కాటేసిన కర్కశత్వం
-
మానసిక వికలాంగ బాలికపై అత్యాచారం
-
బాధితురాలి తల్లి, నిందితుడు పారిశుధ్య కార్మికులే
-
బాధిత బాలికను పరామర్శించిన ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు కృష్ణ మాదిగ
అమలాపురం టౌన్ :
నోరు తెరిచి కనీసం అమ్మా అని కూడా పలకలేదు... కాళ్లు చేతులు కదపలేదు....కేవలం కళ్లతో మాత్రం దీనంగా చూడగలుగుతుంది. అమ్మే కంటికి రెప్పలా చూసుకుంటూ సాకుతున్న ఆ మైనర్ మానసిక వికలాంగురాలిని ఓ కామాంధుడు కాటేశాడు. స్థానిక మున్సిపల్ కాలనీకి చెందిన పదిహేనేళ్ల మైనర్ మానసిక వికలాంగరాలిపై అదే కాలనీకి చెందిన కొప్పనాతి సతీష్ మంగళవారం తెల్లవారుజామున అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలికను మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికురాలైన తల్లే సాకుతోంది. తండ్రి లేని ఆ బాలికపై ఇంటి సమీపంలో నివాసముంటున్న మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుడైన సతీష్ కన్నేశాడు. సోమవారం అర్ధరాత్రి కాలనీలో ఓ మహిళ చనిపోవడంతో ఇరుగుపొరుగంతా అక్కడే మంగళవారం తెల్లవారు జాము దాకా ఉండిపోయారు. ఇదే అదనుగా తెల్లవారు జాము నాలుగు గంటల సమయంలో ఇంట్లోకి చొరబడి బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అదే సమయంలో తల్లి రావడాన్ని గమనించిన సతీష్ ఆమెను నెట్టి పరారయ్యాడు. తల్లి కేకలకు ఇరుగుపొరుగంతా అక్కడికి చేరుకుని పరిస్థితి గమనించి సతీష్‌పై ఆగ్రహంతో ఊగిపోయారు. జరిగిన ఘటనపై బాధితురాలి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయగా సీఐ వైఆర్‌కే శ్రీనివాస్ ఘటన స్థలాన్ని పరిశీలించారు. సతీష్ కోసం నాలుగు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. బాలికను అత్యవసర చికిత్స కోసం స్థానిక ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించారు. నిందితుడిపై ప్రివెన్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్స్ యాక్టుతో మరో ఏడు సెక్షన్ల కింద కేసు నమోదు చేశామన్నారు.
సతీష్‌కు జీవిత ఖైదు విధించాలి: కృష్ణ మాదిగ
నిందితుడు కొప్పనాతి సతీష్‌కు జీవిత ఖైదే సరైన శిక్ష అని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ అన్నారు. ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందతున్న బాలికను ఆయన మంగళవారం పరామర్శించారు. బాధితురాలికి ప్రభుత్వం రూ.10 లక్షలు ఎక్స్‌గ్రేషియా ఇచ్చి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. నిందితుడిపై ఎస్సీఎస్టీ అట్రాసిటీ కేసుతో పాటు నిర్భయ కేసు కూడా నమోదు చేయాలని డిమాండు చేశారు. కృష్ణమాదిగతో పాటు ఎమ్మార్పీఎస్ జాతీయ ప్రధాన కార్యదర్శి మందా వెంకటేశ్వరరావు, రాష్ట్ర పాలిట్ బ్యూరో సభ్యుడు ఆకుమర్తి సూర్యనారాయణ, కోనసీమ అధ్యక్షుడు గంపల సత్యప్రసాద్ తదితరులు బాలికను పరామర్శించారు. రాష్ట్ర ఎమ్మార్పీఎస్ ప్రధాన కార్యదర్శి, వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి బొమ్మి ఇజ్రాయిల్ కూడా ఓ ప్రకటనలో బాలికపై అత్యాచార ఘటనను తీవ్రంగా ఖండించారు.