చిత్తూరు మేయర్ ఎన్నికపై హైకోర్టులో అప్పీల్..?
చిత్తూరు అర్బన్ : చిత్తూరు కార్పొరేషన్‌లో తక్షణం మేయర్ ఎన్నిక నిర్వహించాలని కొందరు కార్పొరేటర్లు హైకోర్టును ఆశ్రయించినట్లు సమాచారం. ఇప్పటికే కార్పొరేషన్ పరిధిలో ఏప్రిల్ 15వ తేదీలోపు 33, 38 డివిజన్లకు ఉపఎన్నికలు నిర్వహించడంతో పాటు మేయర్ ఎన్నిక పూర్తి చేయాలని హైకోర్టు ఆదేశించింది.
అయితే గతంలో హైకోర్టు సింగిల్ బెంచ్ తీర్పులో ఖాళీగా ఉన్న వార్డులతో సంబంధం లేకుండా ప్రస్తుతం ఉన్న మహిళా కార్పొరేటర్ల నుంచి ఒకరిని మేయర్‌గా ఎన్నుకోవాలని తీర్పునిచ్చింది. దీనిపై గంగనపల్లెకు చెందిన కఠారి హేమలత హైకోర్టు డివిజన్ బెంచ్‌కు అప్పీల్ చేశారు. దాంతో 40 రోజుల్లో డివిజన్ ఎన్నికలు నిర్వహించి మేయర్‌ను ఎన్నుకోవాలని ఆదేశాలిచ్చింది. తాజాగా ఆ ఆదేశాలను అప్పీల్ చేస్తూ ఇద్దరు మహిళా కార్పొరేటర్లు హైకోర్టులో అప్పీల్ వేసినట్లు సమాచారం.