Chief Ministers Relief Fund
-
‘సీఎం లేఖ’ చెల్లలేదు
డాబా గార్డెన్స్(విశాఖపట్నం): ఆర్భాటాలకు.. అనవసర ప్రచారాలకు యుద్ధప్రాతిపదికన నిధులు మంజూరు చేస్తున్న ఏపీ ప్రభుత్వం అత్యవసర ఖర్చుల విషయంలో మాత్రం బీద అరుపులు అరుస్తోంది. పేదల కష్టాన్ని పట్టించుకోకుండా కేవలం సిఫారసులతో కాలక్షేపం చేస్తోంది. ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఆర్తులకు నిధుల విడుదల విషయంలో ఇదే జరుగుతోంది. సాధారణంగా ఈ నిధి నుంచి ఎవరికైనా సహాయం చేస్తే వెంటనే దాన్ని చెక్కు రూపంలో అందజేస్తారు. కానీ, రాష్ట్ర సర్కారు ఈ నిధి కింద పేదలకు ప్రస్తుతం చెక్కులు కాకుండా సిఫారసు లేఖలే అందజేస్తోంది. అవి చెల్లుబాటు కాక బాధితులు దిక్కుతోచని స్థితిలో పడుతున్నారు. తూర్పు గోదావరి జిల్లాకు చెందిన ఓ పేద కుటుంబానికి ఇదే అనుభవం ఎదురైంది. సీఎం కార్యాలయం ఇచ్చిన లేఖను ప్రైవేట్ ఆస్పత్రి యాజమాన్యం తిరస్కరించడంతో ఆ కుటుంబం బిక్కచచ్చిపోయింది. దిక్కుతోచని స్థితిలో విశాఖపట్నంలోని ఓ సత్రంలో రోజులు వెళ్లదీస్తోంది. ఏళ్ల తరబడి ఆస్పత్రుల చుట్టూ.. తూర్పుగోదావరి జిల్లా గొల్లప్రోలుకు చెందిన 66 ఏళ్ల బొర్రా లక్ష్మీనారాయణ కూలి పని చేసేవాడు. భార్య రమణమ్మ గృహిణి. వీరికి ఇద్దరు ఆడపిల్లలు. లక్ష్మీనారాయణకు కొన్నేళ్ల కిందట వెన్నునొప్పి రావడంతో 1995లో విశాఖ కేజీహెచ్‌లో శస్త్ర చికిత్స చేశారు. కొన్నేళ్లు బాగానే ఉన్నా మళ్లీ వెన్నునొప్పి పెరిగింది. దాంతో నగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చూపించారు. 2008లో అక్కడ శస్త్రచికిత్స చేసి ప్లేట్స్ అమర్చారు. ప్లేట్ల అమరికలో లోపం కారణంగా ఐదేళ్లకే సమస్య మళ్లీ మొదటికొచ్చింది. 2013లో మళ్లీ అదే ఆస్పత్రిలో చూపించారు. వైద్యులు మందులు ఇచ్చారు. అవి వాడినా ఫలితం కనిపించకపోవడంతో ఆరు నెలల క్రితం మరో ప్రైవేట్ ఆస్పత్రిని ఆశ్రయించారు. మళ్లీ ఆపరేషన్ చేయాల్సి ఉంటుందని, రూ.2.25 లక్షలు ఖర్చవుతుందని అక్కడి వైద్యులు చెప్పారు. సీఎం సహాయ నిధి కోసం.. తన తండ్రికి ఎలాగైనా ఆపరేషన్ చేయించాలన్న ఉద్దేశంతో లక్ష్మీనారాయణ పెద్ద కుమార్తె ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఆర్థిక సాయం కోసం ప్రయత్నించింది. ఈ ఏడాది ఫిబ్రవరి 27న చీఫ్ మినిస్టర్స్ రిలీఫ్ ఫండ్ కింద రూ.85 వేలు మంజూరు చేస్తూ ముఖ్యమంత్రి కార్యాలయం ప్రైవేట్ ఆస్పత్రి డెరైక్టర్‌కు లేఖ ఇచ్చింది. అయితే, మంజూరు చేసిన సొమ్ము సరిపోదని బాధితుడి కుమార్తె మొరపెట్టుకోవడంతో తిరిగి మార్చి 4న రూ.2 లక్షల సీఎంఆర్ఎఫ్ నిధులు మంజూరు చేస్తూ సీఎం కార్యాలయం నుంచి మరో లేఖ ఇచ్చారు. సొమ్ము తెస్తేనే ఆపరేషన్ ఆ లేఖను పట్టుకుని ఆస్పత్రికి వచ్చిన లక్ష్మీనారాయణ కుటుంబానికి యాజమాన్యం షాకిచ్చింది. సీఎంఆర్ఎఫ్ నుంచి వచ్చే సిఫారసు లేఖలను అంగీకరించలేమని, చెక్కు గానీ, సొమ్ముగానీ తెస్తేనే ఆపరేషన్ చేస్తామని తేల్చి చెప్పడంతో ఆ కుటుంబం తల్లడిల్లిపోయింది. ఈ సమస్యను ఎవరికి చెప్పుకోవాలో తెలియక కేజీహెచ్ సమీపంలోనే ఉన్న సుబ్బరామిరెడ్డి ధర్మసత్రంలో రోజులు వెళ్లదీస్తోంది. సీఎం సహాయ నిధి నుంచి సొమ్ము మంజూరు చేస్తూ లేఖ ఇచ్చినా దాన్ని ఆస్పత్రి వర్గాలు తిరస్కరించడంతో తమ గోడు ఎవరికి చెప్పుకోవాలో తెలియక ఆ కుటుంబం ఆవేదన చెందుతోంది. -
సీఎంఆర్ఎఫ్ స్కాంపై దర్యాప్తు ముమ్మరం
123 మందిని నిందితులుగా గుర్తించిన సీఐడీ 10 మందిని అరెస్టు చేసిన అధికారులు 56 ఆసుపత్రుల్లో రూ. 75 లక్షలు స్వాహా చేసినట్లు నిర్ధారణ దర్యాప్తు నివేదిక సీఎం కేసీఆర్‌కు సమర్పణట హైదరాబాద్: ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) నుంచి చెల్లింపుల్లో బయటపడిన నకిలీ వైద్య బిల్లుల కుంభకోణంపై నేర విచారణ విభాగం(సీఐడీ) వేగం పెంచింది. వైద్య చికిత్సలు చేసుకోకుండానే నకిలీ బిల్లులు సృష్టించి రూ.లక్షలు కొల్లగొట్టిన వారికి ఉచ్చు బిగిస్తోంది. తొలి విడత దర్యాప్తులో భాగంగా 56 ఆస్పత్రుల్లోని రికార్డులను పరిశీలించి లబ్ధిదారులను ప్రశ్నించిన సీఐడీ... రూ.75 లక్షలు పక్కదారి పట్టినట్లు గుర్తించింది. ఈ కుంభకోణంలో 123 మందిని నిందితులుగా గుర్తించి 10 మందిని అరెస్టు చేసింది. మరికొంత మందిని అరెస్టు చేసేందుకు ప్రత్యేక బృందాలతో గాలిస్తోంది. బ్రోకర్లు, ఆస్పత్రుల సిబ్బంది, ఆరోగ్య మిత్రుల కుమ్మక్కు...: గతేడాది జనవరిలో సీఎంఆర్ఎఫ్ చెల్లింపులు పక్కదారి పడుతున్నట్లు గుర్తించిన అధికారులు తొలుత అనుమానంతో 18 రోగుల ఫైళ్లపై శాఖాపరమైన విచారణ చేపట్టగా అందులో నాలుగు నకిలీ బిల్లులున్నట్లు బయటపడింది. ఈ ఉదంతంపై ఆగ్రహం వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి గతేడాది జనవరి 30న సీఐడీ విచారణకు ఆదేశించడంతో రంగంలోకి దిగిన అధికారులు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి మంజూరు చేసిన బిల్లులన్నింటిపై విచారణ చేపట్టారు. దాదాపు 12 వేల దరఖాస్తుదారులు 600 ఆస్పత్రులకు చెల్లించిన చెక్కులు, రోగుల రికార్డులను పరిశీలించింది. సీఎంఆర్ఎఫ్ సొమ్ము కొల్లగొట్టేందుకు పక్కా ప్రణాళిక ప్రకారం కుట్ర జరిగినట్లు సీఐడీ నిర్ధారించింది. నకిలీ వైద్య బిల్లులు సృష్టించేందుకు బ్రోకర్లు, హాస్పిటల్ బిల్ డెస్క్ సిబ్బంది, ఆరోగ్య మిత్రలు కుమ్మక్కైనట్లు దర్యాప్తులో తేల్చింది. ఇందులో ఇద్దరు సీఎంఆర్ఎఫ్ ఉద్యోగుల ప్రమేయం సైతం ఉన్నట్లు సీఐడీ గుర్తించింది. ‘పని’ పూర్తయ్యాక అందరూ పక్కాగా వాటాలు పంచుకున్నారని...నిందితులు కొన్ని సందర్భాలలో నకిలీ బిల్లులతో ఆరోగ్యశ్రీ కింద రీయింబర్స్‌మెంట్‌కు, సీఎంఆర్ఎఫ్ కింద ఆర్థిక సాయానికి దరఖాస్తులు పెట్టి నిధులు కాజేశారని కనుగొంది. అలాగే చికిత్సలతో సంబంధం లేకుండా హాస్పిటల్ బిల్ డెస్క్ సిబ్బంది ప్రమేయంతో వ్యక్తుల పేర్ల మీద నకిలీ బిల్లులు సృష్టించి ఆరోగ్య మిత్రల సాయంతో బ్రోకర్లు దరఖాస్తు చేసుకొని సీఎంఆర్ఎఫ్ ఆర్థిక సాయాన్ని మెక్కేశారని... కొన్ని కేసుల్లో చికిత్స చేయించుకున్న రోగులకు రూ. వేలల్లో అయిన బిల్లులను రూ. లక్షల్లోకి మార్చి డబ్బులు నొక్కేసినట్లు సీఐడీ గుర్తించింది. ఈ కుంభకోణంపై ఇప్పటివరకు చేపట్టిన దర్యాప్తు వివరాల నివేదికను సీఐడీ సీఎం కేసీఆర్‌కు సమర్పించింది. -
ఇప్పటి వరకు రూ. 161.3 కోట్ల విరాళాలు
చెన్నై : సీఎం వరద నివారణ నిధికి విరాళాల రాక పెరిగింది. సోమవారం నాటికి రూ.161 కోట్ల 30 లక్షల 29 వేల విరాళాలు వచ్చి చేరాయి. చెన్నై, తిరువళ్లూరు, కాంచీపురం, కడలూరు జిల్లాల్లో వరదలు సృష్టించిన పెను విలయం గురించి తెలిసిందే. బాధితుల్ని ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆగమేఘాలపై చర్యలు తీసుకుంటోంది. నిధుల కొరత వెంటాడుతుండడంతో ఆపన్నహస్తం కోసం రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని సైతం చేతులు చాచాల్సిన పరిస్థితి ఏర్పడింది. నిధులు త్వరితగతిన మంజూరు చేయాలని కేంద్రాన్ని సీఎం జయలలిత ఓ వైపు విజ్ఞప్తి చేస్తూ వస్తుంటే, మరో వైపు మానవతా హృదయులు, బడా సంస్థలు తాము సైతం అంటూ నష్టంలో , కష్టంలో పాలు పంచుకునేందుకు ముందుకు వస్తున్నాయి. ప్రజా ప్రతినిధులు తమ నెల జీతాన్ని అందించడంతో పాటుగా నియోజకవర్గ అభివృద్ధి నిధుల్ని వరద బాధిత ప్రాంతాలకు మళ్లించే పనిలో పడ్డారు. అనేక ప్రైవేటు రంగ సంస్థలు విరాళాల్ని అందించే పనిలో పడ్డాయి. సోమవారం సుందరం సంస్థ రూ.3 కోట్లు, ైనె వేలి లిగ్నైట్ కార్పొరేషన్ రూ.2.5 కోట్లు, టీవీ అయ్యంగార్ అండ్ సన్స్ రూ.2.5 కోట్లు, యునెటైడ్ ఇండియా రూ.2 కోట్లు, ఆమ్ వే ఇండియా ఎంటర్ ప్రైజస్ రూ.2 కోట్లు, దాల్మియా సిమెంట్స్ రూ.1 కోటి చొప్పున విరాళాలు ప్రకటించాయి. వీటితో పాటుగా మరికొన్ని సంస్థల ప్రతినిధులు ఉదయం సచివాలయంలో సీఎంను కలుసుకుని విరాళాలకు చెక్కులను అందజేశారు. తాజాగా వచ్చిన విరాళాలతో మొత్తంగా ఇప్పటి వరకు 161 కోట్ల 30 లక్షల 29 వేలు సీఎం రిలీఫ్ ఫండ్ ఖాతాలోకి చేరి ఉన్నట్టు సచివాలయం వర్గాలు ప్రకటించాయి. -
సీఎం సహాయ నిధి నుంచి డబ్బు ఇప్పిస్తానని మోసం
నిందితుడి అరెస్టు సిటీబ్యూరో: ఆయా కేసుల్లో బాధితులకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి నిధులు మంజూరు చేయిస్తానని పలువురిని నిలువునా దోచుకున్న ఓ మోసగాడిని సీసీఎస్ పోలీసులు అరెస్టు చేశారు. అదనపు పోలీసు కమిషనర్ (క్రైమ్స్) స్వాతిలక్రా కథనం మేరకు...అనంతపురం జిల్లా జోగుల కొత్తపల్లికి చెందిన బంగారు సురేష్ (36) తనకు తాను సీఎం పేషీ అడిషనల్ చీఫ్ సెక్రటరీ పీఏనంటూ పలువురిని మోసగించాడు. మల్కాజిగిరికి చెందిన అంజయ్య కుమారుడు కరీంనగర్లో గతేడాది సెప్టెంబర్ 10న ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మీకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి నిధులు మంజూరయ్యాయని, మీరు కొంత డబ్బు డిపాజిట్ చేయాలని అంజయ్యకు సురేష్ ఫోన్ చేసి చెప్పాడు. నిజమే అనుకున్న అంజయ్య అతను చెప్పిన ప్రకారం డిపాజిట్ కింద రూ.10 వేలు సురేష్ బ్యాంక్ అకౌంట్లో వేశాడు. సురేష్ ఇదే తీరులో పలువురు బాధితుల నుంచి డబ్బు వసూలు చేశాడు. బాధితులకు ముఖ్యమంత్రి సహాయ నిధి కింద నిధులు రాకపోవడంతో చివరకు సీసీఎస్ పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసిన సీసీఎస్ పోలీసు బుధవారం సురేష్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. -
పెళ్లి ఖర్చులు సీఎం సహాయ నిధికి..
షోలాపూర్, న్యూస్‌లైన్: అతనొక రాజకీయ నాయకుడు.. అందులోనూ కుమార్తె వివాహం.. ఇక పెళ్లి ఏర్పాట్లు ఏ స్థాయిలో ఉంటాయో మీరే ఊహించుకోవచ్చు.. ఆగండాగండి.. మీరు ఊహిస్తున్నట్లు ఆయన తన కుమార్తె పెళ్లిని అంగరంగ వైభవంగా జరిపించలేదు.. కేవలం నిశ్చితార్థం ఖర్చులోనే పెళ్లి జరిగిందనిపించేశాడు.. అయినా అతడిని ఎవరూ తిట్టుకోలేదు.. పిసినారి అని అనలేదు.. ఎందుకో తెలుసా.. పెళ్లికోసం ఖర్చు పెట్టాల్సిన సొమ్మును అతడు ముఖ్యమంత్రి సహాయ నిధికి అందజేశాడు.. అదీ అక్కడి విశేషం..! వివరాల్లోకి వెళితే.. బాలాసాహెబ్ మోరే మరాఠ్వాడాలోని అకుల్కోట్ పంచాయితీ సమితి ప్రతిపక్ష నేత. ఆయన తన కుమార్తె సౌజన్యకు చంద్రకాంత్ క్షీరసాగర్తో వివాహం నిశ్చయించారు. ఈ మేరకు బుధవారం పట్టణంలోనే నిశ్చితార్థం పెట్టుకున్నారు. జనవరి 29వ తేదీన వివాహం జరగాల్సి ఉంది. సాధారణంగా నిశ్చితార్థం, వివాహం ఇలా రెండు వేడుకలకూ అదే బంధువులను ఆహ్వానిస్తారు. దీంతో రెండుసార్లు వేడుకల కోసం ఖర్చుపెట్టే సొమ్ములో కొంత పొదుపు చేసి ముఖ్యమంత్రి సహాయ నిధికి అందజేయాలని మోరే సంకల్పించగా, వరుడి తరఫు వారు సైతం అంగీకరించారు. దీంతో పెళ్లి సమయంలో వేడుకలను రద్దుచేయాలని నిశ్చయించారు. ఆ రోజు ఖర్చు రూ.లక్షా వెయ్యి రూపాయలుగా తేలడంతో సదరు మొత్తాన్ని నిశ్చితార్థం సమయంలోనే చెక్కు రూపంలో స్థానిక తహశీల్దార్‌కు అందజేసి అందరికీ ఆదర్శంగా నిలిచారు. ఈ సందర్భంగా బాలాసాహెబ్ మోరే మాట్లాడుతూ.. ప్రస్తుతం తీవ్ర క్షామంతో అల్లాడుతున్న మరాఠ్వాడాను ఆదుకునేందుకు తమ వంతు సాయంగా ఈ మొత్తాన్ని సీఎం సహాయ నిధికి అందజేశామన్నారు. వృథా ఖర్చులు తగ్గించుకుని, ఆ సొమ్మును కరువు బారిన పడిన రైతులను ఆదుకునేందుకు అందజేయాలనే సంకల్పంతోనే ఈ పనికి పూనుకున్నామని చెప్పారు.