
శ్రీకాంత్ బుల్లెట్‌లా దూసుకొచ్చాడు
♦ క్రీడల్లో రాణిస్తే ప్రతి ఒక్కరికీ మంచి భవిష్యత్ ఉంటుంది
♦ బ్యాడ్మింటన్ స్టార్ శ్రీకాంత్ అభినందన సభలో సీఎం చంద్రబాబు
♦ క్రీడలను కెరీర్‌గా మలుచుకోండి సీఎం చంద్రబాబు నాయుడు
♦ బ్యాడ్మింటన్ స్టార్ శ్రీకాంత్‌కు ఘన సన్మానం
విజయవాడ స్పోర్ట్స్:
క్రీడల్లో ఆడడాన్ని గర్వకారణంగా భావించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రాబాబు నాయుడు అన్నారు. ఇండోనేషియా, ఆస్ట్రేలియా సూపర్ సిరీస్ టైటిల్ విజేత కిదాంబి శ్రీకాంత్‌ను రాష్ట్ర ప్రభుత్వం బుధవారం స్థానిక తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఘనంగా సన్మానించింది. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన సీఎం చంద్రబాబునాయుడు మాట్లాడుతూ క్రీడలు ప్రతి ఒక్కరి జీవితంలో భాగం కావాలన్నారు. రాష్ట్ర ప్రతిష్టతను చాటిన శ్రీకాంత్ అందరికీ స్ఫూర్తి కావాలని చెప్పారు. ఆస్ట్రేలియా సూపర్ సిరీస్ ఫైనల్ మ్యాచ్‌లో శ్రీకాంత్ ప్రదర్శించిన ఆత్మవిశ్వాసం తనకెంతో నచ్చిందన్నారు. బులెట్‌లా దూసుకొచ్చాడని పేర్కొన్నారు.
శ్రీకాంత్ గుంటూరు వాసి కావడడం మనకెంతో గర్వకారణమన్నారు. చదువుకుంటే కేవలం ఉద్యోగంతో స్థిరపడతారని, అదే క్రీడలను కెరీర్‌గా చేసుకొని రాణిస్తే ఆరోగ్యాన్నీ పెంపొందించుకోవచ్చని చెప్పారు. సమాజం, ప్రభుత్వం కూడా గుర్తిస్తుందన్నారు. ప్రపంచ స్థాయిలో రాష్ట్ర ప్రతిష్టతను చాటే ఏ క్రీడాకారుడికైనా నగదు నజరానాతోపాటు గ్రూపు–1 ఆఫీసర్ పోస్టు ఇచ్చేందుకు సిద్ధమని ప్రకటించారు.
అమరావతిలో స్పోర్ట్స్
యూనివర్సిటీ ఏర్పాటు చేస్తాం
శ్రీకాంత్ ఇకపై అంతర్జాతీయ స్థాయిలో ఎక్కడ ఆడాలనుకున్నా ఖర్చులన్నీ ప్రభుత్వం భరిస్తుందన్నారు. అమరావతిలో స్పోర్ట్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తామని సీఎం పునరుద్ఘటించారు. రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ ప్రపంచ స్థాయిలో రాష్ట్ర, దేశ ఖ్యాతిని చాటిన శ్రీకాంత్ అమరావతి వాసి కావడం గర్వకారణమన్నారు. కార్యక్రమంలో తొలుత క్రీడల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో క్రీడా వికాస కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని, ఇందులో ఇండోర్ స్టేడియం, ఔట్‌డోర్ స్టేడియం, రన్నింగ్, వాకింగ్ ట్రాక్‌లు ఉంటాయని వెల్లడించారు. నెదర్లాండ్ దేశం రాష్ట్ర క్రీడాభివృద్థిలో భాగం పంచుకునేందుకు ముందుకొచ్చిందన్నారు.
సన్మానం అనంతరం శ్రీకాంత్ మాట్లాడుతూ తాను ఈ స్థాయికి రావడానికి కారణం కోచ్ పుల్లెల గోపిచంద్ కృషి ఎంతో ఉందని చెప్పారు. ఆనాడు గోపిచంద్ అకాడమీకి స్థలం ఇవ్వడం వల్లే తనలాంటి ఎంతో మంది బ్యాడ్మింటన్ క్రీడాకారులు వెలుగులోకి వచ్చారన్నారు. శ్రీకాంత్ తల్లి రాధా ముకుంద మాట్లాడుతూ పిల్లల్ని క్రీడల్లో చేర్పించాలని సూచించారు. కార్యక్రమంలో మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, ప్రత్తిపాటి పుల్లారావు, మహిళా కమిషన్ చైర్‌పర్సన్ నన్నపనేని రాజకుమారి, మేయర్ కోనేరు శ్రీధర్, ఎమ్మెల్యే జలీల్‌ఖాన్, బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా కార్యదర్శి కేసీహెచ్ పున్నయ్య చౌదరి, జిల్లా అ«ధ్యక్షుడు కె.పట్టాభి, శాప్ ఓఎస్‌డీ పి.రామకృష్ణ, క్రీడా సంఘాలు, క్రీడాకారులు, విద్యార్థులు పాల్గొన్నారు. సన్మాన కార్యక్రమానికి మాజీ డీఎస్‌డీవో బీవీ ప్రసాద్ వ్యాఖ్యతగా వ్యవహరించారు. ఈ సందర్భంగా విదేశాల నుంచి తీసుకొచ్చిన రాకెట్‌ను సీఎం చంద్రబాబుకు శ్రీకాంత్ బహూకరించారు. అనంతరం వీరిద్దరూ వేదికపై బ్యాడ్మింటన్ ఆడి అలరించారు.
గుంటూరులో అభినందనలు
గుంటూరు స్పోర్ట్స్: యువ క్రీడాకారుడు శ్రీకాంత్ భారత దేశ కీర్తి ప్రతిష్టను అంతర్జాతీయ వేదికపై చాటి చెప్పాడని ఏపీ బ్యాడ్మింటన్ అసోసియేషన్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ రాయపాటి రంగారావు అన్నారు. అసోసియేషన్ కార్యవర్గ సభ్యులు శ్రీకాంత్‌ను అయన నివాసంలో కలిసి తిరుమల తిరుపతి దేవస్థాన దుశ్శాలువా కప్పి పుష్పగుచ్ఛం అందజేశారు. అనంతరం శ్రీకాంత్ తల్లిదండ్రులను అభినందించారు. కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యుడు సంపత్ కుమార్ పాల్గొన్నారు.