పెన్ను మూత మింగి చిన్నారి మృతి
సంజామల: పెన్నుమూత మింగి ఓ చిన్నారి మృతి చెందింది. మండలపరిధిలోని నొస్సం గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. సుమ్రమణ్యం, లక్ష్మీదేవి దంపతులకు ఇద్దరు పిల్లలు. వారిలో రెండో సంతానమైన మంగలి నాగేంద్ర(7) స్నేహితులతో ఆడుకునేందుకు ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. పొరపాటును జేబులో ఉన్న పెన్ను మూతను నోటిలో పెట్టుకొని నములుతూ మింగాడు. ఊపిరాడక ఇబ్బంది పడుతుండగా తోటి స్నేహితులు తల్లిదండ్రులకు తెలిపారు. వెంటనే చిన్నారి నాగేంద్రను చికిత్స నిమిత్తం జమ్మలమడుగు ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతిచెందాడు. దీంతో కుటుంబసభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. మృతిచెందిన చిన్నారి స్థానిక నలంద ప్రైవేటు పాఠశాలలో 1వ తరగతి చదువుతున్నాడు.