- గర్భవతిని చేసిన మేనమామ
- నిందితుడి కోసం పోలీసుల గాలింపు
బాలికపై లైంగికదాడి
Published Fri, Sep 2 2016 11:09 PM | Last Updated on Mon, Sep 4 2017 12:01 PM
ఉప్పలగుప్తం :
మేనమామ పశువాంఛకు ఓ బాలిక బలైపోయింది. అన్నెంపున్నెం తెలియని ఆమె తనపై జరిగిన అకృత్యాన్ని అటు తల్లికి కానీ, ఇటు బంధువులకు కానీ చెప్పుకోలేక నరకం అనుభవించింది. ఆరు నెలలుగా రుతుక్రమం జరగకపోవడంతో తల్లి ప్రతీ నెలా ప్రశ్నించినా ఆ బాలిక దాటవేసింది. ఆమెకు బ్లీడింగ్ జరుగుతుండడంతో తల్లి ఆస్పత్రికి తీసుకు వెళ్లగా ఆ బాలిక గర్భవతి అని వైద్యులు తేల్చి చెప్పారు. దాంతో దిమ్మెర పోయిన ఆతల్లి ఆమెను నిలదీయగా వాస్తవాలు వెలుగు చూశాయి. ఉప్పలగుప్తం ఎస్సై రుద్రరాజు భీమరాజు శుక్రవారం తెలిపిన వివరాల ప్రకారం.. ఉప్పలగుప్తం మండలం గోపవరం గ్రామానికి చెందిన నిరుపేద దంపతులకు ఇద్దరు కుమార్తెలు. స్థానిక ఉన్నత పాఠశాలలో పెద్దకుమార్తె 9వ తరగతి చదువుతుండగా చిన్నకుమార్తె 7వ తరగతి చదువుతోంది. అదే గ్రామంలో కూతవేటు దూరంలో వారి మేనమామ మస్తాన్ సాహెబ్ నివాసముంటున్నాడు. అతను కూలిపని చేస్తుంటాడు. మస్తాన్ సాహెబ్ భార్య మూడేళ్ల క్రితం చనిపోయింది. మస్తాన్‌కు ఇద్దరు కుమార్తెలు కాగా పెద్దామెకు ఇటీవలే వివాహం చేశాడు. చిన్న కుమార్తె అమ్మమ్మ వద్ద ఉంటోంది. మస్తాన్ తల్లితో కలసి గోపవరంలో ఉంటున్నాడు. భార్య చనిపోయిన మస్తాన్ సాహెబ్ కన్ను పెద్దమేనకోడలిపై పడింది. ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ విషయం తల్లిదండ్రులకు, బంధువులకు చెబితే ఏం గొడవ వస్తుందో అని భయపడిన ఆబాలిక తనకు జరిగిన అన్యాయాన్ని బయట పెట్టలేదు. బాలికకు రక్తస్రావం కావడంతో తల్లి ఆమెను గురువారం అమలాపురం ఏరియా ఆస్పత్రికి తీసుకువెళ్లింది. ఆస్పత్రి నుంచి వచ్చిన సమాచారం మేరకు ఎస్సై భీమరాజు బాలికపై జరిగిన లైంగిక దాడిపై కేసు నమోదు చేశారు. ఆమెను గర్భవతిని చేసిన మస్తాన్ కోసం గాలిస్తున్నట్టు ఎస్సై తెలిపారు.
Advertisement
Advertisement