చింతలపూడేనా!
చింతలపూడేనా!
Published Mon, Feb 6 2017 1:23 AM | Last Updated on Tue, Sep 5 2017 2:58 AM
చింతలపూడి ఎత్తిపోతల పథకం నిర్మాణం నత్తనడకన సాగుతోంది. పథకం పనులు 28 శాతం మాత్రమే పూర్తయ్యాయి. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మూడు శాతం మాత్రమే పనులు జరిగాయి. భూసేకరణ, నష్టపరిహారంపై అన్నదాతలు ఆందోళన చేస్తున్నారు. తాజాగా రైతులతో కలెక్టర్ జరిపిన చర్చలు బెడిసికొట్టడంతో పథకం ఎప్పటికి పూర్తవుతుందోననే ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది.
కొవ్వూరు : చింతలపూడి ఎత్తిపోతలు.. మూడేళ్ల క్రితం పూర్తి కావాల్సిన మెట్ట రైతుల ఆశా పథకం ఇదీ.. ఇప్పటికీ పనులు నత్తనడకన సాగుతున్నాయి. భూసేకరణ ప్రక్రియ ఇంకా కొలిక్కి రాలేదు. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ నాటికి పథకం పూర్తి చేసి రెండు లక్షల ఎకరాలకు నీళ్లు ఇస్తామంటూ జిల్లా మంత్రి పీతల సుజాత ప్రకటన చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇది మెట్ట రైతులను మభ్యపెట్టె ప్రయత్నమేననే అసంతృప్తి సర్వత్రా వ్యక్తమవుతోంది. 2014 మార్చి నాటికే ఈ పథకం 25 శాతం పనులు పూర్తయిపోయాయి. దీనికి రూ.344 కోట్లు ఖర్చయ్యాయి. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 30 నెలల కాలంలో మూడు శాతం పనులు మాత్రమే పూర్తయ్యాయి. ఇప్పటి వరకు భూసేకరణతో కలిపి కేవలం రూ.714కోట్ల విలువైన పనులే పూర్తయ్యాయి. వీటిలో సగానికిపైగా పనులు తెలుగుదేశం ప్రభుత్వం రాకముందే పూర్తయ్యాయి. 2009 ఫ్రిబవరిలో దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో ఈ పథకం మంజూరైంది. రూ.1,701 కోట్ల వ్యయంతో నాలుగేళ్ల కాలంలో అంటే 2013 ఫిబ్రవరి నాటికి పథకం పూర్తికావాలనేది అప్పటి లక్ష్యం. వై.ఎస్.రాజశేఖరరెడ్డి హఠాన్మరణం నేపథ్యంలో ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం తగిన చొరవ చూపక పోవడంతో మెట్ట రైతుల ఆశలు నెరవేరలేదు.
పనుల్లో ఏదీ పురోగతి
ఈ ప్రాజెక్టును రెండు ప్యాకేజీలుగా చేపట్టారు. మొదటి ప్యాకేజీలో జనవరి నెలాఖరు నాటికి 230 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి తవ్వకం పనులు చేపట్టాల్సి ఉండగా ఇప్పటి వరకు కేవలం 107లక్షల క్యూబిక్ మీటర్లు మట్టి తవ్వారు. ప్రధాన కాలువపైన మార్గమధ్యలో 110 నిర్మాణాలు చేపట్టాల్సి ఉండగా.. వీటిలో 18 మాత్రమే పూర్తి చేశారు. మరో ఐదు స్ట్రక్చర్లు పురోగతిలో ఉన్నాయి. ప్ర«ధాన కాలువలో 97.5ల„ýక్ష ల క్యూబిక్ మీటర్ల మట్టి తవ్వకాలు చేయాల్సి ఉండగా 66.6లక్షల క్యూబిక్ మీటర్లు మట్టి తవ్వకం పనులు చేశారు. పిల్ల కాలువలకు సంబంధించి ఏడు లక్షల క్యూబిక్ మీటర్లు తవ్వాల్సి ఉంటే కేవలం పదివేల క్యూబిక్ మీటర్లు మట్టి పనులు మాత్రమే చేశారు. రెండో ప్యాకేజీలో 60 లక్షల క్యూబిక్ మీటర్లు తవ్వాల్సి ఉండగా 29.84 లక్షల క్యూబిక్ మీటర్లు తవ్వారు.ఈ ప్యాకేజీలో 84 స్ట్రక్చర్లు నిర్మించాల్సి ఉండగా ఒక్కటీ పూర్తి కాలేదు. కేవలం ఆరు నిర్మాణాలు మాత్రం పురోగతిలో ఉన్నాయి. మొత్తం ప్రాజెక్టు వ్యయంలో ఇప్పటి వరకు రూ.714 కోట్లు ఖర్చు చేస్తే దీనిలో రూ.525.34 కోట్లు విలువైన నిర్మాణ పనులు, రూ.188.93 కోట్లు భూసేకరణ వెచ్చించారు. మొదటి ప్యాకేజీ పనులు 31శాతం, రెండో ప్యాకేజీ పనులు 20 శాతం పూర్తి చేశారు.
కొలిక్కిరాని భూ సేకరణ
పథకం నిర్మాణానికి 17,042.61 ఎకరాలు అవసరం కాగా.. ఇప్పటి వరకు 7,725 ఎకరాల భూమి మాత్రమే సేకరించారు. ఇంకా 9,317 ఎకరాలను సేకరించాల్సి ఉంది. దీనిలో 6,683 ఎకరాల అటవీ భూమి, 2,634 ఎకరాల జిరాయితీ భూమి సేకరించాల్సి ఉంది. ప్రధానంగా అటవీ భూములకు ప్రత్యామ్నాయం చూపాల్సి ఉంది. భూసేకరణలో రైతుల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. నష్టపరిహారంగా ఒక్కోచోట ఒక్కో ధర నిర్ణయించడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై తాజాగా శనివారం రైతులతో కలెక్టర్ జరిపిన చర్యలు బెడిసి కొట్టడంతో పనుల పూర్తిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఫేజ్–2 ప్రకటనలతో సరి
చింతలపూడి ఎత్తిపోతల పథకం పేజ్–2 ప్రకటనలకే పరిమితమైంది. జిల్లాలో 2.68 లక్షల ఎకరాలతో పాటు కృష్ణా జిల్లాలో 2.10 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేందుకు ఏడాది క్రితం ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రకటించింది. అప్పటి నుంచి ఇది కార్యరూపు దాల్చడం లేదు.రూ.3.208 కోట్ల రివైజ్డ్ అంచనాలతో మొత్తం ప్రాజెక్టు విలువను రూ.1,701 కోట్ల నుంచి రూ.4,909 కోట్లకు పెంచారు. దీనికి పరిపాలనా ఆమోదం లభించినా టెండర్‌లు పిలిచేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. ఇంత వరకు ఎలాంటి ఆదేశాలూ రాలేదు. ఎర్రకాలువ పరిధిలో 27వేల ఎకరాలు, తమ్మిలేరు ప్రాజెక్టు పరిధిలో 24 వేల ఎకరాలు, కొవ్వాడ ప్రాజెక్టు పరిధిలో 17వేల ఎకరాలను స్థిరీకరించడంతో పాటు జల్లేరు జలాశయం సామర్థ్యాన్ని 8 టీఎంసీల నుంచి 20 టీఎంసీలకు పెంచాలని నిర్ణయించారు. కృష్ణా జిల్లాలో తిరువూరు, నూజివీడు, మైలవరం నియోజకవర్గాల పరిధిలో సాగర్ ఆయకట్టుకు సాగు నీరు అందించాలని నిర్ణయించినట్టు ప్రకటించింది. పరిపాలనా ఆమోదం లభించినా టెండర్ల ప్రక్రియకు నోచుకోవడం లేదు. ఫేజ్–1లో చేపట్టిన పనులకు సంబంధించి తొమ్మిదేళ్ల క్రితం అంచనాలు రూపొందించారు. అప్పటి ఎస్‌ఎస్‌ఆర్ రేట్ల ప్రకారం టెండర్లు ఖరారు చేశారు. అదే రేట్లను అనుసరించి పనులు చేస్తున్నారు. ఇప్పుడు ఫేజ్–2లో ప్రస్తుత లెక్కల ప్రకారం టెండర్లు పిలిస్తే ఇబ్బందులు తలెత్తే పరిస్థితి ఉంది. ఫేజ్–1లో పనులకూ ప్రస్తుత ఎస్‌ఎస్‌ఆర్ ధరల ప్రకారం బిల్లులు చెల్లించాలన్న వాదన తెరపైకి వచ్చే అవకాశం ఉంది.
Advertisement
Advertisement