార్యాలయం ప్రైవేట్ ఆస్పత్రి డెరైక్టర్‌కు లేఖ ఇచ్చింది. అయితే, మంజూరు చేసిన సొమ్ము సరిపోదని బాధితుడి కుమార్తె మొరపెట్టుకోవడంతో తిరిగి మార్చి 4న రూ.2 లక్షల సీఎంఆర్‌ఎఫ్ నిధులు మంజూరు చేస్తూ సీఎం కార్యాలయం నుంచి మరో లేఖ ఇచ్చారు.
సొమ్ము తెస్తేనే ఆపరేషన్
ఆ లేఖను పట్టుకుని ఆస్పత్రికి వచ్చిన లక్ష్మీనారాయణ కుటుంబానికి యాజమాన్యం షాకిచ్చింది. సీఎంఆర్‌ఎఫ్ నుంచి వచ్చే సిఫారసు లేఖలను అంగీకరించలేమని, చెక్కు గానీ, సొమ్ముగానీ తెస్తేనే ఆపరేషన్ చేస్తామని తేల్చి చెప్పడంతో ఆ కుటుంబం తల్లడిల్లిపోయింది. ఈ సమస్యను ఎవరికి చెప్పుకోవాలో తెలియక కేజీహెచ్ సమీపంలోనే ఉన్న సుబ్బరామిరెడ్డి ధర్మసత్రంలో రోజులు వెళ్లదీస్తోంది. సీఎం సహాయ నిధి నుంచి సొమ్ము మంజూరు చేస్తూ లేఖ ఇచ్చినా దాన్ని ఆస్పత్రి వర్గాలు తిరస్కరించడంతో తమ గోడు ఎవరికి చెప్పుకోవాలో తెలియక ఆ కుటుంబం ఆవేదన చెందుతోంది.