
'మా డాడీ మాకు కావాలి'
మానకొండూరు (కరీంనగర్) : ఓ కానిస్టేబుల్ తనకు భార్య, పిల్లలు ఉండగానే మరో మహిళతో సహజీవనం చేస్తుండడంతో... పిల్లలు 'మా డాడీ మాకు కావాలి' అంటూ ఆందోళనకు దిగారు. ఈ ఘటన కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండల కేంద్రంలో శుక్రవారం చోటుచేసుకుంది. కనకయ్య అనే వ్యక్తి కరీంనగర్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తూ మానకొండూరులో నివాసం ఉంటున్నాడు. కనకయ్యకు భార్య శారద, ఇద్దరు పిల్లలు ఉన్నారు. వీరి మధ్య విబేధాలు రావడంతో ఒకే చోట పక్క పక్క ఇళ్లల్లో ఉంటున్నారు.
ఈ క్రమంలో కనకయ్య... అనురాధ అనే మరో మహిళతో సహజీవనం చేస్తున్నాడు. దీంతో శారద, ఆమె పిల్లలు ఇద్దరు సోమవారం మహిళా సంఘాల వారి సాయంతో కనకయ్య ఇంటి ముందు ఆందోళనకు దిగారు. 'మా డాడీ మాకు కావాలి' అంటూ కనకయ్య పిల్లలు ఫ్లకార్డులను చేత్తో పట్టుకుని నిరసన తెలిపారు. అక్రమ సంబంధాన్ని అరికట్టాలి, భార్య ఉండగా మరో స్త్రీ ఎందుకు అనే నినాదాలు రాసి ఉన్న ఫ్లకార్డులను పట్టుకుని కొందరు మహిళలు ధర్నాకు దిగారు. ఆ తర్వాత ఆగ్రహంతో ఇంటి లోపల ఉన్న అనురాధను బయటకు తీసుకొచ్చి దాడి చేసి కొట్టారు. ఈలోగా పోలీసులు అక్కడకు చేరుకుని.. న్యాయ మార్గంలో వెళ్లాలని, ఇలా దాడి చేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించడంతో వారు అక్కడి నుంచి వెళ్లిపోయారు.