పెళ్లి ఖర్చులు సీఎం సహాయ నిధికి..
షోలాపూర్, న్యూస్‌లైన్: అతనొక రాజకీయ నాయకుడు.. అందులోనూ కుమార్తె వివాహం.. ఇక పెళ్లి ఏర్పాట్లు ఏ స్థాయిలో ఉంటాయో మీరే ఊహించుకోవచ్చు.. ఆగండాగండి.. మీరు ఊహిస్తున్నట్లు ఆయన తన కుమార్తె పెళ్లిని అంగరంగ వైభవంగా జరిపించలేదు.. కేవలం నిశ్చితార్థం ఖర్చులోనే పెళ్లి జరిగిందనిపించేశాడు.. అయినా అతడిని ఎవరూ తిట్టుకోలేదు.. పిసినారి అని అనలేదు.. ఎందుకో తెలుసా.. పెళ్లికోసం ఖర్చు పెట్టాల్సిన సొమ్మును అతడు ముఖ్యమంత్రి సహాయ నిధికి అందజేశాడు.. అదీ అక్కడి విశేషం..!
వివరాల్లోకి వెళితే.. బాలాసాహెబ్ మోరే మరాఠ్వాడాలోని అకుల్‌కోట్ పంచాయితీ సమితి ప్రతిపక్ష నేత. ఆయన తన కుమార్తె సౌజన్యకు చంద్రకాంత్ క్షీరసాగర్‌తో వివాహం నిశ్చయించారు. ఈ మేరకు బుధవారం పట్టణంలోనే నిశ్చితార్థం పెట్టుకున్నారు. జనవరి 29వ తేదీన వివాహం జరగాల్సి ఉంది. సాధారణంగా నిశ్చితార్థం, వివాహం ఇలా రెండు వేడుకలకూ అదే బంధువులను ఆహ్వానిస్తారు.
దీంతో రెండుసార్లు వేడుకల కోసం ఖర్చుపెట్టే సొమ్ములో కొంత పొదుపు చేసి ముఖ్యమంత్రి సహాయ నిధికి అందజేయాలని మోరే సంకల్పించగా, వరుడి తరఫు వారు సైతం అంగీకరించారు. దీంతో పెళ్లి సమయంలో వేడుకలను రద్దుచేయాలని నిశ్చయించారు.
ఆ రోజు ఖర్చు రూ.లక్షా వెయ్యి రూపాయలుగా తేలడంతో సదరు మొత్తాన్ని నిశ్చితార్థం సమయంలోనే చెక్కు రూపంలో స్థానిక తహశీల్దార్‌కు అందజేసి అందరికీ ఆదర్శంగా నిలిచారు.
ఈ సందర్భంగా బాలాసాహెబ్ మోరే మాట్లాడుతూ.. ప్రస్తుతం తీవ్ర క్షామంతో అల్లాడుతున్న మరాఠ్వాడాను ఆదుకునేందుకు తమ వంతు సాయంగా ఈ మొత్తాన్ని సీఎం సహాయ నిధికి అందజేశామన్నారు. వృథా ఖర్చులు తగ్గించుకుని, ఆ సొమ్మును కరువు బారిన పడిన రైతులను ఆదుకునేందుకు అందజేయాలనే సంకల్పంతోనే ఈ పనికి పూనుకున్నామని చెప్పారు.